ఆటోమొబైల్ చరిత్రలో కనివినీ ఎరుగని ఆఫ్-రోడర్.. 37 ఇంచుల టైర్లతో ఇది భూమిపై తిరిగే రాక్షస వాహనం
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) నుంచి మరో అద్భుతం ఆవిష్కృతమైంది. న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షో 2026 వేదికగా హ్యుందాయ్ తన పవర్‌ఫుల్ అడ్వెంచర్ కాన్సెప్ట్ SUV బౌల్డర్ (Boulder)ను ప్రపంచానికి పరిచయం చేసింది. కొండలు, గుట్టలు, బురద దారులు.. ఇలా ఎలాంటి కష్టతరమైన రోడ్డుపైనైనా సాఫీగా దూసుకుపోయేలా ఈ రాక్షస వాహనాన్ని తీర్చిదిద్దారు. ఆటోమొబైల్ ప్రియులను ఫిదా చేస్తున్న ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఆఫ్ స్టీల్ డిజైన్
హ్యుందాయ్ బౌల్డర్ కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దీనిని కంపెనీ తన సరికొత్త ఆర్ట్ ఆఫ్ స్టీల్ (Art of Steel) డిజైన్ ఫిలాసఫీతో రూపొందించింది. చూడగానే ఒక భారీ ఇనుప పెట్టెలా కనిపించే ఈ బాక్సీ డిజైన్, ఆఫ్-రోడింగ్ ప్రియులకు పూనకాలు తెప్పించేలా ఉంది. మజిల్డ్ బోనెట్, రెండు వరుసల్లో అమర్చిన ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, బోనెట్ మీద మోర్స్ కోడ్‌లో ఉన్న 'H' అక్షరం దీనికి ఒక యూనిక్ గుర్తింపును ఇస్తున్నాయి. రౌడీ లుక్ ఇచ్చే బంపర్, ముందరి భాగంలో ఉన్న టో హుక్స్ చూస్తుంటే ఇది ఎంతటి కష్టమైన దారినైనా సునాయాసంగా దాటేస్తుందని అర్థమవుతోంది.

అదిరిపోయే గ్రౌండ్ క్లియరెన్స్
సాధారణంగా కార్లకు 15 నుంచి 18 ఇంచుల టైర్లు ఉంటాయి. కానీ ఈ బౌల్డర్ ఎస్‌యూవీకి ఏకంగా 37 ఇంచుల భారీ మడ్-టెర్రైన్ టైర్లను అమర్చారు. దీనివల్ల కారుకు అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఎంత పెద్ద రాళ్లనైనా, బురదనైనా ఇవి చీల్చుకుంటూ వెళ్ళిపోతాయి. ఈ కారు అప్రోచ్, డిపార్చర్ యాంగిల్స్ చాలా షార్ప్‌గా ఉండటం వల్ల నిటారుగా ఉన్న కొండలను ఎక్కేటప్పుడు కారు బంపర్ రోడ్డుకు తగలదు. వెనుక భాగంలో టెయిల్ గేట్ మీద అమర్చిన స్పేర్ వీల్ దీనికి పక్కా ఆఫ్-రోడర్ లుక్‌ను కంప్లీట్ చేస్తోంది.
హై-టెక్, ప్రాక్టికల్ ఇంటీరియర్
బయట ఎంత రఫ్ గా కనిపిస్తుందో, లోపల అంత లగ్జరీగా, టెక్నాలజీతో నిండిపోయింది. కేబిన్ మొత్తం బ్లాక్ అండ్ బేజ్ కలర్ థీమ్‌తో చాలా ప్రీమియంగా ఉంటుంది. కారు ఊగుతున్నప్పుడు పట్టుకోవడానికి బలమైన గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. నేటి కాలంలో అందరూ టచ్ స్క్రీన్ల వెంట పడుతుంటే, హ్యుందాయ్ మాత్రం ఆఫ్-రోడింగ్ లో సౌలభ్యం కోసం ఫిజికల్ బటన్స్, రోటరీ నాబ్స్ (తిప్పే బటన్లు)కే ప్రాధాన్యత ఇచ్చింది. దీనివల్ల డ్రైవర్ రోడ్డు మీద నుంచి దృష్టి మళ్లించకుండానే ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు.

విండ్‌షీల్డ్ అంతా డిస్‌ప్లేనే
ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విండ్‌షీల్డ్ (ముందరి అద్దం) మొత్తం పొడవునా వ్యాపించి ఉన్న Head-Up Display (HUD). కారు వేగం, మ్యాప్స్ అన్నీ అద్దం మీదే కనిపిస్తాయి. ఇక సెంటర్ కన్సోల్‌లో నాలుగు వేర్వేరు స్క్రీన్లు ఉన్నాయి. ఇవి నావిగేషన్, మీడియా మాత్రమే కాకుండా కారు టైర్ ప్రెజర్, ఏ యాంగిల్ లో కారు వంగి ఉంది వంటి ఆఫ్-రోడ్ సమాచారాన్ని నిరంతరం అందిస్తూ ఉంటాయి. కారు లోపల ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత స్పోర్టీగా మారుస్తుంది.
మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది?
ప్రస్తుతానికి ఇది కేవలం ఒక కాన్సెప్ట్ మాత్రమే. అంటే దీనిని ప్రదర్శన కోసం మాత్రమే రూపొందించారు. కానీ, దీని బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా హ్యుందాయ్ ఒక పికప్ ట్రక్కును లేదా ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని 2030 నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ప్రాథమికంగా ఇది అమెరికన్ మార్కెట్ కోసం డిజైన్ చేయబడినప్పటికీ, భారతీయ వినియోగదారుల కోసం కూడా 2030 కల్లా ఒక పవర్‌ఫుల్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని లాంచ్ చేస్తామని హ్యుందాయ్ ఇండియా ధృవీకరించింది. దీని రాక జీప్ రాంగ్లర్ రూబికాన్, ఫోర్డ్ బ్రాంకో వంటి దిగ్గజాలకు వణుకు పుట్టించడం ఖాయం.


Click it and Unblock the Notifications








