హ్యుందాయ్, మారుతికి గట్టి పోటీ.. హోండా నుంచి రాబోతున్న టాప్-4 హైబ్రిడ్ కార్లు ఇవే
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో జపాన్ దిగ్గజం హోండా (Honda) సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమైంది. గత కొంతకాలంగా మార్కెట్ వాటాలో కాస్త వెనుకబడినట్లు అనిపించినా, ఇప్పుడు హైబ్రిడ్ మంత్రంతో మళ్లీ నంబర్ వన్ రేసులోకి రావాలని హోండా పక్కా ప్లాన్ వేసింది. కేవలం పెట్రోల్ కార్లకే పరిమితం కాకుండా, ఎలక్ట్రిక్, పెట్రోల్ కలయికతో వచ్చే స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలపై కంపెనీ భారీగా ఫోకస్ పెట్టింది. రాబోయే CAFE (కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ) నిబంధనలకు అనుగుణంగా, అత్యుత్తమ మైలేజ్ ఇచ్చే కార్లను పరిచయం చేయబోతోంది. ఇందులో పాపులర్ మోడల్ హోండా సిటీ నుంచి లగ్జరీ కారు ప్రిల్యూడ్ వరకు ఎన్నో ఆసక్తికరమైన వాహనాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
హోండా సిటీ హైబ్రిడ్ ఫేస్‌లిఫ్ట్ (Honda City Hybrid Facelift)
భారతీయులకు హోండా సిటీ అంటే ఒక ఎమోషన్. ఈ సెడాన్ కారు ఇప్పుడు సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతోంది. ప్రస్తుతం హోండా సిటీ రెగ్యులర్ పెట్రోల్ వెర్షన్, e:HEV హైబ్రిడ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఏడాది రెగ్యులర్ సెడాన్ కు డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేయనున్నారు.

ఆ వెంటనే హైబ్రిడ్ వెర్షన్‌లో కూడా అప్‌డేట్స్ రాబోతున్నాయి. అయితే అసలైన విప్లవం 2028లో రానుంది. అప్పుడు లాంచ్ కాబోయే నెక్స్ట్ జనరేషన్ సిటీ కారు సరికొత్త PF2 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా నిర్మించబడుతుంది. ఇందులో మరింత పవర్ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుందని, మైలేజ్ విషయంలో ఇది సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.
హోండా ఎలివేట్ హైబ్రిడ్ (Honda Elevate Hybrid)
మధ్యతరగతి ఎస్‌యూవీ (SUV) ప్రియుల కోసం హోండా ఎలివేట్ లో హైబ్రిడ్ వెర్షన్ రాబోతోంది. 2026 రెండో భాగంలో ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ కానుంది. ఇందులో కేవలం లుక్ మాత్రమే కాదు, ఇంజిన్ లోనూ భారీ మార్పులు ఉండబోతున్నాయి. ప్రస్తుతం హోండా సిటీ హైబ్రిడ్ లో ఉన్న టెక్నాలజీ కంటే భిన్నమైన, మరింత మెరుగైన హైబ్రిడ్ సిస్టమ్ ను ఇందులో వాడనున్నారు.

తక్కువ బరువు ఉండే బ్యాటరీ ప్యాక్, ఎక్కువ శక్తిని ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్ ను ఇందులో అమర్చబోతున్నారు. దీనివల్ల కారు మెయింటెనెన్స్, రిపేర్ ఖర్చులు చాలా తగ్గుతాయి. 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు, ఇ-సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో సిటీ రోడ్లపై రాజసం ఉట్టిపడేలా పరుగులు తీయనుంది.
హోండా ప్రిల్యూడ్ హైబ్రిడ్ కూపే (Honda Prelude Hybrid Coupe)
హోండా నుంచి రాబోతున్న అత్యంత ఖరీదైన, స్టైలిష్ కార్లలో ప్రిల్యూడ్ ఒకటి. ఇది రెండు తలుపులు ఉండే లగ్జరీ కూపే కారు. 2026 మొదటి ఆరు నెలల్లోనే ఇది భారత్ కు రాబోతోంది. ఇందులో 2.0 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది దాదాపు 200 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

దీన్ని విదేశాల నుంచి నేరుగా దిగుమతి (CBU) చేసుకుని ఇక్కడ విక్రయించనున్నారు. అందుకే దీని ధర కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు 80 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని సమాచారం. స్పోర్ట్స్ కార్ల లాంటి లుక్ , హైబ్రిడ్ టెక్నాలజీ కలిసిన ఈ కారు యువతను విపరీతంగా ఆకట్టుకోనుంది.
హోండా ZR-V హైబ్రిడ్ ఎస్‌యూవీ (Honda ZR-V Hybrid SUV)
హోండా తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ ZR-V అనే కొత్త మోడల్ ను భారత మార్కెట్లోకి తెస్తోంది. ఇది కేవలం లగ్జరీ, టెక్నాలజీని ఇష్టపడే వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మోడల్. ఇందులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్, 12 స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 10.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉంటాయి.
అన్నింటికంటే ముఖ్యంగా, ఇందులో 2.0 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు డ్యూయల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది 184 హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది. దీనికి తోడు ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ఉండటం వల్ల ఇది గతుకుల రోడ్లపై కూడా సునాయాసంగా ప్రయాణిస్తుంది.
మొత్తానికి హోండా రాబోయే రెండేళ్లలో భారత రోడ్లపై తన హైబ్రిడ్ వాహనాలతో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. పెట్రోల్ ధరలు మండుతున్న ఈ కాలంలో, ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ కష్టాలు లేని ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు కచ్చితంగా సక్సెస్ అవుతాయని హోండా ధీమాగా ఉంది.


Click it and Unblock the Notifications








