7 మంది కలిసి వెళ్లొచ్చు, 20.4 కి.మీ మైలేజ్, ఫీచర్స్ ఎక్కువే.. అయినా ఎందుకు పట్టించుకోవడం లేదు?
భారతదేశంలో ఏడు సీట్ల వాహనం కొనాలనుకునే చాలా మంది వినియోగదారుల మనసులో ముందుగా మెదిలే పేర్లు టయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎర్టిగా. ఈ రెండు మోడళ్లు సంవత్సరాలుగా మార్కెట్లో బలమైన స్థానం సంపాదించుకోవడంతో, 7-సీటర్ కార్లంటే ఇవే అనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది. అయితే, చాలామంది 7-సీట్ల SUV సెగ్మెంట్ వైపు అంతగా దృష్టి పెట్టడం లేదు. ఈ సెగ్మెంట్‌లో కూడా కొన్ని ఆసక్తికరమైన ఎంపికలు ఉన్నప్పటికీ, అవి ఆశించినంతగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాయి. అటువంటి మోడళ్లలో దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ నుంచి వచ్చిన 7-సీట్ల అల్కాజార్ (Alcazar) ఒకటి. ఇది రూపకల్పన, ఫీచర్లు, డ్రైవింగ్ సౌలభ్యం పరంగా చూస్తే టయోటా ఇన్నోవాకు నిజమైన ప్రత్యామ్నాయంగా నిలవగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
నేరుగా పోల్చేలా ఇన్నోవాతో సమానమైన బాడీ స్టైల్ లేకపోయినా, అదే బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వినియోగదారులు అల్కాజార్‌ను పరిగణించవచ్చు. SUV లుక్, ప్రీమియం ఇంటీరియర్స్, ఆధునిక టెక్నాలజీ వంటి అంశాలు దీనిని ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే, మార్కెట్లో దీనికి తగినంత గుర్తింపు లేకపోవడం అల్కాజార్‌కు పెద్ద లోపంగా మారింది. చాలామంది 7-సీటర్ అంటే ఆటోమేటిక్‌గా ఇన్నోవా లేదా ఎర్టిగా వైపే మొగ్గు చూపుతుండటంతో, అల్కాజార్‌కు ఆదరణ తగ్గింది.

ఈ కారణంగానే గత కొన్ని నెలలుగా ఈ 7-సీట్ల SUV అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణగా డిసెంబర్ 2025 అమ్మకాలు నిలుస్తున్నాయి. ఆ నెలలో కేవలం 579 యూనిట్ల హ్యుందాయ్ అల్కాజార్ SUV మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది ఏడాది క్రితం పరిస్థితితో పోల్చితే గణనీయమైన తగ్గుదల. డిసెంబర్ 2024లో ఈ హ్యుందాయ్ 7-సీటర్ మొత్తం 1,342 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఒకే ఏడాదిలో అమ్మకాలు 56.86 శాతం పడిపోయినట్టే. ఈ గణాంకాలు చూస్తే, ఫీచర్లు, ప్రీమియం ఫీలింగ్ ఉన్నప్పటికీ సరైన మార్కెటింగ్, వినియోగదారుల అవగాహన లోపం కారణంగా అల్కాజార్ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోతుంది. హ్యుందాయ్ అల్కాజార్ ఒక సామర్థ్యం ఉన్న 7-సీట్ల SUV. సరైన సమయంలో, సరైన వ్యూహంతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించగలిగితే, ఈ మోడల్ మళ్లీ అమ్మకాల బాట పట్టే అవకాశం కూడా ఉందని ఆటో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హ్యుందాయ్ అల్కాజార్‌ను దగ్గరగా పరిశీలిస్తే, ధర-ఫీచర్ల పరంగా ఇది నిజంగానే విలువైన 7-సీట్ల SUVగా కనిపిస్తుంది. ఈ మోడల్ ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ అనే నాలుగు వేర్వేరు వేరియంట్లలో లభిస్తోంది. ఈ విస్తృత వేరియంట్ ఎంపిక వల్ల బడ్జెట్‌ను బట్టి లేదా ప్రీమియం ఫీచర్లను కోరుకునే వినియోగదారులు తమ అవసరాలకు తగిన మోడల్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.
ధర విషయానికి వస్తే, అల్కాజార్ ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుతం రూ.14.50 లక్షల నుంచి రూ. 21.21 లక్షల వరకు ఉంది. ఇంజిన్ పనితీరు పరంగా ఇందులోని టర్బో పెట్రోల్ ఇంజిన్ 158 bhp పవర్‌తో పాటు 253 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు డీజిల్ ఇంజిన్ 114 bhp పవర్, 250 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో లభిస్తుంది.

మైలేజీ విషయంలో కూడా అల్కాజార్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ 17.5 కిమీ నుంచి 18 కిమీ వరకు అందిస్తుండగా, డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ సుమారు 18.1 కిమీ మైలేజీని ఇస్తుంది. డీజిల్ మాన్యువల్ వేరియంట్ అయితే ఇంకా మెరుగ్గా, దాదాపు 20.4 కిమీ వరకు మైలేజీ అందిస్తుంది. ఈ అన్ని అంశాలు కలసి హ్యుందాయ్ అల్కాజార్‌ను ధర, ఫీచర్లు, పనితీరు, మైలేజీ అన్నింటిలోనూ సమతుల్యమైన 7-సీట్ల SUVగా నిలబెడుతున్నాయి.


Click it and Unblock the Notifications








