షాకింగ్ నిర్ణయం.. 20 ఏళ్ల ప్రస్థానానికి స్వస్తి పలికిన హోండా.. ఇక కార్లు దొరకవు.. ఓన్లీ సర్వీస్ మాత్రమే
జపాన్ కార్ల దిగ్గజం హోండా (Honda) ఆసియా మార్కెట్లలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా దక్షిణ కొరియా (South Korea) ఆటోమొబైల్ మార్కెట్ నుంచి పూర్తిగా వైదొలగాలని హోండా సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 చివరి నాటికి అక్కడ కార్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఒకప్పుడు కొరియాలో అత్యధిక కార్లు అమ్మిన విదేశీ బ్రాండ్‌గా వెలిగిన హోండా, ఇప్పుడు ఇలా ఖాళీ చేయడం ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
హోండా కంపెనీ సౌత్ కొరియాలో తన ప్రయాణాన్ని 2001లో ప్రారంభించింది. అయితే 2004లో అధికారికంగా కార్ల అమ్మకాలను మొదలుపెట్టింది. అప్పట్లో హోండా అకార్డ్ (Accord), సీఆర్-వీ (CR-V) మోడళ్లకు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎంతలా అంటే, 2008 సంవత్సరంలో దక్షిణ కొరియాలో ఏడాదికి 10,000 కంటే ఎక్కువ కార్లు అమ్మిన మొట్టమొదటి విదేశీ కార్ల బ్రాండ్‌గా హోండా చరిత్ర సృష్టించింది. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. స్థానిక బ్రాండ్లు అయిన హ్యుందాయ్, కియా వంటి కంపెనీలు బలంగా ఎదగడం, మరోవైపు చైనా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ కార్లు రావడంతో హోండా బేరాలు దెబ్బతిన్నాయి.

దక్షిణ కొరియా ఆటో మార్కెట్ గత కొన్నేళ్లుగా భారీ మార్పులకు లోనవుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్ పెరిగింది. టెస్లా (Tesla), చైనాకు చెందిన బివైడి (BYD) వంటి కంపెనీలు కొరియా మార్కెట్లోకి చొచ్చుకుపోతున్నాయి. హోండా తన ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహంలో కొంచెం వెనకబడి ఉండటం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది హోండా కార్ల విక్రయాలు కొరియాలో ఏకంగా 22 శాతం పడిపోయి కేవలం 1,951 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇంత తక్కువ సేల్స్ తో వ్యాపారాన్ని కొనసాగించడం భారంగా మారడంతో, వనరులను ఆప్టిమైజ్ చేయడానికి, దీర్ఘకాలిక పోటీతత్వాన్ని పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోండా స్పష్టం చేసింది.
కేవలం దక్షిణ కొరియాలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన చైనాలో కూడా హోండా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. 2025లో చైనాలో హోండా విక్రయాలు 6,46,000 వాహనాలకు పడిపోయాయి. ఇది ఐదేళ్ల క్రితం నాటి అమ్మకాలతో పోలిస్తే 60 శాతం తక్కువ. చైనాలో ఉన్న కనీసం ఒక జాయింట్ వెంచర్ ప్లాంట్‌ను కూడా హోండా మూసివేయబోతున్నట్లు సమాచారం. అక్కడ చైనాకు చెందిన లోకల్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు ఇచ్చే ధరల యుద్ధాన్ని తట్టుకోలేక హోండా సతమతమవుతోంది. థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల్లో కూడా హోండా సేల్స్ గతేడాది తగ్గుముఖం పట్టాయి.

దక్షిణ కొరియాలో కార్ల అమ్మకాలు నిలిపివేసినప్పటికీ, హోండా తన మోటార్ సైకిల్ (Motorcycle) వ్యాపారాన్ని మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అక్కడ హోండా బైకులకు ఇంకా మంచి డిమాండ్ ఉంది. అలాగే, అప్పటికే హోండా కార్లు కొన్న కస్టమర్ల కోసం ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ (After-sales service) అందుబాటులో ఉంటుంది. అంటే కారు రిపేర్లు, స్పేర్ పార్ట్స్ సరఫరా, వారంటీ సపోర్ట్ వంటి సేవలను హోండా కొరియా అందిస్తూనే ఉంటుంది. ఇది పాత కస్టమర్లకు కొంత ఊరటనిచ్చే విషయమే.
ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి హోండా తన ఎలక్ట్రిక్ వాహనాల (EV) వ్యూహాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. ఇందుకోసం సుమారు 16 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.33 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. గతంలో సోనీతో కలిసి చేయాలనుకున్న ఈవీ ప్రాజెక్టును నిలిపివేసిన హోండా, ఇప్పుడు సొంతంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి పెడుతోంది. గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం పెట్రోల్ కార్లపైనే ఆధారపడితే సరిపోదని, భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని హోండా గుర్తించింది. ఈ క్రమంలోనే తక్కువ లాభాలు ఉన్న కొరియా వంటి మార్కెట్ల నుంచి తప్పుకుని, వనరులను ఈవీ రంగం వైపు మళ్లిస్తోంది.


Click it and Unblock the Notifications