హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది! రూ. 21 వేలకే బుకింగ్స్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ప్రీ-బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్నవారు రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ముందుగా ఇండియాలోనే పరిచయం కానున్న ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను అక్టోబర్ 6న కంపెనీ ఆవిష్కరించనుంది. ఫీచర్లు, హైబ్రిడ్ ఆప్షన్ ఊహాగానాలు, రాబోయే ధరలపై కార్ లవర్స్ తీవ్రంగా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇందులో మారిన నిజమైన ఫీచర్లు ఏంటి? క్రెటా, సెల్టోస్‌లకు ఇది ఎంతవరకు పోటీ ఇస్తుందో ఒకసారి పరిశీలిద్దాం.
టీజర్ల ఆధారంగా పరిశీలిస్తే.. సరికొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, సెగ్మెంటెడ్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, కనెక్టెడ్ టెయిల్-లైట్‌లతో కొత్త ఎలివేట్ రానుంది. డ్యాష్‌బోర్డ్‌ను కూడా రీఫ్రెష్ చేసి, సాఫ్ట్-టచ్ ట్రిమ్, యాంబియంట్ లైటింగ్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పానరోమిక్ సన్‌రూఫ్ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇంజిన్ విషయానికొస్తే ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. మునుపటిలాగే 121 హెచ్‌పి పవర్ ఇచ్చే 1.5-లీటర్ పెట్రోల్ (మాన్యువల్ లేదా సివిటి) ఇంజిన్‌నే కొనసాగించనున్నారు. ప్రారంభంలో స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్ వచ్చే అవకాశం చాలా తక్కువ.

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ధరల అంచనా.. వేరియంట్ల వివరాలు
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలివేట్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 11.81 లక్షల నుండి రూ. 16.46 లక్షల వరకు ఉన్నాయి. కొత్తగా మరిన్ని ఫీచర్లు తోడవుతున్నందున, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధర కాస్త పెరిగే అవకాశం ఉంది. త్వరగా డెలివరీ పొందాలనుకునే వారి కోసం డీలర్లు రూ. 21,000 అడ్వాన్స్ టోకెన్ తీసుకుంటున్నారు. ఇక వేరియంట్ల విషయానికొస్తే.. ఇది గతంలో లాగే SV, V, VX, ZX ట్రిమ్‌లలో లభించే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 6న వేరియంట్లవారీగా ఫీచర్ల వివరాలపై పూర్తి స్పష్టత రానుంది.
పోటీదారులతో పోలిస్తే హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ఎలా ఉంది?
హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ కార్ల టాప్ వేరియంట్లలో ADAS సాంకేతికతతో పాటు 360-డిగ్రీ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. సిటీ రద్దీలో మెరుగైన మైలేజ్ కోరుకునే వారి కోసం గ్రాండ్ విటారా, హైరైడర్ మోడళ్లు స్ట్రాంగ్-హైబ్రిడ్ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. మరొకవైపు వోక్స్‌వాగన్ టైగన్, స్కోడా కుషాక్ పవర్ ఫుల్ టర్బో-పెట్రోల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ, ADAS, 360-డిగ్రీ కెమెరాలను అందించడం లేదు. ఎలివేట్ టీజర్‌ను బట్టి చూస్తే, ఇందులో ఫుల్ 360 సిస్టమ్‌కు బదులుగా 'లేన్‌వాచ్' ఫీచర్‌నే కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాబట్టి ఇంటీరియర్ క్యాబిన్‌లో తెచ్చే అప్‌డేట్లే దీనికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్.. వెయిటింగ్ పీరియడ్ వివరాలు
అక్టోబర్ 6న జరిగే అధికారిక లాంచ్‌కు ముందే డీలర్‌షిప్‌లు, బ్రాండ్ ఛానెళ్ల ద్వారా బుకింగ్స్ మొదలయ్యాయి. పండగ సీజన్ ప్రారంభం కావడంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడి ప్రారంభ ఆఫర్లు త్వరగా ముగిసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎలివేట్ వెయిటింగ్ పీరియడ్ దాదాపు 1 నుండి 2 నెలల వరకు ఉంది. ఇతర మెట్రో నగరాల్లో వెయిటింగ్ టైమ్ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ, పండగ డిమాండ్‌తో ఈ సమయం మరికొంత పెరిగే ఛాన్స్ ఉంది. భారతీయ మార్కెట్‌కే హోండా ఈ ఫేస్‌లిఫ్ట్‌ను మొదటగా తీసుకురావడం విశేషం.
కొనుగోలుదారులు ఏం చేయాలి?
మీకు హైబ్రిడ్ మైలేజ్ లేదా పవర్ ఫుల్ టర్బో ఇంజిన్ మాత్రమే కావాలనుకుంటే కాంపిటీటర్ మోడళ్లను కూడా ఒకసారి పరిశీలించడం మేలు. అలా కాకుండా, హోండా నమ్మకమైన పెట్రోల్ ఇంజిన్, డ్రైవింగ్ కంఫర్ట్‌కే ప్రాధాన్యమిస్తే మాత్రం ఈ కొత్త వెర్షన్ కోసం వేచి చూడడం మంచి నిర్ణయం. ముందస్తు డెలివరీ కోసం ఇప్పుడే బుక్ చేసుకుని, అక్టోబర్ 6న ధరలు ప్రకటించాక మీ నిర్ణయం తీసుకోవచ్చు. లాంచ్ ముగిసిన వెంటనే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలకు సంబంధించిన ఆన్-రోడ్ ధరలు, ఈఎంఐ ప్లాన్లు, డీలర్ వెయిటింగ్ పీరియడ్ వివరాలను ఇక్కడ అందిస్తాం.


Click it and Unblock the Notifications
