ఎలక్ట్రిక్ కార్ కొనేవారికి గుడ్‌న్యూస్.. ఎలాంటి రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం లేదు! ఢిల్లీ EV పాలసీ
దేశ రాజధాని ఢీల్లీలో (Delhi)లో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించేందుకు పలు ప్రోత్సాహకాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం 2026-2030 కాలానికి సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ముసాయిదా పాలసీని విడుదల చేసింది. ఈ పాలసీ లక్ష్యం స్పష్టంగా ఒకటే, రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడం, అలాగే క్లీన్ మొబిలిటీని ప్రోత్సహించడం. ఈ ముసాయిదా ప్రకారం, ఢిల్లీలో రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లపై పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఎక్స్-షోరూమ్ ధర రూ.30 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% మినహాయింపు ఇవ్వబడుతుంది.
అంటే, ఈ ధర పరిధిలోని EVలను కొనుగోలు చేసే వారికి భారీగా ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోజనం 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. అయితే, ఈ రాయితీలు అన్ని వాహనాలకు వర్తించవు. రూ.30 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకు ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. అంటే, సాధారణ, మధ్యతరగతి వినియోగదారులను ప్రోత్సహించడమే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశమని స్పష్టమవుతోంది.

ఇంకా ఒక కీలక నిర్ణయం ఏమిటంటే, 2027 జనవరి 1 నుండి ఢిల్లీలో కొత్తగా రిజిస్టర్ అయ్యే త్రీవీలర్ వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే కావాలి. పెట్రోల్ లేదా ఇతర ఇంధనాలతో నడిచే త్రీవీలర్ వాహనాలకు ఇకపై అనుమతి ఉండదు. ఇది నగరంలో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే చర్యగా భావిస్తున్నారు. ఇక హైబ్రిడ్ వాహనాల విషయంలో కూడా ప్రభుత్వం కొంత ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
పెట్రోల్ + బ్యాటరీతో నడిచే హైబ్రిడ్ కార్లపై రోడ్ టాక్స్‌లో 50% వరకు రాయితీ ఇవ్వనుంది. అయితే, ఇక్కడ కూడా రూ.30 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ వాహనాలకు ఈ రాయితీలు వర్తించవు. ప్రజలు పెద్దఎత్తున EVల వైపు మళ్లేలా ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను అందించే దిశగా ఈ చర్యలు రూపొందించబడ్డాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం, ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలు చేసే వారికి గణనీయమైన సబ్సిడీ ఇవ్వనున్నారు.

సుమారు రూ.2.25 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్ కొనుగోలు చేస్తే, ప్రతి కిలోవాట్ అవర్‌కు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రోత్సాహకం లభించే అవకాశం ఉంది. ఇది వినియోగదారులపై పడే ప్రారంభ ఖర్చును తగ్గించడంలో పెద్దగా సహాయపడుతుంది. త్రీవీలర్ వాహనాల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలక్ట్రిక్ త్రీవీలర్ కొనుగోలు చేసే వారికి తొలి ఏడాదిలో రూ.50 వేల వరకు ప్రోత్సాహకం అందించనున్నారు.
అయితే, తరువాతి సంవత్సరాల్లో ఈ సబ్సిడీ మొత్తాన్ని క్రమంగా తగ్గించే విధానం అమల్లోకి తీసుకురానున్నారు. ఇది ప్రారంభ దశలో ఎక్కువ మంది ఈవీలను స్వీకరించేలా ప్రోత్సహించే చర్యగా భావించవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, పాత వాహనాలను తుక్కుగా మార్చి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు మారినా ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. అదే సమయంలో ఛార్జింగ్ సదుపాయాలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉండాలి అన్న దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

అందుకే నగరవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లను భారీగా పెంచే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిపాదనలను వెంటనే అమలు చేయకుండా, ముందుగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఈ కొత్త పాలసీ డ్రాఫ్ట్‌ను 30 రోజుల పాటు ప్రజల ముందుంచి, వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించనున్నారు. మొత్తంగా చూస్తే, ఈ చర్యలు ఢిల్లీని ఎలక్ట్రిక్ మొబిలిటీ కేంద్రంగా మార్చే దిశగా ఒక పెద్ద అడుగుగా భావించవచ్చు.


Click it and Unblock the Notifications








