బజాజ్, టీవీఎస్ లకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతుంది.. 3 లక్షల మంది కొనేసిన క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్
భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో ఒక సరికొత్త మైలురాయి నమోదైంది. ప్రముఖ వాహన తయారీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (GEM) దేశీయ మార్కెట్లో ఏకంగా 3,00,000 యూనిట్ల రిటైల్ విక్రయాల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వ అధికారిక వాహన్ పోర్టల్(Vahan Portal) నుంచి సేకరించిన డేటా ప్రకారం.. మే 2019 నుంచి జూన్ 17, 2026 వరకు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆంపియర్ వెహికల్స్ రెండూ కలిపి మొత్తం 3,00,293 ఎలక్ట్రిక్ టూ-వీలర్ డెలివరీలను పూర్తి చేశాయి. ఈ ఘనతతో దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈవీ బ్రాండ్లలో ఒకటిగా ఇది అవతరించింది.
కోయంబత్తూరు స్టార్టప్‌తో మొదలైన విజయ ప్రస్థానం
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ నవంబర్ 2019లో కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్ కంపెనీ ఆంపియర్ వెహికల్స్ (Ampere Vehicles)ను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ రెండు బ్రాండ్లు కలిసి కస్టమర్లకు మెరుగైన సేవలను అందిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అక్టోబర్ 2025 చివరి నాటికి కంపెనీ 250,000 యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసుకోగా.. ఆ తర్వాతి 300,000 మార్కును అందుకోవడానికి కేవలం 8 నెలల కంటే తక్కువ సమయం మాత్రమే తీసుకుంది. ఈ చివరి 50,000 స్కూటర్ల విక్రయాలు ఎంతో వేగంగా జరిగాయని, ముఖ్యంగా మార్చి 2026 నుంచి కంపెనీ మంత్లీ సేల్స్ విపరీతంగా పెరిగాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఏడాది వారీగా అమ్మకాల విశ్లేషణ
వాహన్ పోర్టల్ రిటైల్ డేటా ప్రకారం.. ఈ కంపెనీ ప్రయాణం ఎన్నో హెచ్చుతగ్గులతో సాగింది. తొలి ఏడాది 2019లో కేవలం 1,213 యూనిట్లు మాత్రమే విక్రయించగా.. 2020 నాటికి 290 శాతం వృద్ధితో 4,733 యూనిట్లకు చేరింది. ఆ తర్వాత 2021లో 13,352 యూనిట్లు, 2022 నాటికి ఏకంగా 501 శాతం రికార్డు వృద్ధితో 80,266 యూనిట్ల అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేసింది.
అయితే ఆ తర్వాత కొద్దిగా మందగమనం కనిపించింది. 2023లో 16 శాతం క్షీణతతో 67,366 యూనిట్లు, 2024లో 45 శాతం పడిపోయి 37,070 యూనిట్లకు పరిమితమైంది. కానీ మళ్లీ పుంజుకుంటూ 2025 నాటికి 56 శాతం బలమైన గ్రోత్‌తో 57,863 యూనిట్ల మార్కును తాకి మార్కెట్ లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
ఓలా ఎలక్ట్రిక్‌ను దాటేసి ఐదో స్థానానికి చేరిన ఆంపియర్
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం గత ఏడాది ఫిబ్రవరి నెలలో చోటుచేసుకుంది. ఆ నెలలో ఈ కంపెనీ దేశంలోనే అతిపెద్ద ఈవీ తయారీ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) విక్రయాలను కూడా దాటేసి, మొదటిసారిగా నెలవారీ టాప్-10 అమ్మకాల జాబితాలో ఐదో స్థానాన్ని కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుత 2026 సంవత్సరంలో కూడా కంపెనీ అదే జోరును ప్రదర్శిస్తోంది. 2026 మొదటి ఐదున్నర నెలల్లోనే (జనవరి 1 నుంచి జూన్ 17 వరకు) ఏకంగా 38,430 యూనిట్ల డెలివరీలను పూర్తి చేసి, 58 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
త్వరలోనే షేర్ మార్కెట్ లోకి ఎంట్రీ
ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న మొత్తం ఎలక్ట్రిక్ టూ-వీలర్లలో (మొత్తం 876,328 యూనిట్లు) గ్రీవ్స్ మొబిలిటీ దాదాపు 4 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. దేశీయ ఈవీ రంగంలో టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో విడా, ఓలా ఎలక్ట్రిక్ తర్వాత గ్రీవ్స్ ఎలక్ట్రిక్ (ఆంపియర్) ఆరో స్థానంలో కొనసాగుతోంది.
కంపెనీ సాధిస్తున్న ఈ అద్భుతమైన రెండంకెల వృద్ధి కారణంగా.. త్వరలోనే పబ్లిక్ ఇష్యూ (IPO)కు రావడానికి రెగ్యులేటరీ బోర్డు నుంచి అనుమతులు తెచ్చుకుంటోంది. త్వరలోనే షేర్ మార్కెట్ లో లిస్ట్ అయి మరిన్ని పెట్టుబడులతో సరికొత్త ఈవీ మోడళ్లను భారత రోడ్లపైకి తీసుకురావాలని గ్రీవ్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications