ఏకంగా 30 కిమీ మైలేజ్.. మారుతి డిజైర్‌కు గట్టి పోటీ.. హ్యుందాయ్ కారు ధర భారీగా పెంపు
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి మైలేజ్, తక్కువ బడ్జెట్ సెడాన్ కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ విభాగంలో హ్యుందాయ్ సంస్థకు చెందిన ఆరా (Hyundai Aura) కారు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే, జూన్ నెల ప్రారంభంలోనే ఈ కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ సంస్థ ఒక చేదు వార్త చెప్పింది. ఆరా మోడల్ ధరలను పెంచడంతో పాటు, కస్టమర్లకు తక్కువ ధరలో లభించే కొన్ని పాపులర్ వేరియంట్లను కంపెనీ మార్కెట్ నుంచి శాశ్వతంగా తొలగించింది.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. హ్యుందాయ్ ఆరా ధరలపై 0.83 శాతం వరకు అదనపు భారం పడింది. దీనివల్ల వివిధ వేరియంట్లను బట్టి వినియోగదారులు దాదాపు రూ.5,700 వరకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయకపోవడం కొంతవరకు ఊరట కలిగించే విషయమే.

ఇదే సమయంలో కంపెనీ పెద్ద షాక్ ఇస్తూ, మార్కెట్లో ఎక్కువ మంది కొనే ఆరా S పెట్రోల్-ఆటోమేటిక్ (AMT), అత్యంత చౌకైన సిఎన్‌జీ మోడల్ అయిన E CNG-మాన్యువల్ వేరియంట్లను ఎప్పటికీ బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు తర్వాత ఆరా కారు వేరియంట్ల కొత్త రేట్లను పరిశీలిస్తే.. 1.2 లీటర్ నార్మల్ పెట్రోల్ మాన్యువల్ విభాగంలో బేస్ మోడల్ E ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.5,99,990గానే ఉంది.
కానీ S వేరియంట్ ధర రూ.5,700 పెరిగి రూ.6,91,200కి చేరింది. అలాగే SX వేరియంట్ ధర రూ.7,69,700కి, టాప్ ఎండ్ SX (O) వేరియంట్ ధర రూ.5,710 పెరిగి రూ.8,15,700కి చేరింది. పెట్రోల్ ఆటోమేటిక్ విభాగంలో SX Plus వేరియంట్ ధర రూ.5,700 పెరిగి ఇప్పుడు రూ.8,34,700కి చేరింది. ఇక సీఎన్‌జీ మాన్యువల్ విభాగంలో S వేరియంట్ ధర రూ.7,81,700కి, కార్పొరేట్ వేరియంట్ ధర రూ.7,90,700కి, SX సీఎన్‌జీ ధర రూ.8,59,700కి పెరిగింది.

హ్యుందాయ్ ఆరా కారులో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 83 PS పవర్‌ను, 113.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజ్ ప్రియుల కోసం అందుబాటులో ఉన్న బై-ఫ్యూయల్ సీఎన్‌జీ (CNG) వెర్షన్ 69 PS పవర్‌ను, 95.2 Nm టార్క్‌ను ఇస్తుంది.
ఈ సీఎన్‌జీ వేరియంట్ లీటరుకు దాదాపు 28 నుంచి 30 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. వారంటీ విషయానికి వస్తే, కంపెనీ ఈ కారుపై 3 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీని ఇస్తోంది. దీనికి పోటీగా ఉన్న మారుతి డిజైర్ కారుపై కేవలం 2 ఏళ్లు లేదా 40 వేల కిలోమీటర్ల వారంటీ మాత్రమే లభిస్తుంది. పైగా కస్టమర్లు అదనపు ప్యాకేజీ ద్వారా ఈ వారంటీని 7 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు.

హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో క్రూయిజ్ కంట్రోల్, ఈ సెగ్మెంట్‌లోనే బెస్ట్ అనిపించేలా 8-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. వీటితో పాటు ఈకో కోటింగ్ టెక్నాలజీ, రియర్ ఏసీ వెంట్స్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, టైప్-సి ఫ్రంట్ యూఎస్‌బీ ఛార్జర్, ఫుట్‌వెల్ లైటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
సరికొత్త ఎల్ఈడీ డీఆర్‌ఎల్స్ (LED DRLs), కనెక్టెడ్ డిజైన్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌తో కారు లుక్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. సేఫ్టీ పరంగా ఇందులో 30 కి పైగా కొత్త ఫీచర్లను చేర్చారు. 4 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తుండగా, 6 ఎయిర్‌బ్యాగ్‌ల ఆప్షన్ కూడా ఉంది. వీటితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కారును రోడ్డుపై అత్యంత సురక్షితంగా ఉంచుతాయి.


Click it and Unblock the Notifications