దిమ్మతిరిగే షాకిచ్చిన హ్యుందాయ్ .. జనాలకు నచ్చిన కారు ధరను భారీగా పెంచిన కంపెనీ
సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్, తన పాపులర్ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ (Hyundai Venue) ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అలాంటి వారికి అలర్ట్. వేరియంట్, ఇంజిన్ రకాన్ని బట్టి హ్యుందాయ్ వెన్యూ ధరలు రూ.5,000 నుంచి రూ.20,000 వరకు పెరిగాయి. ఈ కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 2026 మార్చి చివరి నాటికి హ్యుందాయ్ చేసిన ఈ మార్పుల వల్ల ఏయే మోడల్స్ ఎంత ఖరీదు అయ్యాయో, వెన్యూ ప్రత్యేకతలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
దక్షిణ కొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా, తన అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ ధరలను ఎంపిక చేసిన వేరియంట్లపై పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేరియంట్,ఇంజిన్ రకాన్ని బట్టి ఈ పెంపు రూ.5,000 నుంచి గరిష్టంగా రూ.20,000 వరకు ఉంది. ముఖ్యంగా 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విభాగంలో HX5 మాన్యువల్ వేరియంట్‌పై అత్యధికంగా రూ.20,000 పెరగడంతో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.55 లక్షలకు చేరుకుంది. అయితే మిగిలిన 1.2 లీటర్ వేరియంట్ల ధరల్లో ఎటువంటి మార్పు చేయకపోవడం గమనార్హం.

మరోవైపు, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ విభాగంలో కేవలం ఆటోమేటిక్ (DCT) వేరియంట్ల ధరలు మాత్రమే పెరిగాయి. ఇందులో HX5 DCT మరియు HX6 DCT ట్రిమ్స్ పై రూ.9,000 చొప్పున పెరగ్గా, టాప్-ఎండ్ మోడల్ అయిన HX8 DCT పై రూ.5,000 మేర ధర పెరిగింది. టర్బో-పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లు పాత ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఇక డీజిల్ ప్రేమికులకు కూడా ధరల సెగ తగిలింది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగిన HX2, HX5 (MT/AT), HX7 (MT/Dual Tone) వేరియంట్లపై రూ.8,000 వరకు ధర పెరిగింది. ఈ ఇంజిన్ 116hp పవర్, 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ లాంగ్ డ్రైవ్స్‌కు అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది.
ధరలు పెరిగినప్పటికీ హ్యుందాయ్ వెన్యూ తన సెగ్మెంట్‌లో అత్యంత స్టైలిష్, ఫీచర్-రిచ్ కారుగా కొనసాగుతోంది. ఇందులో అందించిన బ్లూలింక్ కనెక్టివిటీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. భద్రత పరంగా కూడా వెన్యూ ఎక్కడా రాజీ పడలేదు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం వెన్యూ మార్కెట్ ధర రూ.8 లక్షల నుంచి రూ.15.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. స్పోర్టీ లుక్ ఇష్టపడే వారి కోసం ఉన్న వెన్యూ N-లైన్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు.

సాధారణంగా ప్రతి ఏటా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నెలలో ముడి సరుకుల ఖర్చులు పెరిగాయనే సాకుతో కంపెనీలు ధరలు పెంచుతుంటాయి. హ్యుందాయ్ కూడా అదే బాటలో నడిచింది. మార్కెట్లో టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్ వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, వెన్యూ తనదైన ప్రీమియం క్వాలిటీ, బ్రాండ్ వాల్యూతో దూసుకుపోతోంది. కాబట్టి కొత్త కారు కొనాలనుకునే వారు ఈ పెరిగిన ధరలను ఒకసారి సరిచూసుకుని, తమ బడ్జెట్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








