సిఎన్‌జీ ధరలు పెరిగాయి.. ఇప్పుడు ఏ కారు కొంటే మీ డబ్బులు ఆదా అవుతాయి?
ముంబైలో సిఎన్‌జీ (CNG) ధర నవంబర్ 15 నుంచి కిలోకు ₹91.50కి పెరిగింది. దీంతో రోజూ వాహనాల్లో ప్రయాణించే వేలాది మందిపై ఇంధన భారం పడింది. ఇప్పుడు వాహనదారుల ముందు ఒకటే పెద్ద ప్రశ్న తలెత్తుతోంది.. రోజువారీ ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవడానికి సిఎన్‌జీ హ్యాచ్‌బ్యాక్ కొనాలా? లేక స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ (SUV) వైపు వెళ్లాలా?
ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే, మీరు ఉండే నగరం మరియు ఎంచుకునే కార్ మోడల్‌పైనే ఇది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిఎన్‌జీ ధర అత్యంత ఎక్కువగా ఉండగా, ఢిల్లీలో కాస్త అందుబాటులోనే ఉంది. ఈ వారం మీరు కొత్త కార్ బుక్ చేసుకునే ముందు మీ ఊరిలోని సిఎన్‌జీ ధర, రాబోయే మైలేజ్, వెయిటింగ్ పీరియడ్‌ని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే కార్ ఆన్-రోడ్ ధర కంటే ఇవే మీ నెలవారీ బడ్జెట్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.

నేటి సిఎన్‌జీ ధరలు.. ఇంధన ఖర్చుల్లో వ్యత్యాసం
| నగరం | సిఎన్‌జీ (₹/కిలో) |
|---|---|
| ముంబై | 91.50 |
| పుణే | 99.00 |
| ఢిల్లీ | 86.98 |
| హైదరాబాద్ | 115.00 |
| బెంగళూరు | 99.00 |
నవంబర్ 17నాటి లెక్కల ప్రకారం.. ముంబైలో పెరిగిన ధరలు అలాగే ఉన్నాయి. పుణేలో నవంబర్ 13 నుంచి ₹99 వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీలో ఆగస్టు 29 నుంచి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో ₹115 ఉండగా, బెంగళూరులో ₹99కి దగ్గరగా ఉంది. ఈ వారంలో కార్ బుకింగ్ నిర్ణయం తీసుకునేముందు మీ కిలోమీటర్ రన్నింగ్ కాస్ట్‌ను సరిచూసుకోవడానికి ఈ ధరలే ప్రామాణికం.
అత్యధిక మైలేజ్ ఇచ్చే సిఎన్‌జీ, స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు (ARAI)
సిఎన్‌జీ మోడళ్లలో మారుతి ఆల్టో K10 కిలోకు 33.40 కిమీ, వ్యాగన్ ఆర్ 33.47 కిమీ, సెలెరియో 34.43 కిమీ మైలేజ్ ఇస్తాయని ARAI ధృవీకరించింది. ఇక స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్ల విషయానికొస్తే.. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా లీటరుకు 27.97 కిమీ మైలేజ్ ఇస్తుండగా, హోండా సిటీ e:HEV లీటరుకు 27.26 కిమీ ఇస్తోంది. మీ నెలవారీ ఆదాను అంచనా వేయడానికి ఈ సంఖ్యలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ముంబై ప్రస్తుత ధరల ప్రకారం.. కిలోమీటర్‌కు అయ్యే అసలు ఖర్చు ఎంత?
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ₹111.21, కిలో సిఎన్‌జీ ధర ₹91.50గా ఉంది. ఈ లెక్కన వ్యాగన్ ఆర్ పెట్రోల్ మోడల్ (ARAI మైలేజ్ 24.35 కిమీ/లీ) కిలోమీటర్‌కు దాదాపు ₹4.57 ఖర్చవుతుంది. అదే వ్యాగన్ ఆర్ సిఎన్‌జీకి (33.47 కిమీ/కిలో) కిలోమీటర్‌కు ₹2.73 మాత్రమే అవుతుంది. ఇక హైరైడర్ హైబ్రిడ్ మోడల్ (27.97 కిమీ/లీ) కిలోమీటర్‌కు ₹3.98 ఖర్చు కాగా, దాని పెట్రోల్ వర్షన్‌కు ₹5.27 ఖర్చవుతుంది. అయితే సిటీ ట్రాఫిక్‌ను బట్టి ఈ గణాంకాల్లో కాస్త మార్పు ఉండవచ్చు.
నెలకు 1,000–2,000 కిమీ తిరిగితే.. ఏది బెటర్? సిఎన్‌జీనా? హైబ్రిడా?
సిటీ డ్రైవింగ్ పరిస్థితుల్లో ARAI మైలేజ్‌లో 75 శాతం (హైబ్రిడ్లకు 80 శాతం) వస్తుందని అనుకున్నా.. ముంబైలో పెట్రోల్‌తో పోలిస్తే సిఎన్‌జీ ద్వారా కిలోమీటర్‌కు రూ. 2.4 వరకు ఆదా అవుతుంది. ఇక స్ట్రాంగ్ హైబ్రిడ్‌తో కిలోమీటర్‌కు రూ. 2.1 ఆదా చేసుకోవచ్చు. వ్యాగన్ ఆర్ సిఎన్‌జీ మోడల్ కోసం పెట్టే అదనపు పెట్ట్బడి ₹95,000 అనుకుంటే, మీరు నెలకు 1,000 నుంచి 2,000 కిమీ తిరిగితే 19 నుంచి 39 నెలల్లో ఆ డబ్బు రికవర్ అవుతుంది. కానీ హైబ్రిడ్ కార్లకు ఈ సమయం మరికొంత ఎక్కువ పడుతుంది.
కార్ కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు: వారంటీ, బూట్ స్పేస్, వెయింటింగ్ పీరియడ్
కంపెనీ ఫిటెడ్ సిఎన్‌జీ కార్లలో 60 లీటర్ల వాటర్ ఈక్వివాలెంట్ సిలిండర్ ఉండటం వల్ల డిక్కీ (బూట్ స్పేస్) బాగా తగ్గిపోతుంది. లగేజ్ సర్దుబాటు విషయంలో ఇది గుర్తుంచుకోవాలి. మారుతి తన కార్లపై 3 ఏళ్లు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది (దీన్ని 6 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు). టయోటా హైబ్రిడ్ బ్యాటరీలపై 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది. డెలివరీ సమయం విషయానికొస్తే.. మెట్రో నగరాల్లో హైరైడర్‌కు 2 నుంచి 8 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. మారుతి సిఎన్‌జీ కార్ల వెయిటింగ్ పీరియడ్ జనవరి నాటికి తగ్గే అవకాశముంది.
మీరు నెలకు 1,500 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ తిరిగే వారైతే.. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో సిఎన్‌జీ హ్యాచ్‌బ్యాక్ కారే ఇప్పటికీ అత్యంత పొదుపైన ఎంపిక. అదే సమయంలో స్మూత్ డ్రైవింగ్ అనుభూతి కోరుకునే సిటీ ఎస్‌యూవీ ప్రియులు స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లను పరిశీలించవచ్చు. పండుగ డిస్కౌంట్లు పొందితే మీ పెట్టుబడి త్వరగా రికవర్ అవుతుంది. కాబట్టి డీల్ ఓకే చేసేముందు మీ లగేజ్ అవసరాలు, దగ్గర్లోని సిఎన్‌జీ బంకుల లభ్యత, కచ్చితమైన డెలివరీ సమయాన్ని బుకింగ్ పేపర్‌పై సరిచూసుకోవడం మర్చిపోకండి.


Click it and Unblock the Notifications
