ఇన్నోవా కంటే లగ్జరీ.. భారత్‌లోకి రానున్న 'డెంజా D9' ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్లు ఇవే!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYDకి చెందిన లగ్జరీ బ్రాండ్ 'డెంజా' (Denza) రేపు (నవంబర్ 13న) భారత్‌లో అధికారికంగా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఆవిష్కరణలో 'D9' ఎలక్ట్రిక్ MPV ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కంపెనీ ఇప్పటికే ఈ తేదీని ఖరారు చేయగా, భారత మార్కెట్‌కు సంబంధించిన వేరియంట్ వివరాలను వేదికపైనే వెల్లడించనున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు ₹90 లక్షల నుంచి ₹1.1 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. సాధారణ MPV మోడళ్లకు, పూర్తి లగ్జరీ వెహికల్స్‌కు మధ్య ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ కారు కేవలం ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనే అందుబాటులోకి రానుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న మోడల్‌లో 103.36 kWh BYD బ్లేడ్ బ్యాటరీని అందించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 600 కిలోమీటర్ల (CLTC రేంజ్) వరకు ప్రయాణిస్తుంది. అలాగే ఇందులో 166–200 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అయితే భారత మోడల్ స్పెసిఫికేషన్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ ఆవిష్కరణలోనే సింగిల్ మోటార్ ఫ్రంట్-వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ల వివరాలను ప్రకటించే అవకాశముంది.

భారత్‌లో Denza D9 అంచనా ధర.. ఆన్-రోడ్ లెక్కలివే!
₹90 లక్షల నుంచి ₹1.1 కోట్ల బడ్జెట్ శ్రేణిలో దీని ధర ఉండనుండగా, వివిధ రాష్ట్రాలను బట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు ఉంటాయి. అయితే ఇక్కడ ఈవీ పాలసీలు కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం 2026 డిసెంబర్ 31 వరకు ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ఇస్తోంది. దీనివల్ల హైదరాబాద్ కొనుగోలుదారులకు ఆన్-రోడ్ ధర గణనీయంగా తగ్గుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ 2024–29 ఈవీ పాలసీ ద్వారా పూర్తి పన్ను మినహాయింపు అమలులో ఉండటంతో వైజాగ్, విజయవాడ కస్టమర్లకు కూడా మంచి లబ్ధి చేకూరనుంది.
Denza D9 లగ్జరీ క్యాబిన్.. అద్భుతమైన ADAS ఫీచర్లు
Denza D9లో ప్రధాన ఆకర్షణ దీని లౌంజ్ తరహా 6 లేదా 7 సీటర్ క్యాబిన్. సెకండ్ రోలో పవర్డ్ కేప్టెన్ సీట్లు, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్, లెగ్ రెస్ట్‌లు, ఫోల్డ్-అవుట్ టేబుల్స్ వంటి ప్రీమియం హంగులు ఉన్నాయి. వీటితో పాటు 15.6-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25-ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, V2L (వెహికల్ టూ లోడ్) ఫీచర్, 14-స్పీకర్ల Dynaudio ఆడియో సిస్టమ్ రానున్నాయి. ఇక సేఫ్టీ విషయానికొస్తే.. ACC, AEB, లేన్-కీపింగ్, 360-డిగ్రీ కెమెరాతో కూడిన లెవెల్-2 ADAS ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. భారత వెర్షన్ ఫీచర్లపై త్వరలోనే స్పష్టత రానుంది.
ఇన్నోవా హైక్రాస్, వెల్‌ఫైర్, MG M9 పోటీలో Denza D9 ఎక్కడ నిలుస్తుంది?
ప్రీమియం బ్రాండింగ్, ధర పరంగా చూస్తే.. ఇన్నోవా హైక్రాస్ కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించగల, అలాగే టయోటా వెల్‌ఫైర్ కంటే కాస్త తక్కువ ధరకు లగ్జరీ కోరుకునే వారిని ఈ D9 లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న MGకి చెందిన ఆల్-ఎలక్ట్రిక్ M9 ఎక్స్-షోరూమ్ ధర రూ. 79.94 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, టయోటా వెల్‌ఫైర్ ధర రూ. 1.20 కోట్ల నుంచి రూ. 1.30 కోట్ల మధ్య ఉంది. ఇక ఇన్నోవా హైక్రాస్ టాప్ మోడల్ ధర రూ. 32 లక్షల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో, అత్యుత్తమ కంఫర్ట్ కోరుకునే ఈవీ ప్రేమికులకు Denza D9 ఒక బెంచ్ మార్క్ మోడల్‌గా మారనుంది.
భారత్‌లో ఆవిష్కరణ.. తెలుగు రాష్ట్రాల్లో డీలర్ ప్రివ్యూలు, టెస్ట్ డ్రైవ్‌లు
నవంబర్ 13న ఈ బ్రాండ్ అఫీషియల్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ముంబై వేదికగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం. ఆ తర్వాత డెంజా భాగస్వామ్య షోరూమ్‌లలో డీలర్ ప్రివ్యూలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే హైదరాబాద్, వైజాగ్, విజయవాడలలో BYD నెట్‌వర్క్ బలంగా ఉంది. మొదట ఈ సెంటర్లలో వాహనాలను ప్రదర్శనకు ఉంచి, డెమో రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాక టెస్ట్ డ్రైవ్‌లను ప్రారంభిస్తారు. పూర్తి షెడ్యూల్ కోసం స్థానిక డీలర్లను సంప్రదించవచ్చు.
మీరు ఒక పవర్‌ఫుల్ లగ్జరీ MPVని కొనుగోలు చేయాలనుకుంటే.. రేపటి ఆవిష్కరణలో భారత మోడల్ బ్యాటరీ రేంజ్, ఛార్జింగ్ స్పీడ్, ADAS సిస్టమ్, వారంటీ, సర్వీస్ సపోర్ట్ వివరాలను ప్రధానంగా గమనించండి. తెలంగాణ కొనుగోలుదారులు 2026 డిసెంబర్ 31 వరకు ఉండే జీరో రోడ్డు టాక్స్ ప్రయోజనాన్ని, ఏపీ కస్టమర్లు ప్రస్తుత పాలసీ మినహాయింపులను పరిగణనలోకి తీసుకోవచ్చు. కారు రైడింగ్ కంఫర్ట్, సెకండ్ రో సౌకర్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించడానికి ముందే ప్రివ్యూ స్లాట్‌ను బుక్ చేసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications
