పెద్ద, చిన్న ఫ్యామిలీ కోసం హ్యుందాయ్, కియా మాస్టర్ ప్లాన్.. మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న 4 కొత్త కార్లు
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం గ్రీన్ మొబిలిటీ వాహనాలకు, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. కేవలం ఎలక్ట్రిక్ కార్లపైనే కాకుండా పెట్రోల్ భారం తగ్గించే హైబ్రిడ్ కార్లపై భారతీయ కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని ముందే పసిగట్టిన దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్ (Hyundai), కియా (Kia) దేశీయ హైబ్రిడ్ వెహికల్ సెగ్మెంట్‌లో భారీ ఎంట్రీ ఇవ్వడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేశాయి. ఈ రెండు కంపెనీలు కలిసి రాబోయే 2027 సంవత్సరం నాటికి భారత మార్కెట్లో సరికొత్త హైబ్రిడ్ కార్లను పరిచయం చేయబోతున్నాయి.
నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్
భారతీయ కస్టమర్ల ఆల్-టైమ్ ఫేవరెట్ ఎస్‌యూవీ అయిన హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) త్వరలోనే సరికొత్త రూపులో అలరించబోతోంది. కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్ క్రెటా హైబ్రిడ్ వేరియంట్‌ను 2027లో లాంచ్ చేయడానికి కసరత్తులు చేస్తోంది. ఈ సరికొత్త కారులో కస్టమర్లకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు సరికొత్త హైబ్రిడ్ పవర్‌ట్రైన్ (ఇంజిన్ ప్లస్ బ్యాటరీ) టెక్నాలజీ కూడా లభించనుంది. ధర విషయానికి వస్తే.. ఈ క్రెటా హైబ్రిడ్ మోడల్ సాధారణ పెట్రోల్-డీజిల్ మోడల్స్ కంటే సుమారు రూ.2 లక్షల వరకు ఖరీదైనదిగా ఉండే అవకాశం ఉంది.

నెక్స్ట్ జనరేషన్ కియా సెల్టోస్ హైబ్రిడ్
హ్యుందాయ్ క్రెటా లాగే దాని భాగస్వామ్య బ్రాండ్ అయిన కియా ఇండియా సైతం తన మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ అయిన కియా సెల్టోస్ (Kia Seltos)ను సరికొత్త హైబ్రిడ్ రూపంలో మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. నెక్స్ట్-జెన్ కియా సెల్టోస్ హైబ్రిడ్ కార్ 2027 చివరి నాటికి భారతీయ రోడ్లపై పరుగులు తీసే అవకాశం ఉంది. సెల్టోస్ కార్ లో ఉండే పవర్‌ఫుల్ స్పోర్టీ లుక్స్, ప్రీమియం ఫీచర్లతో పాటు అదిరిపోయే మైలేజ్ కూడా కావాలనుకునే మధ్యతరగతి, ప్రీమియం కస్టమర్లకు ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది. దీని ధర కూడా ప్రస్తుత మోడల్స్ కంటే రూ.2 లక్షల వరకు ఎక్కువగా ఉండొచ్చు.
పెద్ద ఫ్యామిలీల కోసం హ్యుందాయ్ 7-సీటర్ కార్
ఉమ్మడి కుటుంబాలు లేదా పెద్ద ఫ్యామిలీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ సంస్థ ఒక సరికొత్త త్రీ-రో ప్రీమియం హైబ్రిడ్ ఎస్‌యూవీపై రాత్రింబగళ్లు పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు Ni1i అనే కోడ్‌నేమ్ ఫిక్స్ చేశారు. ఆటోమొబైల్ నివేదికల ప్రకారం.. రాబోయే ఈ సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ అనేది హ్యుందాయ్ టక్సన్ (Tucson) కారు లాంగ్-వీల్‌బేస్ వెర్షన్‌పై ఆధారపడి రూపొందుతోంది. విశాలమైన కేబిన్ స్పేస్, అత్యాధునిక లగ్జరీ ఫీచర్లు, అధునాతన హైబ్రిడ్ టెక్నాలజీతో రాబోతున్న ఈ 7-సీటర్ కార్ అంచనా ఎక్స్-షోరూమ్ ధర రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

మహింద్రా, టాటాలకు పోటీగా కియా సోరెంటో
మరోవైపు కియా ఇండియా సైతం పెద్ద ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన పట్టును బలపరుచుకోవడానికి గ్లోబల్ మార్కెట్లో ఉన్న తన పాపులర్ ఎస్‌యూవీ సోరెంటో (Kia Sorento) ఆధారంగా సరికొత్త హైబ్రిడ్ కారును భారత్‌కు తీసుకొస్తోంది. దీనికి MQ4i అనే కోడ్‌నేమ్ ఇచ్చారు. ఈ ప్రీమియం త్రీ-రో హైబ్రిడ్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వస్తే.. ప్రస్తుతం మార్కెట్లో రారాజులుగా వెలుగుతున్న మహింద్రా XUV700, టాటా సఫారీలతో పాటు మారుతి సుజుకి, టయోటా కంపెనీల అప్‌కమింగ్ హైబ్రిడ్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఫీచర్లు నెక్స్ట్ లెవెల్లో ఉండే ఈ పెద్ద కార్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.30 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.
ఇంజిన్ సస్పెన్స్, భవిష్యత్తు ప్రణాళికలు
ఈ అప్‌కమింగ్ హైబ్రిడ్ కార్ల ఇంజిన్ల విషయంలో మార్కెట్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదట్లో ఈ రెండు కంపెనీలు తమ పాత 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆధారిత హైబ్రిడ్ సిస్టమ్‌ను వాడతాయని ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. హ్యుందాయ్ కంపెనీ ఒక సరికొత్త 1.2-లీటర్ టీజీడీఐ (TGDi) టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను తయారు చేస్తోంది. ఇది పవర్‌ఫుల్ హైబ్రిడ్ సపోర్ట్‌తో రానుంది.

ఇవే కాకుండా, 2027లో రాబోయే సరికొత్త నెక్స్ట్-జెన్ కియా సోనెట్ (Kia Sonnet) కారుకు కూడా 2028 లేదా 2029 నాటికి హైబ్రిడ్ ఇంజిన్‌ను అమర్చడానికి కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. మొత్తానికి 2027 నాటికి ఈ నాలుగు హైబ్రిడ్ మోడళ్లు ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనాలకు తెరలేపడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications