రూ.5 లక్షల కన్నా తక్కువ ధరకే స్టైలిష్ కారు? త్వరలోనే లాంచ్! ఇది టాటా-మారుతి నుంచి మాత్రం కాదు
రెనాల్ట్ ఇండియా (Renault India) భారత మార్కెట్లో క్రమంగా తన స్థానాన్ని బలపరుచుకుంటూ ఒక ప్రముఖ కార్ల తయారీదారుగా ఎదుగుతోంది. ఇప్పటికే 2025లో ట్రైబర్ MPV, కైగర్ SUVలకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను పరిచయం చేసి కస్టమర్ల దృష్టిని ఆకర్షించిన సంస్థ, ఇప్పుడు తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా కొత్త రూపంలో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రెనాల్ట్ క్విడ్ మంచి డిజైన్, తక్కువ ధర, మంచి మైలేజ్‌తో యువతను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే క్విడ్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రాబోతోందన్న వార్త ఆటో రంగంలో ఆసక్తి రేపుతోంది. ఇటీవల ఈ కొత్త మోడల్ టెస్ట్ డ్రైవ్‌ల సమయంలో కనిపించగా, దాని స్పై ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో కారు అభిమానుల్లో చర్చ మొదలైంది.
టెస్ట్ మ్యూల్ పూర్తిగా కేమోఫ్లాజ్‌తో కప్పబడి ఉండటం గమనార్హం. ముఖ్యంగా ముందు భాగం, లోగోలు, అలాగే టెయిల్ ల్యాంప్‌లు పూర్తిగా కవర్ చేయబడ్డాయి. దీనివల్ల పూర్తి డిజైన్‌ను స్పష్టంగా చూడలేకపోయినా, కారు స్టాన్స్ మాత్రం మరింత బలంగా, ఆకర్షణీయంగా కనిపించింది. ముందు భాగంలో కొత్త LED హెడ్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ స్టైల్ LED DRLలు ఉండే అవకాశం ఉంది. ఇవి క్విడ్‌కు మరింత మోడర్న్ లుక్‌ను అందించనున్నాయి.

సైడ్ ప్రొఫైల్‌ను పరిశీలిస్తే, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు మరింత ప్రీమియంగా కనిపించనుంది. గత మోడల్‌తో పోలిస్తే ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కొంచెం వెడల్పుగా ఉండే అవకాశముందని సమాచారం. దీని వల్ల రోడ్డుపై మరింత స్టేబుల్ స్టాన్స్‌తో పాటు లోపలి స్పేస్‌లో కూడా స్వల్ప మెరుగుదల ఉండవచ్చు. అప్‌డేట్ కానున్న రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో 5-సీట్ల లేఅవుట్ కొనసాగనుంది.
చిన్న కార్ అయినప్పటికీ, సరిగ్గా డిజైన్ చేసిన కేబిన్ వల్ల ముందు, వెనుక ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చునేలా ఉండనుంది. నగర ప్రయాణాల్లోనూ, కుటుంబంతో కలిసి షార్ట్ ట్రిప్‌లకైనా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. బూట్ స్పేస్ సుమారు 279 లీటర్ల సామర్థ్యం ఉండే అవకాశం ఉంది. ఈ విస్తృత స్థలం కారణంగా వారాంతపు ట్రిప్‌లు లేదా సెలవు దినాల్లో దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అవసరమైన బ్యాగులు, చిన్న సామాను సులభంగా సర్దుకోవచ్చు.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, పెద్దగా మార్పులు ఉండవని సమాచారం. ఇదే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగనుంది. ఈ ఇంజిన్ సుమారు 68 PS శక్తిని, 91 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర డ్రైవింగ్‌కు తగిన పవర్ డెలివరీతో పాటు, తక్కువ నిర్వహణ ఖర్చులు ఈ కార్ ప్రత్యేకతగా నిలుస్తాయి. గేర్‌బాక్స్ ఎంపికలో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ (AMT) ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.
మైలేజ్ పరంగా కూడా ఇది ఆకర్షణీయంగానే ఉండనుంది. సుమారు 22 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందించే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో కేవలం బయటి డిజైన్ మాత్రమే కాకుండా, క్యాబిన్‌లో కూడా గణనీయమైన మార్పులు ఉండే అవకాశం ఉందని ఆటో వర్గాలు చెబుతున్నాయి. ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ, ఈసారి క్విడ్‌ను మరింత ప్రీమియంగా చూపించేలా ఇంటీరియర్ డిజైన్‌ను అప్‌డేట్ చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ మరింత మోడర్న్‌గా ఉండే అవకాశం ఉంది. మధ్య భాగంలో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇవ్వవచ్చని అంచనాలు ఉన్నాయి. దీనికి ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. దీంతో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరింత సులభమవుతుంది. లాంచ్ విషయానికి వస్తే, అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఈ సంవత్సరంలోనే మార్కెట్లోకి తీసుకురావచ్చు.
ధర పరంగా కూడా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఉంది. సుమారు రూ.5 లక్షల లోపే ప్రారంభ ధర ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న క్విడ్ ధర రూ.4.30 లక్షల నుంచి రూ.5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.


Click it and Unblock the Notifications








