పోర్షే టేకాన్ కంటే తక్కువ ధరకే డెంజా Z9 GT.. 2.7 సెకన్లలోనే 100 కి.మీ వేగం, అదిరిపోయే ఫీచర్లు!
లగ్జరీ ఎలక్ట్రిక్ వేరియంట్లలో కొత్త సంచలనం సృష్టిస్తూ డెంజా సంస్థ 'Z9 GT' మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ.1.56 కోట్ల నుంచి రూ.1.57 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉన్న ఈ కారు బుకింగ్స్ నవంబర్ 13 నుంచే ప్రారంభమయ్యాయి. ఆరు ప్రధాన నగరాల్లోని ప్రత్యేక డీలర్‌షిప్‌లలో రూ.10 లక్షల టోకెన్ అమౌంట్‌తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఏకంగా 1,156 హెచ్‌పీ పవర్ ఇచ్చే ట్రై-మోటార్‌తో వస్తున్న ఈ లగ్జరీ జీటీ.. కేవలం 2.7 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. సింగిల్ ఛార్జ్‌పై 670 కి.మీ (NEDC) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. జర్మన్ లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ కారుతో పాటు రూ.90 లక్షల ధరలో D9 MPVని కూడా లాంచ్ చేశారు.
ఈ డెంజా కార్లు ప్రత్యేకమైన సేల్స్ నెట్‌వర్క్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. మొదటగా ముంబైలోని వర్లీ, గురుగ్రామ్‌లలో షోరూమ్‌లు ప్రారంభమవుతున్నాయి. వీటితో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లోనూ డీలర్‌షిప్‌లు ఏర్పాటవుతున్నాయి. లగ్జరీ ఈవీ విభాగంలో సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే టెస్ట్ డ్రైవ్ బుకింగ్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. షోరూమ్‌లలో డెమో కార్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ కారు కొనుగోలుదారులకు 6 ఏళ్ల వెహికల్ వారంటీతో పాటు 8 ఏళ్ల హై-వోల్టేజ్ బ్యాటరీ కవర్, ఉచితంగా 11 kW హోమ్ ఛార్జర్‌ను కంపెనీ అందిస్తోంది.

డెంజా Z9 GT బుకింగ్స్, లభ్యమయ్యే నగరాలు & టెస్ట్ డ్రైవ్ వివరాలు
డెంజా అధీకృత షోరూమ్‌లలో రూ.10 లక్షలు చెల్లించి Z9 GT కారును రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రారంభంలో హైదరాబాద్, ముంబై, గురుగ్రామ్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఈ సదుపాయం ఉంది. డెమో కార్లు రాగానే టెస్ట్ డ్రైవ్‌ల కోసం టైమ్ స్లాట్స్ కేటాయిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ టెస్ట్ డ్రైవ్ రిక్వెస్ట్ పెట్టవచ్చు. అయితే, ప్రస్తుతం ఉన్న BYD అవుట్‌లెట్ల కంటే భిన్నంగా ఈ డెంజా షోరూమ్‌లు ప్రత్యేకంగా పనిచేస్తాయి. ప్రారంభ వారాల్లో టెస్ట్ డ్రైవ్ స్లాట్లు విడతలవారీగా అందుబాటులోకి రానున్నాయి.
డెంజా Z9 GT డెలివరీలు, సర్వీస్ ప్లాన్ వివరాలు
ఈ ఆరు నగరాల్లో D9 MPV డెలివరీలు వెంటనే ప్రారంభమవుతున్నాయి. ఇక Z9 GT మోడళ్లు సీబీయూ (పూర్తిగా తయారు చేసిన కార్లు) పద్ధతిలో విదేశాల నుంచి దిగుమతి అవుతున్నందున, వాటి డెలివరీలకు కాస్త సమయం పడుతుంది. మొదటి విడత Z9 GT డెలివరీలకు 3 నుంచి 4 నెలల సమయం పట్టవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కస్టమర్ల కోసం 6 ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 1.5 లక్షల కిలోమీటర్ల కవరేజ్, 8 ఏళ్ల హై-వోల్టేజ్ బ్యాటరీ ప్రొటెక్షన్ అందిస్తున్నారు. అయితే, బుకింగ్ అమౌంట్ చెల్లించే ముందే మీ నగరంలో కారు లభ్యతను సరిచూసుకోవడం మంచిది.
పోటీదారులతో పోలిస్తే డెంజా Z9 GT ధర ఏమాత్రం వర్కవుట్ అవుతుంది?
కేవలం ధర విషయానికొస్తే డెంజా Z9 GT చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పోర్షే టేకాన్ ప్రారంభ ధర రూ.2.01 కోట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇక ఆడి ఈ-ట్రాన్ GT రూ.1.71 - 1.95 కోట్ల ధరకు లభించేది (ప్రస్తుతం దీని తయారీ నిలిపివేయడంతో స్టాక్ పరిమితంగా ఉంది). మెర్సిడెస్-బెంచ్ EQE SUV రూ.1.39 కోట్లతో వచ్చి ఈ ఏడాదే మార్కెట్ నుంచి నిష్క్రమించింది. కొత్త బ్రాండ్ అనే విషయాన్ని పక్కన పెడితే.. పెట్టే ప్రతి రూపాయికీ ఇచ్చే పెర్ఫార్మెన్స్ విషయంలో డెంజా Z9 GT బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.
| మోడల్ | భారత్‌లో ఎక్స్-షోరూమ్ ధర | స్టేటస్ / వివరాలు |
|---|---|---|
| డెంజా Z9 GT | ₹1.56–1.57 కోట్లు | ట్రై-మోటార్, 1,156 hp, 2.7 సెకన్లలో 0-100 కి.మీ |
| పోర్షే టేకాన్ | ₹2.01 కోట్ల నుంచి | అనేక వేరియంట్లు |
| ఆడి ఈ-ట్రాన్ GT | ₹1.71–1.95 కోట్లు | 2026లో నిలిపివేశారు; పరిమిత స్టాక్ మాత్రమే ఉంది |
| మెర్సిడెస్-బెంచ్ EQE SUV | ₹1.39 కోట్లు | 2026లో నిలిపివేశారు |
డెంజా D9 MPV కొనుగోలుదారుల కోసం ముఖ్యాంశాలు
రూ.90 లక్షల ధరలో వస్తున్న D9 MPV.. టయోటా వెల్‌ఫైర్, మెర్సిడెస్ V-క్లాస్ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తోంది. ఇందులో లగ్జరీ లాంజ్ తరహా సౌకర్యాలు ఉన్నాయి. ఇండియన్ మోడల్‌లో 115.07 kWh బ్లేడ్ బ్యాటరీ, 462 hp ఫ్రంట్-మోటార్ సెటప్ ఇచ్చారు. పవర్డ్ స్లైడింగ్ డోర్లు, దేవియాలెట్ (Devialet) ఆడియో, వెనుక సీట్లలో మసాజ్ ఆప్షన్లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అయితే మరిన్ని వేరియంట్లు, టైమ్‌లైన్ల గురించి కంపెనీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. Z9 GT బ్రాండ్ ఇమేజ్‌ను పెంచితే, D9 మాత్రం మంచి సేల్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
మొదట్లోనే ఈ కారును సొంతం చేసుకోవాలనుకునే వారు రూ.10 లక్షలు చెల్లించి ప్రాధాన్యతా ప్రాతిపదికన బుక్ చేసుకోవచ్చు. అయితే బుకింగ్ పూర్తి చేయడానికి ముందు మీ నగరంలో కారు లభ్యత, ఛార్జర్ ఇన్‌స్టాలేషన్ షెడ్యూల్, డెలివరీ అంచనాలను తెలుసుకోవడం ముఖ్యం. తక్కువ ధరలో పోర్షే టేకాన్ స్థాయి పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి డెంజా సూపర్ ఛాయిస్. అలా కాకుండా బ్రాండ్ వారసత్వానికే ప్రాధాన్యమిచ్చే వారైతే, స్లాట్లు అందుబాటులోకి రాగానే మిగతా కార్లతో పోల్చి చూసుకుని నిర్ణయం తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications
