దేశం మొత్తం ఈ కారు డిజైన్ చూసి మెచ్చింది.. ఇప్పుడు సేఫ్టీలోనూ దుమ్ములేపింది
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన హ్యుందాయ్ వెన్యూ, ఇప్పుడు సేఫ్టీలోనూ తన సత్తా చాటింది. భారత్ NCAP (BNCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో హ్యుందాయ్ వెన్యూ, దాని స్పోర్టీ వెర్షన్ వెన్యూ ఎన్ లైన్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో హ్యుందాయ్ వెన్యూ అద్భుతమైన పాయింట్లను సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో ఈ కారు 32 పాయింట్లకు గాను 31.15 పాయింట్లు సాధించింది. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో జరిపిన ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్టులో డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ తల, మెడ భాగాలు పూర్తి సురక్షితంగా ఉన్నాయని తేలింది.
ముఖ్యంగా ఛాతీ భాగానికి అడిక్వేట్ (పర్వాలేదు) సేఫ్టీ లభించగా, కాళ్లు, తొడల భాగాలకు గుడ్ (చాలా మంచి) ప్రొటెక్షన్ లభించింది. ఇక పక్క నుంచి వచ్చే ప్రమాదాలను తట్టుకోవడంలో వెన్యూ 16/16 పర్ఫెక్ట్ స్కోరు సాధించడం గమనార్హం. అంటే సైడ్ కొలీషన్ జరిగినప్పుడు కారు లోపల ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

పిల్లల సేఫ్టీలో ఆల్-రౌండర్
చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) విభాగంలో కూడా వెన్యూ తన సత్తా చాటింది. 49 పాయింట్లకు గాను 44.46 పాయింట్లు సాధించింది. క్రాష్ టెస్ట్ సమయంలో వెనుక సీటులో ఉన్న 18 నెలల, 3 ఏళ్ల చిన్న పిల్లల డమ్మీలకు ఎటువంటి తీవ్ర గాయాలు కాకుండా ఈ కారు రక్షణ కల్పించింది. డైనమిక్ టెస్టింగ్ విభాగంలో 24కి 23.46 పాయింట్లు రావడం విశేషం. ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ మౌంట్స్ ఉండటం వల్ల పిల్లలు కూర్చునే సీట్లు ప్రమాద సమయంలో చెక్కుచెదరకుండా పటిష్టంగా ఉంటాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.
71% హై-స్ట్రెంత్ స్టీల్
హ్యుందాయ్ వెన్యూ కేవలం ఫీచర్లకే పరిమితం కాకుండా, దాని లోపలి నిర్మాణం (Body Structure) కూడా చాలా బలంగా ఉంటుంది. ఈ కారును నిర్మించడానికి 71 శాతం హై-స్ట్రెంత్, అల్ట్రా హై-స్ట్రెంత్ స్టీల్‌ను వాడారు. ఇది గ్లోబల్ K1 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రూపొందించబడింది. ప్రమాదం జరిగినప్పుడు ఆ ఒత్తిడిని క్యాబిన్ లోపలికి రాకుండా బాడీ పూర్తిగా పీల్చుకుంటుంది. దీనివల్ల కారు లోపల ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ఉంటారు.

65కు పైగా సేఫ్టీ ఫీచర్లు
హ్యుందాయ్ వెన్యూలో ఏకంగా 65కు పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో విశేషం ఏంటంటే, 33 ఫీచర్లను కంపెనీ తన అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందిస్తోంది. అంటే మీరు చౌకైన మోడల్ కొన్నా మీకు పూర్తి భద్రత లభిస్తుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, కారు అదుపు తప్పకుండా ఉండే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, కొండ ప్రాంతాల్లో వెనక్కి జారకుండా ఉండే హిల్-అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.వెన్యూ ఎన్ లైన్ లో నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉండటం వల్ల బ్రేకింగ్ పవర్ పెరుగుతుంది. టైర్లలో గాలి తక్కువగా ఉంటే ముందే హెచ్చరించే TPMS ఫీచర్ ఉంది.
నేటి ఆధునిక కాలంలో కేవలం ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటే సరిపోదు. అందుకే హ్యుందాయ్ వెన్యూలో హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవల్-2 ADAS టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఇందులో 21 రకాల ఇంటెలిజెంట్ ఫీచర్లు ఉంటాయి. ఫార్వర్డ్ కొలీషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ టెక్నాలజీ వల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ముందే నివారించవచ్చు.

మార్కెట్లో భారీ డిమాండ్.. లక్ష బుకింగ్స్
సేఫ్టీతో పాటు స్టైలిష్ లుక్, అత్యాధునిక ఇంటీరియర్ ఉండటంతో వెన్యూకి మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈ కారుకు లక్షకు పైగా బుకింగ్స్ వచ్చాయి. తాజాగా వచ్చిన 5-స్టార్ రేటింగ్ వల్ల కస్టమర్ల నమ్మకం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రేటింగ్ వెన్యూ పెట్రోల్, డీజిల్.. ఇలా అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. ఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ సేఫ్టీ సర్టిఫికేషన్‌ను హ్యుందాయ్ ఇండియా ప్రతినిధులకు అందజేశారు.


Click it and Unblock the Notifications








