బెంజ్ రేంజ్ ఫీచర్లున్నా ఈ కారును చూసి బేజారవుతున్న కస్టమర్లు.. 30 రోజుల్లో అమ్ముడైంది 9 కార్లు మాత్రమే
భారతదేశంలో హ్యుందాయ్ కార్లకు కస్టమర్ల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఎక్స్టర్, సబ్-కాంపాక్ట్ కేటగిరీలో వెన్యూ మోడళ్లు ప్రతి నెలా వేల సంఖ్యలో అమ్ముడవుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
అయితే, ఇదే సమయంలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రీమియం ఎలక్ట్రిక్ కారు అయోనిక్ 5 మాత్రం అమ్మకాల్లో తీవ్ర నిరాశ ఎదుర్కొంటోంది. జూన్ నెలలో ఈ ఎలక్ట్రిక్ కారును కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపించకపోవడంతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.

గత జూన్ నెల అమ్మకాల నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా కేవలం 9 మంది కస్టమర్లు మాత్రమే హ్యుందాయ్ అయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. గతేడాది ఇదే జూన్ నెలలో ఈ కారును 12 మంది కస్టమర్లు సొంతం చేసుకోగా, ఈ ఏడాది వార్షిక ప్రాతిపదికన ఏకంగా 25 శాతం మేర అమ్మకాలు క్షీణించడం ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోడ్లపై తిరిగేందుకు ఎంతో లగ్జరీగా కనిపించే ఈ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోడల్‌కు భారత మార్కెట్లో ఆశించిన స్థాయిలో డిమాండ్ రాకపోవడం కంపెనీకి పెద్ద మైనస్‌గా మారింది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హ్యుందాయ్ అయోనిక్ 5 ఎలక్ట్రిక్ కార్లలో అత్యుత్తమ టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో భారీ సైజు కలిగిన 84 kWh లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఒకసారి బ్యాటరీని పూర్తి స్థాయిలో ఛార్జ్ చేస్తే ఏకంగా 690 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ధృవీకరించింది.

ఈ ఎలక్ట్రిక్ కారులో ఉండే రియర్-వీల్ డ్రైవ్ (RWD) మోటార్ గరిష్టంగా 225 bhp పవర్, 350 Nm టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని సహాయంతో ఈ కారు కేవలం 7.3 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
ఎలక్ట్రిక్ కార్లను కొనేవారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఛార్జింగ్ టైమ్. ఈ ఇబ్బందిని అధిగమించేలా హ్యుందాయ్ అయోనిక్ 5 కారులో 800V అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు.
రోడ్లపై లాంగ్ జర్నీ చేసేటప్పుడు 350 kW రేటింగ్ గల సూపర్ ఫాస్ట్ డీసీ ఛార్జర్‌ను ఉపయోగిస్తే, ఈ కారు బ్యాటరీ కేవలం 18 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు చార్జ్ అయిపోతుంది. దీనివల్ల ఎక్కువ సమయం ఛార్జింగ్ స్టేషన్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం అస్సలు ఉండదు.
భద్రత పరంగా ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ లో ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో అత్యంత అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కలిగిన లెవెల్-2 అడాస్ టెక్నాలజీని అందించారు. ఈ సిస్టమ్ ద్వారా రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా ముందే నివారించే ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి 21 కంటే ఎక్కువ స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ప్రమాదాల నుంచి ప్రయాణీకులను రక్షిస్తాయి.
కారు ఇంటీరియర్ విషయానికి వస్తే ఇది ఎంతో విలాసవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. కేబిన్ లోపల వాడిన మెటీరియల్స్ చాలా వరకు రీసైకిల్ చేసిన పర్యావరణ అనుకూల ఉత్పత్తులతో తయారయ్యాయి. డ్యాష్‌బోర్డ్‌పై రెండు భారీ 12.3 ఇంచుల డిస్‌ప్లేలు ఉంటాయి, అందులో ఒకటి డ్రైవర్ సమాచారం కోసం కాగా, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం పనిచేస్తుంది.
ప్రయాణంలో అద్భుతమైన సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 8 స్పీకర్లు కలిగిన ప్రీమియం Bose మ్యూజిక్ సిస్టమ్, స్కై వ్యూ ఆస్వాదించడానికి పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. దేశీయ మార్కెట్లో ఈ కారు కేవలం ఒకే ఒక్క ఫుల్లీ లోడెడ్ వేరియంట్‌లో లభిస్తుంది, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 55.70 లక్షలుగా ఉంది.


Click it and Unblock the Notifications