ఇది కారు కాదు లగ్జరీకి కేరాఫ్ అడ్రస్.. ప్రీమియం మార్కెట్లో జెండా పాతేందుకు హోండా మాస్టర్ ప్లాన్
హోండా కార్ లవక్స్ ఇది నిజంగా పండగ లాంటి వార్తే. భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును మరింత బిగించేందుకు హోండా సంస్థ భారీ ప్లాన్ రెడీ చేసింది. వచ్చే నెలలోనే (మే 2026) అటు సెడాన్ ప్రియుల కోసం, ఇటు ఎస్‌యూవీ (SUV) పిచ్చోళ్ల కోసం అదిరిపోయే ఆప్షన్లను తీసుకువస్తోంది. తన ఐకానిక్ మోడల్ హోండా సిటీకి కొత్త మెరుగులు అద్దడమే కాకుండా, ప్రీమియం విభాగంలో ZR-V అనే సరికొత్త ఎస్‌యూవీని కూడా లాంచ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
హోండా తన ZR-V ఎస్‌యూవీని మే 22, 2026న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయబోతోంది. ఇది హోండా నుంచి రాబోతున్న ఒక మేజర్ ఎస్‌యూవీ. దీనిని విదేశాల నుంచి నేరుగా దిగుమతి (CBU Import) చేసుకుని ఇక్కడ విక్రయించనున్నారు.

దీని ధర సుమారు రూ.40 లక్షల నుండి రూ.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్, స్కోడా కోడియాక్ వంటి లగ్జరీ 5 సీటర్ ఎస్‌యూవీలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. దీని డిజైన్ చాలా బోల్డ్‌గా, స్క్వేర్డ్ ఆఫ్ లుక్‌తో ఉండి రోడ్డుపై ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే ZR-Vలో మోడ్రన్ టెక్నాలజీని జోడించారు. స్టాండ్‌అలోన్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, పవర్ డ్రైవర్ సీట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), పవర్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇక ఇంజిన్ విషయానికి వస్తే, 180 హార్స్‌పవర్ ఇచ్చే 2.0-లీటర్ 4-సిలిండర్ హైబ్రిడ్ ఇంజిన్‌తో ఇది రాబోతోంది. ఈ-సీవీటీ (e-CVT) ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ దీనికి అదనపు బలాన్ని ఇస్తుంది.

భారతీయుల ఆల్ టైమ్ ఫేవరెట్ సెడాన్ హోండా సిటీ, ఇప్పుడు 5వ జనరేషన్‌లో రెండోసారి ఫేస్‌లిఫ్ట్ అవతారాన్ని దాల్చబోతోంది. 2023లో వచ్చిన మొదటి అప్‌డేట్ తర్వాత, ఇప్పుడు 2026 వెర్షన్లో మరిన్ని మార్పులు చేస్తున్నారు.
ముఖ్యంగా హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, బంపర్లు, అల్లాయ్ వీల్స్‌లో చిన్నపాటి మార్పులు చేసి కారుకు ఫ్రెష్ లుక్ ఇవ్వనున్నారు. హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా వంటి పోటీదారులతో తలపడేందుకు హోండా ఈసారి ఇంటీరియర్, ఫీచర్లపై ఎక్కువ దృష్టి పెట్టింది.
కొత్త సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ డ్రైవర్ సీట్, అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా వంటి మోడ్రన్ ఫీచర్లను హోండా చేర్చబోతోంది.
ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు లేకపోయినా, నమ్మకమైన 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్ (121hp), 126hp పవర్ ఇచ్చే హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మాన్యువల్, సివిటి గేర్‌బాక్స్ ఎంపికలు యథావిధిగా కొనసాగుతాయి.
హోండా ఫ్యాన్స్‌కు మరో పెద్ద సర్ప్రైజ్ ఏమిటంటే, ప్రీల్యూడ్ కారు కూడా వచ్చే నెలలో భారత్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది ఒక టూ-డోర్ కూపే కారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే 6వ జనరేషన్ ప్రీల్యూడ్ మంచి విజయం సాధించింది.
11వ జనరేషన్ హోండా సివిక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రూపొందిన ఈ కారు, స్పోర్ట్స్ కార్లను ఇష్టపడే యువతను టార్గెట్ చేస్తోంది. దీని రాకతో హోండా బ్రాండ్ ఇమేజ్ ఇండియాలో మరో స్థాయికి వెళ్లడం ఖాయం.
హోండా ZR-V తో మార్కెట్లో తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను బలపరుచుకోవాలని చూస్తోంది. ఎలివేట్ (Elevate) ఇప్పటికే మిడ్-సైజ్ విభాగంలో సత్తా చాటుతుండగా, ఇప్పుడు ZR-V ప్రీమియం విభాగంలో పాగా వేయనుంది. సిటీ ఫేస్‌లిఫ్ట్ ద్వారా సెడాన్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని హోండా ప్లాన్ చేస్తోంది. మొత్తం మీద మే నెల హోండాకు, కొత్త కార్లు కొనాలనుకునే వారికి చాలా కీలకం కానుంది.


Click it and Unblock the Notifications