స్కూటర్ కొనే రేటులోనే కారుకు డౌన్ పేమెంట్.. క్రెటా సమ్మర్ ఎడిషన్ ప్లాన్ అదిరింది గురూ
భారతీయ రోడ్లపై రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మధ్యకాలంలో ఎస్‌యూవీల మధ్య పోటీ పెరిగినప్పటికీ, తన క్రేజ్‌ను ఏమాత్రం తగ్గించుకోకుండా సరికొత్త హంగులతో సమ్మర్ ఎడిషన్‌ను (Hyundai Creta Summer Edition 2026) మార్కెట్లోకి తీసుకువచ్చింది. కేవలం ధర మాత్రమే కాదు, కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఇందులో అందించిన టెక్నాలజీ ఫీచర్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కొత్త ఎడిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ధరలు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
హ్యుందాయ్ క్రెటా సరికొత్త ప్రస్థానం
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్, భారత మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ముఖ్యంగా క్రెటా మోడల్ ద్వారా మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా విడుదలైన సమ్మర్ ఎడిషన్ ద్వారా ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటివరకు 14 లక్షల మందికి పైగా కస్టమర్లు క్రెటాను ఎంచుకోగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఘనతను సెలబ్రేట్ చేసుకుంటూనే, కస్టమర్లకు మరింత టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఎడిషన్ ముఖ్య ఉద్దేశ్యం.

వేరియంట్లు, ధరల వివరాలు
హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ మొత్తం ఆరు ప్రధాన వేరియంట్లలో (EX, EX(O), S(O), S(O) Knight, SX, SX Premium లభ్యమవుతోంది. దీని ప్రారంభ ధర రూ.12.06 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.17.89 లక్షల వరకు ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు రెండూ ఉన్నాయి. మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినా, ప్రతి వేరియంట్‌లోనూ కొత్త ఫీచర్లను జోడించడం విశేషం. ముఖ్యంగా మధ్యతరగతి కస్టమర్ల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఎంట్రీ లెవల్ వేరియంట్లలో కూడా ప్రీమియం ఫీచర్లను అందించారు.
స్మార్ట్ ఫీచర్ల జాతర
ఎంట్రీ లెవల్ EX వేరియంట్‌ను గమనిస్తే, ఇందులో స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్ వంటి సౌకర్యాలను చేర్చారు. దీని ధర పెట్రోల్ మోడల్‌కు రూ.12.05 లక్షలు, డీజిల్ మోడల్‌కు రూ.13.61 లక్షలుగా ఉంది. ఇక EX(O) వేరియంట్‌కు వెళ్తే, ఇందులో క్వాడ్-బీమ్ ఎల్ఈడి హెడ్‌లైట్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, డైనమిక్ గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ కెమెరా వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. వెనుక సీట్లో కూర్చునే వారికి ఎండ తగలకుండా రియర్ విండో సన్‌షేడ్స్ కూడా ఈ వేరియంట్ నుంచి అందుబాటులోకి వస్తాయి.

సేఫ్టీ ఫస్ట్ - డ్యాష్‌క్యామ్, మరిన్ని
నేటి కాలంలో రోడ్డు భద్రతకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో.. హ్యుందాయ్ S(O), S(O) నైట్ వేరియంట్లలో డ్యాష్‌క్యామ్‌ను అమర్చింది. ఇది ప్రయాణంలో ప్రతి క్షణాన్ని రికార్డ్ చేయడమే కాకుండా, ప్రమాద సమయాల్లో కీలక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. నైట్ ఎడిషన్ లో బ్లాక్ థీమ్ తో వచ్చే లుక్స్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. వీటి ధరలు రూ.14.19 లక్షల నుంచి రూ.17.25 లక్షల మధ్యలో ఉన్నాయి.
ప్రీమియం టెక్నాలజీ, టాప్ వేరియంట్లు:
క్రెటా SX సమ్మర్ ఎడిషన్‌లో 10.25 అంగుళాల భారీ మల్టీ-డిస్ప్లే డిజిటల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఇది కారు లోపల లగ్జరీ ఫీల్‌ను ఇస్తుంది. ఇక అత్యంత ఖరీదైన SX Premium వేరియంట్ లో అయితే టెక్నాలజీ పీక్స్‌లో ఉంటుంది. ఇందులో సరౌండ్ వ్యూ మానిటర్ (SVM), బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ (BVM), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అంటే కారు చుట్టూ 360 డిగ్రీల కోణంలో ఏం జరుగుతుందో మీరు స్క్రీన్ పై చూడవచ్చు. ఇరుకైన గల్లీల్లో కారు నడిపేటప్పుడు ఈ ఫీచర్లు ఎంతో ఉపయోగపడతాయి.
ఇంజిన్ సామర్థ్యం, పనితీరు
ఈ సమ్మర్ ఎడిషన్‌లో ఇంజిన్ల పరంగా ఎలాంటి మార్పులు లేవు. నమ్మకమైన 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (115hp), 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ (116hp) లతోనే ఇవి నడుస్తాయి. అయితే ఈ ఎడిషన్‌లో టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ లేదు. కస్టమర్ల సౌలభ్యం కోసం మాన్యువల్, ఐవీటీ (IVT), ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు వేరియంట్‌ను బట్టి అందుబాటులో ఉన్నాయి. ఎండలు మండుతున్న ఈ సమయంలో కస్టమర్లకు మరింత కంఫర్ట్, కాన్ఫిడెన్స్ ఇవ్వడమే లక్ష్యమని హ్యుందాయ్ నేషనల్ సేల్స్ హెడ్ సునీల్ మూల్‌చందాని తెలిపారు.


Click it and Unblock the Notifications








