ఇంట్లోనే ఎలక్ట్రిక్ కారు తయారు చేసిన 67 ఏళ్ల వ్యక్తి! రూ.5 ఖర్చుతో 60 కి.మీ వెళ్తోంది!
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతుండటంతో చాలా మంది వినియోగదారులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల కోసం చూస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి తన అవసరాలకు అనుగుణంగా స్వయంగా ఎలక్ట్రిక్ కారును తయారు చేసుకుని ఉపయోగించడం చాలా అరుదుగా కనిపించే విషయం. అలాంటి అరుదైన ఘనతను కేరళ రాష్ట్రానికి చెందిన 67 ఏళ్ల ఆంటోనీ జాన్ సాధించారు. ఇది సుమారు 4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. కానీ పాఠకుల కోసం ఇప్పుడు ఈ కథణంలో ఆయన తయారు చేసిన కారు గురించిన వివరాలు చూద్దాం.
కేరళలోని కొల్లాం ప్రాంతంలో నివసిస్తున్న ఆంటోనీ జాన్ వృత్తిరీత్యా కెరీర్ కన్సల్టెంట్. ఆయన ఆఫీస్ ఇంటి నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రతిరోజూ ప్రయాణించాల్సి వచ్చేది. మొదట్లో ఈ ప్రయాణాల కోసం ఆయన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఉపయోగించేవారు. ఫ్యూయల్ ఖర్చులు లేకుండా, పర్యావరణానికి మేలు చేసే ఈ మార్గం ఆయనకు బాగా నచ్చింది. అయితే కాలక్రమేణా ఒక సమస్య ఆయనను ఆలోచింపజేసింది.

వర్షాకాలంలో వర్షాలు, వేసవిలో తీవ్ర ఎండల కారణంగా స్కూటర్‌పై ప్రయాణించడం అసౌకర్యంగా మారింది. దీంతో ఆయన ఎలక్ట్రిక్ కారును ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకదాన్ని కొనుగోలు చేస్తారు. కానీ ఆంటోనీ జాన్ మాత్రం భిన్నంగా ఆలోచించారు. ఏదైనా కంపెనీ తయారు చేసిన కారును కొనడం కంటే, తన అవసరాలకు సరిపోయేలా స్వయంగా ఎలక్ట్రిక్ కారును తయారు చేసుకోవాలని నిర్ణయించారు.
2018లో ఆలోచనతో మొదలైన ఈ ప్రయాణం క్రమంగా ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాల పనితీరు, బ్యాటరీ టెక్నాలజీ, మోటార్ వ్యవస్థలు, భద్రతా అంశాలు వంటి విషయాలపై అధ్యయనం చేసిన ఆంటోనీ జాన్ వినూత్న ఎలక్ట్రిక్ కారును రూపొందించారు. రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా, తక్కువ ఖర్చుతో నడిచేలా, అలాగే వర్షం, ఎండల నుంచి పూర్తి రక్షణ కలిగేలా ఈ వాహనాన్ని డిజైన్ చేశారు.

తన కలల ఎలక్ట్రిక్ కారును తయారు చేయడానికి ఆంటోనీ జాన్ చాలా కష్టపడ్డారు. కారు బాడీ తయారీ కోసం ఆయన బస్సుల బాడీలు తయారు చేసే ఒక గ్యారేజీ సహాయం తీసుకున్నారు. తనకు నచ్చిన డిజైన్‌ను వారికి ఇచ్చి, దాని ఆధారంగా కార్ బాడీని తయారు చేయించారు. అయితే బ్యాటరీలు, మోటార్, వైరింగ్ వంటి అన్ని ఎలక్ట్రికల్ పనులను మాత్రం స్వయంగా పూర్తి చేశారు.
అవసరమైన బ్యాటరీలు, మోటార్లు, ఇతర పరికరాలను ఢిల్లీలోని ఒక డీలర్ వద్ద నుంచి కొనుగోలు చేశారు. ప్రారంభంలో ఇలాంటి వాహనాన్ని నిర్మించిన అనుభవం లేకపోవడంతో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కొన్ని పొరపాట్లు కూడా జరిగాయి. అయినప్పటికీ ఆయన నిరాశ చెందకుండా తన ప్రయత్నాలను కొనసాగించారు. అదే సమయంలో కరోనా లాక్‌డౌన్ కారణంగా ముడిసరుకుల కొరత ఏర్పడటం, అవసరమైన పరికరాలు సమయానికి అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యాయి.

కరోనా లాక్‌డౌన్ కారణంగా అవసరమైన పరికరాలు, ముడిసరుకులు సమయానికి అందుబాటులో లేకపోవడంతో కారు తయారీ కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ ఆంటోనీ జాన్ పట్టుదలతో తన ఎలక్ట్రిక్ కారును పూర్తి చేశారు. ఈ కారును తయారు చేయడానికి ఆయన సుమారు రూ.4.50 లక్షలు ఖర్చు చేశారు. అయితే కేవలం రూ.5 విలువైన విద్యుత్తుతో దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని చెబుతున్నారు.
గంటకు 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో నడిచే ఈ వాహనానికి నంబర్ ప్లేట్ అవసరం లేదు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తప్పనిసరి. తన సొంతంగా ఎలక్ట్రిక్ కారును తయారు చేయడం ద్వారా ఆంటోనీ అనేక మంది దృష్టిని ఆకర్షించారు. ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన వీడియో విలేజ్ వార్త యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురితమైంది. ఈ కథణంలోని ఫోటోలను విలేజ్ వార్త నుంచి తీసుకున్నాము.


Click it and Unblock the Notifications