ఇక సెలవు.. ఇన్నాళ్లు ఆదరించినందుకు కృతజ్ఞతలు.. వచ్చే ఏడాది నుంచి ఇన్నోవా క్రిస్టా ప్రయాణం ముగింపు
భారతీయ రోడ్ల మీద రారాజుగా వెలుగుతున్న టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రయాణం త్వరలోనే ముగియబోతోంది. దశాబ్ద కాలంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి రాజకీయ నాయకుల వరకు, ట్రావెల్ ఆపరేటర్ల నుంచి బిజినెస్ మెన్ల వరకు అందరి మనసు గెలుచుకున్న ఈ కారుకు టయోటా గుడ్ బై చెప్పబోతోంది. టయోటా తీసుకున్న ఈ నిర్ణయం వాహన ప్రేమికులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
క్రిస్టా ఎందుకు కనుమరుగవుతోంది?
టయోటా ఇన్నోవా క్రిస్టా అంటేనే నమ్మకానికి మారుపేరు. అయితే, భారత ప్రభుత్వం కాలుష్య నియంత్రణలో భాగంగా తీసుకువస్తున్న CAFE 3 (Corporate Average Fuel Efficiency) నిబంధనలు ఈ కారు కొంపముంచబోతున్నాయి. 2027 నుంచి అమలులోకి రానున్న ఈ కఠినతరమైన నిబంధనల ప్రకారం.. డీజిల్ ఇంజన్లతో నడిచే భారీ వాహనాలపై ఆంక్షలు పెరుగుతాయి. ముఖ్యంగా లాడర్-ఫ్రేమ్ ఛాసిస్‌పై డీజిల్ ఇంజన్‌తో నడిచే క్రిస్టా వంటి వాహనాలు ఈ నిబంధనలను అందుకోవడం కష్టంగా మారుతుంది. అందుకే టయోటా సంస్థ ముందుగానే మేల్కొని 2027 ప్రారంభం నాటికి క్రిస్టా ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని భావిస్తోంది.

క్రిస్టా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?
ఇన్నోవా క్రిస్టాకు ఉన్న క్రేజ్ గురించి టయోటాకు బాగా తెలుసు. అందుకే దాని స్థానంలో ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) హైబ్రిడ్ వెర్షన్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం హైక్రాస్ హైబ్రిడ్ ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. దీనిని అధిగమించడానికి టయోటా హైక్రాస్‌లో ఒక స్ట్రిప్డ్-డౌన్ అంటే బేస్ వేరియంట్‌ను విడుదల చేయబోతోంది. ఈ కొత్త వేరియంట్‌లో విలాసవంతమైన ఫీచర్లను తగ్గించి, కేవలం అవసరమైన ఫీచర్లతో తక్కువ ధరకు ట్రావెల్ ఆపరేటర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా క్రిస్టా డీజిల్ కారు లేని లోటును హైక్రాస్ హైబ్రిడ్‌తో భర్తీ చేయాలని కంపెనీ మాస్టర్ ప్లాన్ వేసింది.
ఫ్లీట్ ఆపరేటర్ల ఫేవరెట్ కార్
ఇన్నోవా క్రిస్టా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ట్రావెల్ ఆపరేటర్లు. తక్కువ మెయింటెనెన్స్, ఎంత దూరం ప్రయాణించినా చెక్కుచెదరని ఇంజన్ పనితీరు, లీటరుకు మంచి మైలేజీ ఇవ్వడం వంటివి దీనిని నంబర్ వన్ చేశాయి. హైక్రాస్ పెట్రోల్ వెర్షన్ లీటరుకు కేవలం 10 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంటే, క్రిస్టా డీజిల్ మాత్రం అంతకంటే మెరుగైన మైలేజీని అందిస్తుంది. అయితే హైక్రాస్ హైబ్రిడ్ వెర్షన్ 14-15 కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నప్పటికీ, దాని ధర క్రిస్టా కంటే దాదాపు రూ.7.50 లక్షలు ఎక్కువ. ఈ ధర వ్యత్యాసాన్ని తగ్గించడానికే టయోటా ఇప్పుడు హైక్రాస్‌లో చౌకైన వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది.

2016 నుంచి మొదలైన ప్రభంజనం
టయోటా 2016లో ఇన్నోవా క్రిస్టాను లాంచ్ చేసింది. అప్పటివరకు ఉన్న పాత ఇన్నోవాను మరింత లగ్జరీగా మార్చి క్రిస్టా పేరుతో విడుదల చేయగానే మార్కెట్ షేక్ అయ్యింది. విశాలమైన ఇంటీరియర్స్, ప్రయాణంలో అలసట లేని సీటింగ్, అదిరిపోయే రీసేల్ వాల్యూ దీని సొంతం. పదేళ్లు దాటినా ఈ కారును సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొనడానికి కూడా జనం పోటీ పడతారంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం క్రిస్టా ప్రారంభ ధర రూ.18.85 లక్షల నుంచి రూ.25.67 లక్షల వరకు ఉంది. వచ్చే ఏడాదిలోగా ఈ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే ఆఖరి అవకాశం కావచ్చు.


Click it and Unblock the Notifications








