చాలా తక్కువ ధరకే కొత్త ఎలక్ట్రిక్ కారు.. టెస్టింగ్‌లో కనిపించింది.. రూ.5-6 లక్షల్లో లాంచ్?
భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, హ్యూందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) కూడా తన పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే కంపెనీ ఒక కొత్త ఎలక్ట్రిక్ కారు మోడల్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కొత్త వాహనం భారతీయ రహదారులపై పరీక్షలు జరుపుతున్న సమయంలో స్పై షాట్‌లలో కనిపించడం, ఈ మోడల్‌పై ఆసక్తిని మరింత పెంచింది. ప్రస్తుతం హ్యుందాయ్ భారతదేశంలో మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో Hyundai Creta Electric అనే మోడల్‌ను అందిస్తోంది. అదేవిధంగా, ప్రీమియం విభాగానికి చెందిన Hyundai Ioniq 5 కూడా విక్రయాల్లో ఉంది.
అయితే ఐయోనిక్ 5 ధర ఎక్కువగా ఉండటంతో అది ప్రత్యేకంగా ఉన్నత స్థాయి వినియోగదారులకే పరిమితమవుతోంది. క్రెటా ఎలక్ట్రిక్ పూర్తిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ కాదని చెప్పాలి. ఈ నేపథ్యంలో, వినియోగదారులను ఆకర్షించేందుకు, క్రెటా ఎలక్ట్రిక్ కంటే తక్కువ ధరలో ఉండే ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకురానుంది. అంటే, మధ్యతరగతి వినియోగదారులు కూడా సులభంగా కొనుగోలు చేయగలిగేలా చౌకైన ఈవీని తీసుకురావాలనే లక్ష్యంతో హ్యుందాయ్ ముందుకు సాగుతోంది.

స్పై షాట్‌ల ద్వారా బయటకు వచ్చిన వివరాలను బట్టి చూస్తే, ఈ కొత్త మోడల్ కాంపాక్ట్ సైజులో ఉండే అవకాశం ఉంది. ఇది నగర ప్రయాణాలకు అనువుగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ రేంజ్ అందించే విధంగా రూపొందించబడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వస్తే, ఇప్పటికే పెరుగుతున్న EV డిమాండ్‌ను మరింతగా పెంచే అవకాశముంది.
తాజాగా బయటకు వచ్చిన స్పై షాట్‌లను పరిశీలిస్తే, ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు, అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే పరిచయమైన Hyundai Inster EV మోడల్‌కు చెందిన మరో వెర్షన్ కావచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. ఈ ఊహాగానాలు ప్రధానంగా వాహనం డిజైన్, పరిమాణం, స్టైలింగ్ అంశాల ఆధారంగా వచ్చాయి. డిజైన్ పరంగా చూస్తే, ఈ కారు పూర్తిగా కాంపాక్ట్ సెగ్మెంట్‌కు చెందినదిగా కనిపిస్తోంది.

లోపలి స్థలాన్ని గరిష్ఠంగా ఉపయోగించుకునేలా హ్యుందాయ్ దీన్ని పొడవుగా, బాక్సీ స్టైల్‌లో రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. చిన్న పరిమాణంలో ఎక్కువ స్పేస్ అందించాలనే ఉద్దేశంతో ఈ డిజైన్ ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. ఈ మోడల్‌లో కొన్ని ప్రత్యేకమైన డిజైన్ ఫీచర్లు గమనించవచ్చు. ముందు భాగంలో కిందివైపు అమర్చిన LED హెడ్‌ల్యాంప్‌లు, పైన మందపాటి రూఫ్ రైల్స్, అలాగే డోర్ హ్యాండిల్స్‌ను కలిపి ఈ కారు మోడ్రన్, ఫ్యూచరిస్టిక్ లుక్‌ను అందిస్తున్నాయి.
వెనుక భాగంలో ఉన్న టెయిల్ ల్యాంప్ డిజైన్, Venue Faceliftలో కనిపించిన లైటింగ్ స్టైల్‌ను పోలి ఉండటం ఆసక్తికరంగా ఉంది. సైజు పరంగా చూస్తే, ఇది సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లోకి వస్తున్నప్పటికీ, Hyundai Venue లాగా పూర్తి 3,995 మిమీ పొడవును కలిగి ఉండకపోవచ్చు. స్పై షాట్‌ల ఆధారంగా చూస్తే, ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 3,800 నుంచి 3,900 మిమీ మధ్య పొడవు కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ వివరాలను బట్టి చూస్తే, ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు, ప్రస్తుతానికి మార్కెట్‌లో ఉన్న Tata Nexon EV కు కాకుండా, ఎక్కువగా Tata Punch EV సెగ్మెంట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. బ్యాటరీ, రేంజ్ విషయానికి వస్తే, ఈ కొత్త మోడల్‌లో సుమారు 42 kWh నుంచి 49 kWh వరకు సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
ఈ స్థాయి బ్యాటరీతో, ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 400 కి.మీ నుంచి 500 కి.మీ వరకు డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదని భావిస్తున్నారు. ఈ రేంజ్ ప్రస్తుతం మాస్ మార్కెట్ EV సెగ్మెంట్‌లో చాలా ఆకర్షణీయంగా చెప్పుకోవచ్చు. దీని ధర ఖచ్చితంగా రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య ఉంటుందని అంచనా. కంపెనీ ఈ కారులో వినియోగదారుల కోసం అధునాతన ఫీచర్స్ అందించనున్నారు.


Click it and Unblock the Notifications








