కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా ? మీకున్న లీగల్ హక్కులు తెలిస్తే బ్యాంకులు మిమ్మల్ని భయపెట్టలేవు
సొంత కారు కొనుక్కోవాలన్న కోరికతో చాలా మంది కొంత డౌన్‌పేమెంట్ కట్టి మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీల ద్వారా లోన్ తీసుకుంటారు. అంతా సజావుగా సాగినంత కాలం నెలకు కరెక్ట్‌గా ఈఎంఐలు చెల్లిస్తారు. కానీ ఏదైనా వ్యక్తిగత లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితుల వల్ల ఒకటి లేదా రెండు ఈఎంఐలు కట్టడం ఆలస్యమైతే చాలు.. అప్పు ఇచ్చిన సంస్థల నుంచి కంటిన్యూగా కాల్స్ రావడం, రికవరీ ఏజెంట్లు ఇంటికి రావడం మొదలవుతుంది. ఈ సమయంలో కస్టమర్లకు తీవ్రమైన మానసిక ఒత్తిడి కలగడమే కాకుండా, ఎక్కడ తమ కారు లేదా బైక్‌ను సీజ్ చేసి పట్టుకుపోతారో అనే భయం వెంటాడుతుంది. అయితే ఇలాంటి సమయంలో మీ హక్కులను తెలుసుకోవడం చాలా అవసరం.
బ్యాంకులు మీ కారును నేరుగా జప్తు చేయవచ్చా?
చాలా మందికి ఒకటి లేదా రెండు ఈఎంఐలు మిస్సవగానే బ్యాంక్ వాళ్లు వచ్చి బండిని ఎత్తుకెళ్తారనే పెద్ద భయం ఉంటుంది. కానీ ఆర్‌బీఐ (RBI) నియమ నిబంధనల ప్రకారం.. అలా అకస్మాత్తుగా వాహనాన్ని సీజ్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. కేవలం ఒకటి లేదా రెండు ఈఎంఐలు కట్టనంత మాత్రాన ఏ ఫైనాన్స్ కంపెనీ కూడా మీ బండిని లాక్కెళ్లలేదు.

దీనికి సంబంధించి బ్యాంక్ బోర్డు ఆమోదించిన ఒక నిర్దిష్టమైన రికవరీ పాలసీ ఉంటుంది. కస్టమర్ లోన్ అగ్రిమెంట్‌ను పూర్తిగా ఉల్లంఘించి, వరుసగా డిఫాల్ట్ అయినప్పుడు మాత్రమే చట్టబద్ధమైన చర్యలు ప్రారంభమవుతాయి తప్ప, అర్ధరాత్రి పూటో లేదా రోడ్డుపై వెళ్తున్నప్పుడో బండిని ఆపి బలవంతంగా లాక్కోవడం కుదరదు.
కార్ సీజ్ చేయడానికి ముందు నోటీసు ఇవ్వాల్సిందే
ఆర్‌బీఐ ఫేర్ ప్రాక్టీస్ కోడ్ ప్రకారం.. లోన్ తీసుకున్న ప్రతి కస్టమర్‌కు రికవరీ ప్రక్రియ గురించి ముందుగా తెలుసుకునే పూర్తి హక్కు ఉంది. బ్యాంకు మీ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముందు ఖచ్చితంగా గడువుతో కూడిన లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి.

ఏ పరిస్థితుల్లో బండిని జప్తు చేస్తారు, ఆ తర్వాత దానిని ఎలా వేలం వేస్తారు అనే వివరాలు లోన్ అగ్రిమెంట్‌లో స్పష్టంగా ఉండాలి. అంతేకాకుండా, మీ కేసును ఏ రికవరీ ఏజెన్సీకి అప్పగించారో ఆ వివరాలను, సదరు ఏజెన్సీ అడ్రస్, ఫోన్ నంబర్లను బ్యాంకు ముందుగానే కస్టమర్‌కు తెలియజేయడం చట్టరీత్యా తప్పనిసరి.
రికవరీ ఏజెంట్లు మీపై దౌర్జన్యం చేయవచ్చా?
లోన్ కట్టలేదనే నెపంతో కస్టమర్లను బెదిరించే హక్కు ఏ బ్యాంక్‌కు లేదా రికవరీ ఏజెంట్‌కు లేదు. కస్టమర్లతో ఎల్లప్పుడూ మర్యాదగా ప్రవర్తించాలని ఆర్‌బీఐ రూల్స్ చెబుతున్నాయి. మీ ఇంటికి వచ్చే రికవరీ ఏజెంట్ల వద్ద ఖచ్చితంగా బ్యాంకు ఇచ్చిన ఆథరైజేషన్ లెటర్, వారి వాలిడ్ ఐడీ కార్డ్ ఉండాలి. మిమ్మల్ని నలుగురిలో అవమానించడం, బూతులు తిట్టడం లేదా శారీరకంగా దౌర్జన్యం చేయడం చట్టప్రకారం నేరం.

ఒకవేళ ఎవరైనా ఏజెంట్ మీతో అలా ప్రవర్తిస్తే, వెంటనే మీ మొబైల్ లో వీడియో రికార్డింగ్ చేయండి. ఆ ఆధారంతో బ్యాంకు గ్రీవెన్స్ సెల్‌కు లేదా నేరుగా ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అవసరమైతే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు.
బండి సీజ్ చేసినా కూడా తిరిగి పొందే అవకాశం ఉందా?
చాలా మంది కస్టమర్లు తమ వాహనం ఒకసారి సీజ్ అయిపోతే ఇక అది తిరిగి రాదని భావిస్తారు. కానీ అది తప్పు. మీ వాహనాన్ని బ్యాంకు వేలం వేయడానికి (Auction) ముందు, లోన్ అకౌంట్‌ను క్లియర్ చేసి, బకాయిలను సెటిల్ చేసుకోవడానికి బ్యాంకు కస్టమర్‌కు ఆఖరి అవకాశం ఇవ్వాలి.
దీని కోసం ప్రీ-సేల్ నోటీసు పంపడం తప్పనిసరి. కోర్టులు, నియంత్రణ సంస్థలు కూడా బ్యాంకులు తమ ఇష్టానుసారంగా కస్టమర్ల హక్కులను కాలరాస్తూ సొంతంగా వేలం వేయకూడదని పదే పదే హెచ్చరించాయి. కాబట్టి గడువు లోపల పెండింగ్ ఈఎంఐలు కట్టేసి మీ వాహనాన్ని మళ్లీ క్లెయిమ్ చేసుకోవచ్చు.
వాహనం వేలం వేయగా మిగిలిన సొమ్ము కస్టమర్‌కే దక్కుతుంది
ఇక్కడ లోన్ తీసుకున్న వారు ఒక ముఖ్యమైన ఆర్థిక హక్కును గుర్తుంచుకోవాలి. బ్యాంకు మీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, దానిని వేలం వేసినప్పుడు వచ్చే డబ్బు కేవలం బ్యాంకు బకాయిల కోసమే వాడుకోవాలి.
ఒకవేళ వేలం ద్వారా వచ్చిన మొత్తం.. మీ మిగిలిన లోన్ బాకీ, దానికి అయిన వడ్డీ, రికవరీ ఖర్చుల కంటే ఎక్కువగా ఉంటే.. ఆ మిగిలిన అదనపు సొమ్మును (Surplus Amount) బ్యాంకు ఖచ్చితంగా కస్టమర్‌కే తిరిగి ఇచ్చేయాలి. ఇందుకోసం వేలం ముగిసిన తర్వాత సేల్ వాల్యూ, లోన్ డ్యూస్, రికవరీ ఖర్చులతో కూడిన పూర్తి ఫైనల్ సెటిల్‌మెంట్ స్టేట్మెంట్ను బ్యాంకు నుంచి అడిగి మరీ తీసుకోవాలి.


Click it and Unblock the Notifications