సింగిల్ ఛార్జ్ తో 543కిమీ ప్రయాణం.. క్రెటా కంటే రూ.లక్ష తక్కువకే లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ
భారతీయ మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV) మార్కెట్లో సరికొత్త పోరు మొదలైంది. ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) దేశీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారు అర్బన్ క్రూజర్ ఎబెల్లా (Urban Cruiser Ebella) టాప్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త కారు ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ (Hyundai Creta Electric) కారుకు నేరుగా సవాల్ విసురుతోంది. మీరు కూడా త్వరలోనే ఒక మంచి ఫ్యామిలీ ఈవీ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఫీచర్లు, ధర, రేంజ్ పరంగా ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షనో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
లగ్జరీ ఫీచర్లతో టయోటా ఎబెల్లా కేబిన్
ఫీచర్ల విషయానికి వస్తే టయోటా ఎబెల్లా కేబిన్‌ను చాలా ప్రీమియం లుక్‌తో డిజైన్ చేశారు. ఇందులో డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12 విభిన్న రంగులతో కూడిన యాంబియంట్ లైటింగ్, విశాలమైన పనోరమిక్ సన్ రూఫ్ ఉన్నాయి.

వెనుక కూర్చునే ప్రయాణికులు తమకు నచ్చినట్లు అడ్జస్ట్ చేసుకునేలా స్లైడ్ అండ్ రెక్లైన్ రేర్ సీట్ల సౌకర్యం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇందులో జేబీఎల్ (JBL) ప్రీమియం ఆడియో సిస్టమ్, 10.25 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు.
టెక్నాలజీలో తగ్గని హ్యుందాయ్ క్రెటా ఈవీ
మరోవైపు ఫీచర్ల రేసులో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో డ్రైవర్, కో-ప్యాసింజర్ కోసం 8 రకాలుగా అడ్జస్ట్ చేసుకునే ఎలక్ట్రిక్ సీట్లు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లాంగ్ జర్నీలో ఉపయోగపడే క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారులోని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులోని వెహికల్-టు-లోడ్ (V2L) టెక్నాలజీ ద్వారా కారు బ్యాటరీ నుండి మనం ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా వాడుకోవచ్చు. అలాగే క్రెటా ఈవీలో పెద్దదైన 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్, అంతే సైజు ఉన్న డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు.
బ్యాటరీ, రేంజ్.. రోడ్డుపై ఏ కారు కింగ్?
ఈ రెండు కార్ల పర్ఫార్మెన్స్ పరిశీలిస్తే పోరు చాలా రసవత్తరంగా ఉంది. టయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లాలో పెద్దదైన 61 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది 171 bhp పవర్‌ను, 193 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై ఈ కారు ఏకంగా 543 కిలోమీటర్ల గరిష్ట రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

దీనికి భిన్నంగా హ్యుందాయ్ క్రెటా ఈవీలో కొంచెం చిన్నదైన 51.4 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 168.9 bhp పవర్‌తో పాటు మెరుగైన 255 Nm టార్క్‌ను ఇస్తుంది. అంటే పిక్కప్ విషయంలో క్రెటా కొంచెం ముందుంటుంది. కాకపోతే దీని రేంజ్ 510 కిలోమీటర్లకే పరిమితం. రేంజ్ విషయంలో టయోటా ఎబెల్లా టాప్ గేర్‌లో దూసుకుపోతోంది.
వాల్యూ ఫర్ మనీలో టయోటాదే పైచేయి!
ఈ మొత్తం పోటీలో అసలైన ట్విస్ట్ ఈ కార్ల ధరల వద్దే ఉంది. టయోటా కంపెనీ తన ఎబెల్లా టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.23.60 లక్షలుగా నిర్ణయించింది. కాగా, హ్యుందాయ్ క్రెటా ఈవీ టాప్ వేరియంట్ ధర రూ.24.69 లక్షలుగా ఉంది.
అంటే హ్యుందాయ్ క్రెటా కంటే టయోటా ఎబెల్లా కారు ఏకంగా రూ.1.09 లక్షలు తక్కువ ధరకే లభిస్తోంది. తక్కువ ధర, పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్, టయోటా బ్రాండ్ ఇమేజ్ కలిసి వస్తుండటంతో.. కాగితంపై చూసుకుంటే క్రెటా కంటే టయోటా ఎబెల్లానే కస్టమర్లకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్‌గా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications