4.1 సెకన్లలోనే 100 కి.మీ వేగం.. రూ.5 లక్షలతో లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ అయిన మీ డ్రీమ్ కారును బుక్ చేసుకోండి
జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి (Audi), భారతీయ కార్ లవర్స్ కోసం మరో పవర్‌ఫుల్ మెషీన్‌ను సిద్ధం చేసింది. తన పాపులర్ ఎస్‌యూవీ లైనప్‌లో స్పోర్టియర్ వెర్షన్‌గా వస్తున్న ఆడి ఎస్‌క్యూ8 (Audi SQ8) లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. మార్చి 17, 2026న ఢిల్లీ వేదికగా ఈ కారును అధికారికంగా విడుదల చేయనున్నారు. అయితే, లాంచ్‌కు ముందే ఈ కారు బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్లు రూ. 5 లక్షల టోకెన్ అమౌంట్ చెల్లించి ఆడి ఇండియా వెబ్‌సైట్ లేదా మై ఆడి కనెక్ట్ యాప్ ద్వారా ఈ లగ్జరీ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు. సాధారణ క్యూ8 (Q8), అత్యంత పవర్ఫుల్ ఆర్ఎస్ క్యూ8 (RS Q8) మధ్యలో ఈ ఎస్‌క్యూ8 నిలవనుంది.
ఇంజిన్ పవర్ - స్పీడ్
ఆడి ఎస్‌క్యూ8 కేవలం లగ్జరీ కారు మాత్రమే కాదు.. ఇదో పవర్ హౌస్. దీని బోనెట్ కింద 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 TFSI పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది ఏకంగా 500hp పవర్‌ను, 770Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జత చేయబడింది. ఆడి సిగ్నేచర్ క్వాట్రో (quattro) ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా శక్తి నాలుగు చక్రాలకు సమానంగా అందుతుంది.

దీని స్పీడు గురించి చెప్పాలంటే.. ఇది కేవలం 4.1 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లకు (ఎలక్ట్రానిక్ లిమిటెడ్) పరిమితం చేశారు. రోడ్డుపై బండి ఎంత వేగంగా వెళ్లినా కంట్రోల్ తప్పకుండా ఉండటానికి ఇందులో అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ఆల్-వీల్ స్టీరింగ్ ఫీచర్లు ఉన్నాయి.
డిజైన్, ఎక్స్టర్నల్ లుక్
సాధారణ క్యూ8 మోడల్‌తో పోలిస్తే ఎస్‌క్యూ8 మరింత దూకుడుగా, స్పోర్టిగా కనిపిస్తుంది. ముందు భాగంలో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్, ఎస్-డివిజన్ ప్రత్యేక బ్యాడ్జింగ్, మ్యాట్ సిల్వర్ ఫినిషింగ్ ఎలిమెంట్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. వెనుక భాగంలో క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ (నాలుగు సైలెన్సర్ పైపులు) మరియు పెద్ద సైజు అలాయ్ వీల్స్ ఈ కారు పర్ఫార్మెన్స్‌ను చాటి చెబుతాయి. కూపే తరహా రూఫ్ లైన్ ఉండటం వల్ల ఇది ఒక ఎస్‌యూవీ అయినప్పటికీ, స్పోర్ట్స్ కార్ లాంటి ఫీల్‌ను కలిగిస్తుంది.

లగ్జరీ ఇంటీరియర్ - అదిరిపోయే ఫీచర్లు
కారు లోపలి భాగం రాజభవనాన్ని తలపిస్తుంది. అల్కాంటారా, లెదర్ అపోల్స్టరీతో క్యాబిన్‌ను చాలా విలాసవంతంగా తీర్చిదిద్దారు. డ్యాష్‌బోర్డ్‌పై రెండు 12.3-అంగుళాల భారీ డిస్‌ప్లేలు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం కాగా, మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం. ఇందులో ఆడి ఎస్-డివిజన్ ప్రత్యేక గ్రాఫిక్స్‌ను మనం చూడవచ్చు.
వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి. ఆడి లేటెస్ట్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. "రోజువారీ లగ్జరీ, స్పోర్టి పర్ఫార్మెన్స్ రెండింటినీ కోరుకునే వారికి ఎస్‌క్యూ8 ఒక సరైన ఎంపిక. భారతదేశంలో ఇప్పటికే క్యూ8 కుటుంబానికి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే, ఈ కొత్త ఎస్‌క్యూ8 కూడా కస్టమర్ల మనసు గెలుచుకుంటుందని మాకు నమ్మకం ఉంది. ఇది చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది, కాబట్టి ఆసక్తి ఉన్నవారు త్వరగా బుక్ చేసుకోవాలి" అని తెలిపారు. లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో ఆడి ఎస్‌క్యూ8 రాకతో పోటీ మరింత పెరగనుంది.


Click it and Unblock the Notifications








