సింగిల్ ఛార్జ్‌తో 950 కిలోమీటర్లు.. కారు లోపల టీవీ, ఫ్రిజ్..ఇది కారు కాదు రోడ్డుపై వెళ్లే బుల్లెట్ రైలు
ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న చైనా దిగ్గజం BYD(Build Your Dreams), తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ BYD గ్రేట్ టాంగ్ (Great Tang)తో ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో ఆకట్టుకున్న ఈ కారు మార్చి 5, 2026న అధికారికంగా లాంచ్ అయింది. ఈ సందర్భంగా కంపెనీ విడుదల చేసిన ఇంటీరియర్ ఫోటోలు, ఫీచర్లు చూస్తుంటే, ఇది కేవలం కారు మాత్రమే కాదు, రోడ్డుపై వెళ్లే ఒక విలాసవంతమైన విల్లా అనిపిస్తోంది. ఏకంగా 950 కిలోమీటర్ల రేంజ్, 4 భారీ స్క్రీన్లు, లిడార్ (LiDAR) టెక్నాలజీ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ కారు రూపొందింది.
BYD గ్రేట్ టాంగ్ లోపలికి అడుగుపెడితే మనకు ఒక ఫ్యూచరిస్టిక్ ప్రపంచం కనిపిస్తుంది. ఇందులో 2+2+3 సీటింగ్ లేఅవుట్ ఇచ్చారు. అంటే మొత్తం ఏడుగురు ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. డాష్‌బోర్డ్‌పైనే మూడు భారీ స్క్రీన్‌లు అమర్చారు.

ఇందులో ఒకటి డ్రైవర్ కోసం డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మధ్యలో మెయిన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మూడవది కో-ప్యాసింజర్ ఎంటర్టైన్మెంట్ కోసం ప్రత్యేక స్క్రీన్. ఇక వెనుక సీట్లో కూర్చునే వారి కోసం అదనంగా మరొక స్క్రీన్‌ను కారు పైకప్పుకు (Roof) అమర్చారు. దీనివల్ల లాంగ్ జర్నీలో వెనుక కూర్చునే ప్యాసింజర్లు తమకు నచ్చిన సినిమాలు, టీవీ షోలు చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.
సౌకర్యాలకు కేరాఫ్ అడ్రస్
కేవలం స్క్రీన్లే కాదు, ప్రయాణికుల విలాసం కోసం ఇందులో ఇన్-బిల్ట్ రిఫ్రిజిరేటర్ కూడా ఉంది. ఎండకాలంలో చల్లని పానీయాలను కారులోనే ఆస్వాదించవచ్చు. దీనితో పాటు చిన్న ఫోల్డింగ్ టేబుల్స్ కూడా ఇచ్చారు, దీనివల్ల ప్రయాణంలో ల్యాప్‌టాప్‌లు వాడుకోవడానికి లేదా భోజనం చేయడానికి వీలుగా ఉంటుంది.

ఈ ఎస్‌యూవీ పొడవు దాదాపు 5.3 మీటర్లు ఉండటంతో లోపల లెగ్‌రూమ్, స్పేస్ విషయంలో రాజీ పడలేదు. భారీ వీల్‌బేస్ కారణంగా మూడవ వరుసలో కూర్చునే వారికి కూడా ఎక్కడా ఇబ్బంది కలగదు. పైకప్పున ఉన్న పనోరమిక్ సన్‌రూఫ్ కారుకు మరింత రిచ్ లుక్‌ని ఇస్తుంది.
అద్భుతమైన రేంజ్, పర్ఫార్మెన్స్
ఈ కారులోని అసలైన మ్యాజిక్ దాని బ్యాటరీ, రేంజ్. BYD స్వయంగా తయారు చేసిన పవర్ఫుల్'బ్లేడ్ బ్యాటరీ'ని ఇందులో వాడారు. రేర్ వీల్ డ్రైవ్ (RWD) మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 950 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి, మళ్ళీ వెనక్కి వచ్చి, మళ్ళీ వెళ్ళేంత ఛార్జింగ్ ఉంటుందన్నమాట.

ఇక ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్ 850 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది గంటకు 250 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించగలగడం ఈ కారులోని అత్యంత గొప్ప విషయం.
లిడార్ టెక్నాలజీతో హై-టెక్ సెక్యూరిటీ
టెక్నాలజీ పరంగా BYD గ్రేట్ టాంగ్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. కారు పైకప్పుపై LiDAR సెన్సార్‌ను అమర్చారు. ఇది గాడ్స్ ఐ(God's Eye) అనే అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అంటే కారు తనంతట తానుగా చుట్టుపక్కల ఉన్న అడ్డంకులను గుర్తించి, ప్రమాదాలు జరగకుండా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది.

లేదా ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. అలాగే రియర్ వీల్ స్టీరింగ్ ఫీచర్ వల్ల ఇంత పెద్ద కారును కూడా ట్రాఫిక్‌లో లేదా తక్కువ సందుల్లో సులభంగా తిప్పవచ్చు. స్మార్ట్ డ్యాంపింగ్ బాడీ కంట్రోల్ సిస్టమ్ వల్ల రోడ్డుపై గుంతలు ఉన్నా ప్రయాణికులకు ఏమాత్రం కుదుపులు తెలియవు.
ఎలక్ట్రిక్ వాహనాల్లో రేంజ్ ఫోబియా (ఛార్జింగ్ అయిపోతుందనే భయం) ఉన్నవారికి BYD గ్రేట్ టాంగ్ ఒక పర్ఫెక్ట్ సమాధానం. 950 కిలోమీటర్ల రేంజ్, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్, లగ్జరీ ఇంటీరియర్‌తో ఇది టెల్సా వంటి కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ కారు త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్‌లోకి, ఆ తర్వాత భారత్‌లోకి వచ్చే అవకాశం ఉంది. విలాసం, విజ్ఞానం కలబోసిన ఈ కారు భవిష్యత్ ఎలక్ట్రిక్ కార్లకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలవనుంది.


Click it and Unblock the Notifications








