27 కిమీ మైలేజ్.. అదరిపోయే లగ్జరీ ఫీచర్లు.. ఎన్ని ఉన్నా ఈ కారును కొనడానికి జంకుతున్న జనం.. ఎందుకంటే ?
దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ నుంచి ఎన్నో ఆశలతో మార్కెట్లోకి వచ్చిన మైక్రో ఎస్‌యూవీ ఎక్స్టర్(Hyundai Exter) ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. టాటా పంచ్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని భావించినప్పటికీ, అమ్మకాల పరంగా ఈ కారు వెనుకబడిపోవడం ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తక్కువ ధర, అదిరిపోయే మైలేజ్ ఉన్నప్పటికీ కస్టమర్లు ఎక్స్టర్ వైపు మొగ్గు చూపకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జనవరి 2026 విక్రయాల గణాంకాలు హ్యుందాయ్ ఎక్స్టర్‌కు కోలుకోలేని దెబ్బ తీశాయి. పోయిన నెలలో ఈ మోడల్ కేవలం 5,621 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. జనవరి 2025లో 6,088 యూనిట్లు విక్రయించిన కంపెనీ, ఏడాది కాలంలో ఏకంగా 7 శాతం వార్షిక నష్టాన్ని మూటగట్టుకుంది. హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఇతర మోడళ్లు గ్రేడ్ i10 నియోస్, ఆరా వంటివి అమ్మకాల్లో దూసుకుపోతున్న తరుణంలో, ఎక్స్టర్ మాత్రం వెనుకబడిపోవడం కంపెనీ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.

టాటా పంచ్‌ను ఢీకొట్టడానికి హ్యుందాయ్ ఈ కారులో ఎన్నో ప్రీమియం ఫీచర్లను జోడించింది. సన్‌రూఫ్, డ్యాష్‌క్యామ్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు ఉన్నప్పటికీ, కస్టమర్ల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. దీనికి ప్రధాన కారణం దీని డిజైన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎస్‌యూవీ అంటే ఉండాల్సిన ఆ రఫ్ అండ్ టఫ్ లుక్ ఎక్స్టర్‌లో లోపించిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ముందు వైపు స్టైలిష్‌గా ఉన్నప్పటికీ, వెనుక భాగం డిజైన్ బాక్సీగా ఉండటం, టైర్లు చిన్నవిగా అనిపించడం కస్టమర్లను నిరాశపరిచింది. మైక్రో ఎస్‌యూవీ విభాగంలో టాటా పంచ్ తన సేఫ్టీ రేటింగ్ (5-స్టార్), స్ట్రాంగ్ డిజైన్‌తో మార్కెట్‌ను ఏలుతోంది.

ఎక్స్టర్ అమ్మకాలు తగ్గినా, ఈ కారు అందించే పెర్ఫార్మెన్స్‌లో మాత్రం ఎలాంటి లోపం లేదు. సాధారణ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా దీని ధరను రూ.5.74 లక్షల నుంచి రూ.9.61 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. ఇందులో 1.2 లీటర్ కప్పా ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 83 bhp పవర్, 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా పంచ్‌లో త్రీ-సిలిండర్ ఇంజిన్ ఉండగా, ఎక్స్టర్‌లో ఫోర్-సిలిండర్ ఇంజిన్ ఉండటం వల్ల వైబ్రేషన్లు తక్కువగా ఉంటాయి. డ్రైవింగ్ స్మూత్‌గా ఉంటుంది.
ఎక్స్టర్ ప్రధాన ఆకర్షణ దాని మైలేజ్. ముఖ్యంగా సిఎన్‌జి వేరియంట్ కిలోకు 27.1 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. హ్యుందాయ్ ఇందులో ట్విన్ సిలిండర్ టెక్నాలజీని వాడటం వల్ల డిక్కీలో కూడా తగినంత స్థలం లభిస్తుంది. ఇక పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లు 19.4 కిమీ, ఏఎంటీ మోడళ్లు 19.2 కిమీ మైలేజీని ఇస్తాయి. ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా, కేవలం లుక్ విషయంలో వచ్చిన నెగటివ్ టాక్ కారు అమ్మకాలను దెబ్బతీసింది.

ప్రస్తుత పతనం నుంచి గట్టెక్కేందుకు హ్యుందాయ్ ఇప్పటికే ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్ పనులను ప్రారంభించింది. ఇటీవలే రోడ్లపై ఈ కారు టెస్టింగ్ చేస్తున్న చిత్రాలు బయటకు వచ్చాయి. రాబోయే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో భారీ మార్పులు ఉండనున్నాయి. నెక్స్ట్ జనరేషన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ ఇస్తున్నారు. ఇండియాలోనే మొదటిసారిగా గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఈ కారులో ప్రవేశపెట్టనున్నారు.
12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ , 9.9 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఇందులో ఉండనున్నాయి. హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ మార్పులతో కారుకు మరింత ఎస్‌యూవీ లుక్ ఇచ్చేందుకు హ్యుందాయ్ ప్రయత్నిస్తోంది.
హ్యుందాయ్ తన ఎక్స్టర్ మోడల్‌ను ఎక్స్, ఎస్, ఎస్ఎక్స్ వంటి ఎనిమిది వేరియంట్లలో విక్రయిస్తోంది. ఒకవేళ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో డిజైన్ లోపాలను సరిదిద్ది, మరింత శక్తివంతంగా మార్కెట్లోకి తెస్తే, రాబోయే రోజుల్లో పంచ్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసేందుకు డీలర్లు భారీ డిస్కౌంట్లు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








