ఏడాదికి లక్షా ఎనభై వేల కార్లా? భారత్ లో ప్రతి ఐదు నిమిషాలకు ఒక కార్ సేల్.. దీనిని ఆపడం ఎవరి తరం?
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్ని కొత్త కార్లు వచ్చినా, హ్యుందాయ్ క్రెటా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో ఈ కారు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరం (FY26) గణాంకాలను పరిశీలిస్తే, క్రెటా తన హవాను మరోసారి చాటుకుంది. గడిచిన 12 నెలల్లో ఏకంగా 1,84,083 యూనిట్లు అమ్ముడై, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో మారుతి డిజైర్ (2.07 లక్షల యూనిట్లు) మొదటి స్థానంలో ఉండగా, టాటా నెక్సాన్ (1.96 లక్షల యూనిట్లు) రెండో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ, తన సొంత సెగ్మెంట్ (Mid-size SUV)లో మాత్రం క్రెటానే నెంబర్ వన్.
ధర, వేరియంట్ల వివరాలు
హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర ఎక్స్‌షోరూమ్ వద్ద దాదాపు రూ.10,72,589గా ఉంది. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా కంపెనీ ఇందులో మొత్తం 7 ప్రధాన వేరియంట్లను అందిస్తోంది. అవి: E, EX, S, S(O), SX, SX Tech, టాప్ ఎండ్ వెర్షన్ SX (O). ప్రతి వేరియంట్ తనదైన ప్రత్యేకతలను కలిగి ఉండటం వల్ల, బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు అందరికీ క్రెటా ఒక ఆప్షన్‌గా మారింది. ముఖ్యంగా స్టైలిష్ లుక్, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు ఈ కారును కస్టమర్లకు చేరువ చేశాయి.

బేస్ వేరియంట్ లోనూ రాజీ లేని స్టైల్
క్రెటాలోని బేస్ వేరియంట్ E ని చూస్తే, అది లో-స్పెక్ మోడల్ లా అస్సలు అనిపించదు. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ దాదాపు టాప్ మోడల్స్‌కు దగ్గరగా ఉంటుంది. ముందు భాగంలో హ్యుందాయ్ లోగోతో కూడిన స్టైలిష్ గ్రిల్, ఇన్వర్టెడ్ L-షేప్డ్ LED DRLలు కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. హెడ్ లైట్ల విషయానికి వస్తే, ఇందులో ప్రొజెక్టర్ యూనిట్, రిఫ్లెక్టర్ సెటప్‌ను అందించారు. లోపల డ్యాష్ బోర్డ్ లేఅవుట్ కూడా మిగిలిన వేరియంట్లలాగే ఉంటుంది. అయితే, బేస్ మోడల్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వంటివి ఉండవు.
ఇంటీరియర్, కంఫర్ట్ ఫీచర్లు
హ్యుందాయ్ క్రెటా లోపలి భాగం చాలా విశాలంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్ ఏసీ, ఫ్రంట్ అండ్ రియర్ USB పోర్ట్లు వంటి ప్రాథమిక వసతులు బేస్ మోడల్ నుంచే లభిస్తాయి. సెంట్రల్ రిమోట్ లాకింగ్, అన్ని పవర్ విండోస్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ఇక టాప్ వేరియంట్లకు వెళ్తే, అక్కడ సీన్ మారిపోతుంది. ఏకంగా లెవల్-2 ADAS వంటి 70కి పైగా అడ్వాన్స్డ్ ఫీచర్లు క్రెటాను ఒక స్మార్ట్ కార్‌గా మారుస్తాయి.

పవర్ ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు
క్రెటా విజయంలో దాని ఇంజిన్ పనితీరు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పెట్రోల్, డీజిల్ రెండింటిలోనూ లభిస్తుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. వీటికి 6-స్పీడ్ మాన్యువల్, iVT, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను జత చేశారు. సిటీ డ్రైవింగ్‌కు అయినా, హైవే ట్రిప్పులకైనా క్రెటా పర్ఫెక్ట్ అని డ్రైవర్లు ఫీల్ అవుతుంటారు.
మార్కెట్లో గట్టి పోటీ
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో క్రెటాకు పోటీ ఇచ్చే కార్ల సంఖ్య పెరిగింది. కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, ఎంజీ హెక్టర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ వంటి గట్టి పోటీదారులు ఉన్నప్పటికీ, క్రెటా అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా టాటా సియెర్రా, విన్ ఫాస్ట్ వంటి కొత్త ప్లేయర్లు కూడా ఈ రేసులోకి వస్తుండటంతో, రాబోయే రోజుల్లో ఈ సెగ్మెంట్ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఏదేమైనా, మిడ్-సైజ్ SUV అంటే క్రెటా అనే ముద్రను హ్యుందాయ్ బలంగా వేయగలిగింది.


Click it and Unblock the Notifications








