Acer Faster Awards 2026: అత్యున్నత గౌరవం దక్కించుకున్న మహీంద్రా కారు
భారత ఆటోమొబైల్ రంగంలో ప్రతిష్టాత్మకమైన అవార్డుల కార్యక్రమంగా పేరుగాంచిన ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ (Acer FASTER Awards) 2026 ఐదో ఎడిషన్‌ను గుర్గావ్, ఎన్‌సీఆర్‌లో ఘనంగా నిర్వహించారు. Federation of Auto Scribes of the Electronic Realm (FASTER) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో 2025 సంవత్సరంలో భారత ఆటో పరిశ్రమలో ఉత్తమ కార్లు, మోటార్‌సైకిళ్లను గుర్తించారు. ఈ అవార్డులకు ప్రధాన స్పాన్సర్‌గా ఏసర్ ఇండియా వ్యవహరించగా, అదనపు స్పాన్సర్‌గా స్పార్క్ మీడియా లిమిటెడ్ భాగస్వామ్యమైంది. ఈ భాగస్వామ్యంతో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆటోమొబైల్ తయారీ విభాగం మాత్రమే కాకుండా, ఇతర ముఖ్య విభాగాల్లోనూ ప్రతిభ కనబర్చిన మొత్తం 13 మంది విజేతలను సత్కరించారు.
ఈ FASTER ఈవెంట్ ఐదవ సంవత్సరం కావడం విశేషం. ఈ ఐదేళ్లలో స్వతంత్రంగా, కఠినమైన ప్రమాణాలతో, ఎటువంటి రాజీ లేకుండా వాహనాలను పరీక్షిస్తూ నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చిన అవార్డులుగా ఇవి గుర్తింపు పొందాయి. ఫాస్టర్ జడ్జింగ్ ప్యానెల్‌లో భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ డిజిటల్ మీడియా వేదికల నుంచి ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారు. వీరి వేదికలు ఆరు భాషల్లో ప్రతినెల 250 మిలియన్లకు పైగా పాఠకులను చేరుకుంటుండటం విశేషం.

ప్రతిష్టాత్మకమైన ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ 2026 వేడుకలో ఈసారి ప్రముఖ వాహనాలు తమ ప్రతిభను నిరూపించుకుని అత్యున్నత గౌరవాలను సొంతం చేసుకున్నాయి. భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న Mahindra XEV 9e 'కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకుని ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక రెండు చక్రాల విభాగంలో TVS Apache RTX 'మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకుంది.
స్కూటర్ విభాగంలో Suzuki Access 125 'స్కూటర్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచింది. నమ్మకమైన పనితీరు, ఇంధన సామర్థ్యం, వినియోగదారులకు అనుకూలమైన డిజైన్ దీనికి ఈ గౌరవాన్ని తీసుకొచ్చాయి. అదేవిధంగా, ఆటో డిజైన్ విభాగంలో Tata Sierra 'డిజైన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును సొంతం చేసుకుంది. సరికొత్త రూపకల్పన, ఆధునిక శైలితో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అవార్డుల ఎంపికలో ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా ప్రత్యక్షంగా పరీక్షించారు.

స్పెసిఫికేషన్లు మాత్రమే కాకుండా, రోడ్డు పనితీరు, భద్రత, టెక్నాలజీ, డ్రైవింగ్ అనుభవం వంటి అంశాలను విశ్లేషించి తుది నిర్ణయం తీసుకున్నారు. జ్యూరీ సభ్యులుగా ప్రముఖ ఆటోమొబైల్ జర్నలిస్టులు పనిచేశారు. వీరిలో గడివాడికి చెందిన గౌరవ్ యాదవ్, డ్రైవ్‌స్పార్క్‌కు చెందిన ప్రమీత్ ఘోష్, పైలట్ ఆన్ వీల్స్‌కు చెందిన రోషన్ జోసెఫ్, కార్‌బ్లాగ్ ఇండియాకు చెందిన రోహిత్ ఖురానా, మోటరాయిడ్‌కు చెందిన అమిత్ చంగాని, గేర్‌ఫ్లిక్‌కు చెందిన నరైన్ శర్మ ఉన్నారు.
ఈ ఏడాది ఎలక్ట్రిక్, ప్రీమియం విభాగాల్లో కూడా ప్రముఖ వాహనాలు అత్యున్నత గౌరవాలను సొంతం చేసుకున్నాయి. భారత ఎలక్ట్రిక్ రెండు చక్రాల విభాగంలో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న Ultraviolette X47 'ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకుంది. ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీ, శక్తివంతమైన పనితీరు, భవిష్యత్‌శైలి డిజైన్ కారణంగా ఈ మోడల్ జ్యూరీని ఆకట్టుకుంది.

ప్రీమియం కార్ల విభాగంలో BMW X3 'ప్రీమియం కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకుంది. లగ్జరీ, సాంకేతికత, డ్రైవింగ్ డైనమిక్స్ కలిసిన సమతుల్యమైన SUVగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక భారతీయ కుటుంబాలకు దశాబ్దాలుగా విశ్వాసాన్ని అందిస్తున్న Honda Activa 'టైమ్‌లెస్ ఐకాన్' అవార్డును సొంతం చేసుకుంది. ఇరవై సంవత్సరాలుగా మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతూ, విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచినందుకు ఈ గౌరవం లభించింది.


Click it and Unblock the Notifications








