ఇండియాలో ఇంతకంటే మంచి కారు ఉందా? నెంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ , రూ.5.79 లక్షలు, 33 km మైలేజ్
గత కొన్ని సంవత్సరాలుగా భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. రోడ్లపై చూసినా, కొత్తగా కొనుగోలు చేస్తున్న వాహనాల్లో చూసినా ఎస్‌యూవీలు ముందంజలోనే ఉన్నాయి. ఈ ప్రభావం సెడాన్ కార్లపై బలంగా పడింది. ఒకప్పుడు మంచి డిమాండ్ ఉన్న సెడాన్ మోడళ్లకు ఇప్పుడు కొంత వెనుకబడిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఈ మార్పుల మధ్య కూడా హ్యాచ్‌బ్యాక్ కార్లు మాత్రం తమ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నగరాల్లో సౌకర్యవంతమైన డ్రైవింగ్, తక్కువ ఖర్చుతో నిర్వహణ, మంచి మైలేజ్ వంటి కారణాలతో హ్యాచ్‌బ్యాక్‌లు ఇప్పటికీ వినియోగదారుల మొదటి ఎంపికగా కొనసాగుతున్నాయి. ఈ విభాగంలో మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruri Suzuki Swift) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఎప్పటిలాగే స్టైలిష్ డిజైన్, నమ్మకమైన పనితీరు, అలాగే అందుబాటు ధరతో ఈ కారు భారతీయ వినియోగదారుల మనసును గెలుచుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు) దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా స్విఫ్ట్ నిలవడం దీని ప్రజాదరణకు నిదర్శనం. ఈ కాలంలో మారుతి సుజుకి మొత్తం 1,85,320 స్విఫ్ట్ కార్లను విక్రయించింది.

ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, దీనిపై వినియోగదారుల విశ్వాసం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. అంతేకాదు, గత ఆర్థిక సంవత్సరం 2024-25తో పోల్చితే ఈ అమ్మకాల్లో 3 శాతం వృద్ధి నమోదైంది. మార్కెట్‌లో ఎస్‌యూవీలు ఎంతగా పెరుగుతున్నా, స్విఫ్ట్ వంటి హ్యాచ్‌బ్యాక్ మోడళ్లకు డిమాండ్ తగ్గలేదని ఇది స్పష్టంగా చెబుతోంది. మారుతున్న ట్రెండ్‌ల మధ్య సరైన ఫీచర్లు అందిస్తే హ్యాచ్‌బ్యాక్‌లు ఇంకా మంచి స్థాయిలో నిలబడగలవని అర్థం.
భారత ఆటోమొబైల్ రంగంలో ఎంతో కాలంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటి. ఈ కార్ ప్రయాణం 2005 మేలో మొదలైంది. అప్పట్లో మొదటి తరం మోడల్‌గా మార్కెట్‌లో అడుగుపెట్టిన స్విఫ్ట్, తన స్పోర్టీ లుక్, కంఫర్ట్ డ్రైవింగ్ అనుభవం, అలాగే మంచి మైలేజ్‌తో యువత నుంచి కుటుంబాల వరకు అందరినీ ఆకట్టుకుంది. అప్పటి నుంచి ప్రతి తరం మోడల్‌తో కొత్త మార్పులు, ఆధునిక ఫీచర్లను జోడిస్తూ వస్తూ, ఈ కార్ తన పాపులారిటీని మరింత పెంచుకుంది.

ఇప్పుడు మార్కెట్లో ఉన్నది ఈ స్విఫ్ట్ యొక్క నాలుగో తరం మోడల్. 2024 మేలో విడుదలైన ఈ కొత్త జనరేషన్ స్విఫ్ట్, మరింత ఆకర్షణీయమైన డిజైన్, అప్‌డేటెడ్ టెక్నాలజీ, అలాగే మెరుగైన పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ మోడల్, నగర డ్రైవింగ్‌కు మాత్రమే కాకుండా హైవే ప్రయాణాలకు కూడా సరైన ఎంపికగా నిలుస్తోంది.
ధర విషయానికి వస్తే, భారత మార్కెట్లో ఈ కార్ ఇంకా అందుబాటు ధరలలోనే కొనసాగుతోంది. ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర సుమారు రూ. 5.79 లక్షలుగా ఉండగా, టాప్ వేరియంట్ ధర కూడా రూ. 8.65 లక్షల వరకు మాత్రమే ఉంది. ఈ ధరలు ఎక్స్-షోరూమ్ కేటగిరీలో ఉండటం గమనార్హం. అంటే, ఈ సెగ్మెంట్‌లో ఇతర కార్లతో పోలిస్తే స్విఫ్ట్ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా నిలుస్తోంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. LXi, VXi, ZXi, ZXi+ వంటి ట్రిమ్‌లతో లభిస్తుంది. పనితీరు పరంగా చూస్తే, ఈ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది 82 PS శక్తి, 112 Nm టార్క్‌ను అందిస్తూ సిటీ ట్రాఫిక్‌లో చురుకుదనాన్ని, అలాగే హైవేపై స్థిరమైన పనితీరును ఇస్తుంది. రోజువారీ ప్రయాణాల్లో ట్రాఫిక్ మధ్య సులభంగా నడిపించుకోవచ్చు.
ఇక 1.2-లీటర్ CNG ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ 70 PS పవర్, 102 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను అందించారు. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్లు సుమారు 24.80 నుంచి 25.75 కి.మీ./లీటర్ వరకు అందిస్తాయి. CNG వేరియంట్ 32.85 కి.మీ./కిలో వరకు మైలేజ్ ఇవ్వడం ఈ కారును మరింత ఆర్థికంగా మార్చుతోంది.


Click it and Unblock the Notifications