కి.మీకు రూ.2.26తో 5 మంది ప్రయాణం.. రూ.6.89 లక్షలు ఉంటే ఇంటికే! మధ్యతరగతికి సరైన కారు ఇదే!
భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ సిట్రోయెన్ మరో కీలక అడుగు వేసింది. కంపెనీ తన తాజా ఎలక్ట్రిక్ కారు eC3X ను అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లు, అందుబాటు ధరల కలయికతో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు దేశీయ EV కొనుగోలుదారులను ఆకర్షించేలా రూపొందించబడింది. ముఖ్యంగా తొలిసారిగా ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మోడల్ మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో కంపెనీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసింది. 2026 మోడల్‌గా వచ్చిన ఈ సిట్రోయెన్ ఇసీ3ఎక్స్‌లో (Citroen eC3X) ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.10.25 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అనేక ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే ఇది పోటీ ధరగా చెప్పవచ్చు.
అయితే ఈ కారు లాంచ్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం కేవలం ధర మాత్రమే కాదు. వినియోగదారులు EV కొనుగోలు సమయంలో ఎదుర్కొనే పెద్ద అడ్డంకి అయిన ప్రారంభ పెట్టుబడిని తగ్గించేందుకు సిట్రోయెన్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. దీనిలో భాగంగా కంపెనీ తొలిసారిగా బాస్ (BaaS) అనే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం ధరలో బ్యాటరీ ఖర్చు గణనీయమైన భాగాన్ని ఆక్రమిస్తుంది.

ఈ కారణంగా చాలామంది వినియోగదారులు EV కొనుగోలును వాయిదా వేస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా సిట్రోయెన్ బ్యాటరీని వాహనం ధర నుంచి వేరు చేసి సబ్‌స్క్రిప్షన్ విధానంలో అందిస్తోంది. అంటే కస్టమర్ వాహనాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీ వినియోగానికి ప్రత్యేకంగా చెల్లించే అవకాశం పొందుతారు. ఈ పథకం ద్వారా Citroen eC3Xను కేవలం రూ.6.89 లక్షల ప్రారంభ ధరతో సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.
మరో విషయం ఏమిటంటే బాస్ పథకాన్ని ఎంచుకునే వారు కారు బ్యాటరీ ధరను ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా, వారు నడిపిన ప్రతి కిలోమీటరుకు కంపెనీకి కేవలం రూ. 2.26 బ్యాటరీ EMI చెల్లిస్తే సరిపోతుంది. దీంతో ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు, యువ ఉద్యోగులు, నగర ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాల కోసం EVను పరిశీలిస్తున్న వినియోగదారులకు ఇది మరింత అందుబాటులోకి వచ్చింది.

సిట్రోయెన్ ఇసీ3ఎక్స్‌లో 29.2 kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ బ్యాటరీకి అనుసంధానమైన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 56 bhp శక్తి, 143 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ ఎలక్ట్రిక్ కారు నగర రోడ్లపై సాఫీగా నడవడమే కాకుండా, హైవేలపై కూడా స్థిరమైన పనితీరును అందిస్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సులభమైన డ్రైవింగ్ అందిస్తుంది.
రేంజ్ విషయానికి వస్తే, పూర్తి ఛార్జ్‌తో ఈ కారు గరిష్టంగా 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. దీంతో రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, నగరంలో తిరిగే అవసరాలు, అలాగే చిన్న దూరాల ఇంటర్‌సిటీ ట్రిప్‌లకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. బ్యాటరీ పనితీరుతో పాటు ఛార్జింగ్ సౌకర్యాలపై కూడా కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సిట్రోయెన్ ఇసీ3ఎక్స్‌లో అత్యాధునిక DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు.

అధిక సామర్థ్యం గల DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే కేవలం 57 నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. రోజువారీ వినియోగంతో పాటు వేగవంతమైన ఛార్జింగ్ సౌకర్యం కోరుకునే EV కొనుగోలుదారులకు ఈ కారు మరింత ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుంది.ఇది LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్ప్లిట్ LED DRLs, LED ఫాగ్ లైట్లు, 15-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ను అందించారు.
క్యాబిన్‌లో డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 7-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీని అందించగా, ఐచ్ఛికంగా JBL మ్యూజిక్ సిస్టమ్, డ్యూయల్ డాష్‌క్యామ్‌ను కూడా ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications