లాంగ్ రైడ్స్ చేసే వాళ్లకు ఇక పండగే పండగ.. బ్యాక్ పెయిన్ రాకుండా అప్రిలియా నుంచి సరికొత్త బైక్
బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది.. ప్రముఖ ప్రీమియం టూ-వీలర్ల తయారీ సంస్థ అప్రిలియా (Aprilia), అంతర్జాతీయ వరల్డ్ మోటార్‌సైకిల్ డే సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో సరికొత్త 2026 అప్రిలియా టువొనో 457 స్పెషల్ ఎడిషన్ (Aprilia Tuono 457 Special Edition) బైక్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది.. రేసింగ్ ట్రాక్‌లపై దూసుకెళ్లే బైకులకు పెట్టింది పేరైన అప్రిలియా, ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.3.99 లక్షలుగా నిర్ణయించింది.. 2006 నాటి క్లాసిక్ మోడల్ టువొనో 1000ఆర్ స్పూర్తితో దీనిని ముస్తాబు చేశారు.
విశేషం ఏంటంటే, ఇది మార్కెట్లో ఉన్న రెగ్యులర్ (స్టాండర్డ్) మోడల్ ధర కంటే కేవలం రూ.2,000 మాత్రమే ఎక్కువ. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన అప్రిలియా షోరూమ్‌లలో దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డిజైన్ పరంగా ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ చూడటానికి ఎంతో అగ్రెసివ్‌గా, స్పోర్టీగా కనిపిస్తుంది. దీనిని కస్టమర్ల కోసం రెండు సరికొత్త ప్రీమియం కలర్ ఆప్షన్లలో కంపెనీ తీసుకొచ్చింది.

అందులో ఒకటి మాంబా బ్లాక్ (Mamba Black) కాగా, మరొకటి ప్యూమా గ్రే (Puma Grey). హైవేలపై వేగంగా వెళ్లేటప్పుడు గాలి ఒత్తిడి నేరుగా రైడర్‌పై పడకుండా ఉండేందుకు వీలుగా దీని ముందు భాగంలో సరికొత్త స్మోక్డ్ ఫ్లైస్క్రీన్‌ను అమర్చారు. హై-ఇంపాక్ట్ మెటీరియల్‌తో తయారైన ఈ ఫ్లైస్క్రీన్ లాంగ్ రైడింగ్ చేసేటప్పుడు రైడర్ అలసటను చాలా వరకు తగ్గిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ స్పెషల్ ఎడిషన్‌లో కస్టమర్ల సౌకర్యార్థం అప్రిలియా సంస్థ కొన్ని కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా బైక్ హ్యాండిల్ బార్ ఎత్తును మునుపటి కంటే కొద్దిగా పెంచింది. దీనివల్ల రైడర్ వంగి కాకుండా, నేరుగా నిటారుగా కూర్చుని బైక్ నడపవచ్చు. ఈ సరికొత్త రైడింగ్ పొజిషన్ వల్ల సిటీ ట్రాఫిక్‌లో తిరిగినా లేదా లాంగ్ ట్రిప్స్ వెళ్లినా కూడా మణికట్టు, భుజాలు, నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉండవు.
దీనితో పాటు బైక్ సీటును మరింత మెరుగైన హై-రెసిలియన్స్ ఫోమ్‌తో అప్‌గ్రేడ్ చేశారు. గుంతల రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగేందుకు వీలుగా దీని సస్పెన్షన్‌ను కొద్దిగా సాఫ్ట్‌గా మార్చారు. కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా ఈ సస్పెన్షన్‌ను అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. రైడర్ల సేఫ్టీ, బైక్ కంట్రోల్ కోసం ఇందులో 'అడ్జస్టబుల్ బ్రేక్ లివర్'ను జత చేశారు. దీనివల్ల రైడర్లు తమ చేతి వేళ్ల సైజుకు అనుగుణంగా బ్రేక్ లివర్ దూరాన్ని సెట్ చేసుకోవచ్చు, ఇది ఎమర్జెన్సీ బ్రేకింగ్ సమయంలో పటిష్టమైన గ్రిప్‌ను ఇస్తుంది.

ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో మునుపటి పవర్‌ఫుల్ 457 సీసీ, పారలల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అలాగే కొనసాగించారు. ఇది గరిష్టంగా 47.6 బిహెచ్‌పి పవర్, 43.5 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. బైక్‌లో ఫుల్-ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే కలర్ టీఎఫ్‌టీ (TFT) ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందించారు.
లాంచ్ సందర్భంగా పియాజియో వెహికల్స్ చైర్మన్ డీగో గ్రాఫీ మాట్లాడుతూ.. భారతీయ రోడ్ల పరిస్థితిని, రైడర్ల కంఫర్ట్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా రూపుదిద్దినట్లు తెలిపారు. కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడానికి ఈ బైక్‌పై కంపెనీ ఏకంగా 4 సంవత్సరాలు లేదా 48,000 కిలోమీటర్ల వరకు వారంటీని ఉచితంగా అందిస్తోంది.
ఇది కాకుండా బైక్‌ను మరింత మోడిఫై చేసుకోవాలనుకునే వారి కోసం క్విక్‌షిఫ్టర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్, దొంగతనం జరగకుండా కాపాడే ఎలక్ట్రానిక్ యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ వంటి ప్రీమియం యాక్సెసరీలను కూడా కంపెనీ విడిగా విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications