3 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జీ.. ఒక్కసారి చేస్తే 252 కిమీల జర్నీ.. భారత మార్కెట్లోకి అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) ఆదరణ వేగంగా పెరుగుతుంది. అయినా చాలా మంది కస్టమర్లు ఇంకా ఈవీ కార్లు కొనడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. లాంగ్ జర్నీ చేసేటప్పుడు గంటల కొద్దీ ఛార్జింగ్ పెట్టాల్సి రావడం, అలాగే బ్యాటరీ రేంజ్ ఎక్కడ అయిపోతుందో అనే భయమే ఇందుకు ప్రధాన కారణం.
అయితే ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసేందుకు గురుగ్రామ్‌కు చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ బ్లింక్ మోబిలిటీ (Blinq Mobility) నడుం బిగించింది. ఎలాంటి సూపర్ ఛార్జర్ అవసరం లేకుండా, కేవలం 3 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఈ సంస్థ సిద్ధం చేస్తోంది.

బ్లింక్ మోబిలిటీ తయారు చేస్తున్న ఈ సరికొత్త బడ్జెట్ కారుకు కంపెనీ ఇంకా అధికారిక పేరును ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి దీనిని కార్ 001 (car 001) అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తున్నారు. ఇటీవల ఈ సంస్థ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను షేర్ చేయగా, అందులో ఈ కారు దాదాపు పూర్తిగా తయారై రోడ్ టెస్టులకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది.
ఈ కారు లోపల ఒక పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. కారులో బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోగానే ఈ స్క్రీన్ డ్రైవర్‌ను అలర్ట్ చేయడమే కాకుండా, కారుకు సమీపంలో ఎక్కడ బ్యాటరీ స్వ్యాపింగ్ స్టేషన్ ఉందో రూట్ మ్యాప్ ద్వారా చూపిస్తుంది. భారతీయ ఈవీ కార్లలో ఇలాంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ రావడం ఇదే తొలిసారి.

ఈ కారుకు ఇంత తక్కువ సమయంలో ఫుల్ ఛార్జింగ్ ఎలా వస్తుందనే దానికి సమాధానం బ్యాటరీ స్వ్యాపింగ్ టెక్నాలజీ. ఇందుకోసం బ్లింక్ కంపెనీ గురుగ్రామ్‌లో అత్యాధునిక, పూర్తి ఆటోమేటిక్ స్వ్యాపింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే.. మొదట కారును స్టేషన్‌లోని ఒక ప్రత్యేక ర్యాంప్‌పైకి తీసుకెళ్లాలి.
ఆ తర్వాత డ్రైవర్ కారు లోపల ఉండే రొటరీ కంట్రోలర్ సహాయంతో స్వ్యాప్ మోడ్ ఆన్ చేయాలి. మోడ్ ఆన్ అవ్వగానే మెషిన్ రెండు క్లాంప్‌లు కారు చక్రాలను గట్టిగా లాక్ చేస్తాయి. ఆ వెంటనే కింద ఉన్న ఆటోమేటిక్ రోబోటిక్ మెషిన్ ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా డిశ్చార్జ్ అయిన పాత బ్యాటరీని తీసేసి, దాని స్థానంలో వంద శాతం ఛార్జ్ అయిన కొత్త బ్యాటరీని అమరుస్తుంది.

కంపెనీ విడుదల చేసిన వీడియో ప్రకారం, పాత బ్యాటరీని తీసి కొత్త బ్యాటరీని అమర్చే ఈ మొత్తం ప్రక్రియ కేవలం 2 నిమిషాల 48 సెకన్లలోనే పూర్తవుతుంది. అంటే మూడు నిమిషాల కంటే తక్కువ టైమ్‌లోనే కారు ప్రయాణానికి సిద్ధమైపోతుంది. కొత్త బ్యాటరీ ఫిట్ అవ్వగానే కారులోని సిస్టమ్ ఆటోమేటిక్‌గా సేఫ్టీ చెక్ రన్ చేస్తుంది.
ఆ వెంటనే స్క్రీన్‌పై 100% ఛార్జింగ్‌తో పాటు 252 కిలోమీటర్ల రేంజ్ కనిపిస్తుంది. ఈ కారును మోడ్రన్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్ పై తయారు చేయడం వల్ల దీని బ్యాటరీ చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ గనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నగరాల్లో నివసించే వారికి ఛార్జింగ్ వెయిటింగ్ తిప్పలు పూర్తిగా తప్పుతాయి.
ఈ వినూత్నమైన ఆలోచన వెనుక అత్యంత అనుభవజ్ఞులైన నిపుణుల బృందం ఉంది. బ్లింక్ మోబిలిటీ సంస్థను ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) మాజీ విద్యార్థి నికేష్ బిష్త్ ప్రారంభించారు. కాగా ఈ కంపెనీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (CTO)గా అంకిత్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఇతనికి గతంలో ప్రపంచ ప్రసిద్ధ ఈవీ దిగ్గజం టెస్లా (Tesla) కంపెనీలో పనిచేసిన గొప్ప అనుభవం ఉంది.
టెస్లాలో ఉన్నప్పుడు ఎంతో పాపులర్ అయిన సైబర్‌ట్రక్, రోబోటాక్సీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో అంకిత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ మేజిక్ ఈవీ కారు ప్రోటోటైప్‌ను గురుగ్రామ్ రోడ్లపై రాత్రి పగలు కఠినమైన రోడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఇది మార్కెట్లోకి అతి తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications