2026 మొదటి 6 నెలల్లో ఎక్కువగా కొనుగోలు చేసిన టాప్-10 కార్లు.. నంబర్-1గా ప్రజలకు ఇష్టమైన మోడల్
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కార్లలో ఒకటైన మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) మరోసారి తన సత్తా చాటింది. దేశీయ మార్కెట్లో సెడాన్ కార్లకు డిమాండ్ తగ్గుతోందనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ, డిజైర్ మాత్రం అమ్మకాల పరంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2026 జనవరి నుంచి జూన్ వరకు జరిగిన తొలి ఆరు నెలల అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మారుతి సుజుకి డిజైర్ మొత్తం 1,26,204 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంటే గత ఆరు నెలల వ్యవధిలోనే 1.26 లక్షలకు పైగా కొత్త కస్టమర్లు ఈ సెడాన్‌ను కొనుగోలు చేశారు. ఈ గణాంకాలు డిజైర్‌పై భారతీయ వినియోగదారులు ఇప్పటికీ ఎంతటి నమ్మకం ఉంచుతున్నారో తెలియజేస్తున్నాయి.
2026 తొలి ఆరు నెలల అమ్మకాలు పరిశీలిస్తే, డిజైర్ తర్వాత టాటా పంచ్ రెండో స్థానంలో నిలిచి గట్టి పోటీని ఇచ్చింది. ఈ కాలంలో మొత్తం 1,19,303 యూనిట్లు అమ్ముడవడంతో పంచ్ మరోసారి దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న SUVలలో ఒకటిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. మంచి ధర, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వంటి పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఈ మోడల్ సక్సెస్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

మూడో స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. భారత్‌లో అత్యంత నమ్మకమైన కాంపాక్ట్ SUVలలో ఒకటైన నెక్సాన్ ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 1,18,166 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఆకట్టుకునే డిజైన్, అదిరిపోయ ఫీచర్లు, పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్ల లభ్యత దీనికి నిరంతర డిమాండ్‌ను తీసుకొచ్చాయి. నాలుగో స్థానాన్ని మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఎర్టిగా మోడల్ కైవసం చేసుకుంది.
భారత కుటుంబాలకు అత్యంత ఇష్టమైన 7-సీటర్ MPVగా పేరొందిన ఎర్టిగా మోడల్ తొలి ఆరు నెలల్లో 1,08,295 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. విశాలమైన క్యాబిన్, మంచి మైలేజ్, సీఎన్‌జీ ఆప్షన్ కారణంగా ఎర్టిగా తన క్రేజ్‌ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఇది 7 సీటర్ సెగ్మెంట్‌లో అమ్మకాల పరంగా దేశంలో చాలా ప్రసిద్ది పొందింది. ఐదో స్థానంలో మారుతి సుజుకికే చెందిన ఫేమస్ కారు వ్యాగన్‌ఆర్ నిలిచింది.

మధ్యతరగతి కుటుంబాల ఫేవరెట్ హ్యాచ్‌బ్యాక్‌గా కొనసాగుతున్న ఈ కారు 1,00,704 యూనిట్ల అమ్మకాలతో టాప్-5లో చోటు దక్కించుకుంది. తర్వాతి స్థానంలో కొత్త తరం మారుతి స్విఫ్ట్ నిలిచి 97,747 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కొత్త డిజైన్, మెరుగైన మైలేజ్, ఆధునిక ఫీచర్లు స్విఫ్ట్‌కు మంచి డిమాండ్‌ను తీసుకొచ్చాయి. ఏడో స్థానంలో మారుతి సుజుకికి చెందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో నిలిచింది.
ఈ మోడల్ 96,996 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఎనిమిదో స్థానంలో మారుతి సుజుకి క్రాస్‌ఓవర్ ఫ్రాంక్స్ 95,441 అమ్మకాలను సాధించింది. స్టైలిష్ డిజైన్, టర్బో పెట్రోల్ ఇంజన్, కొత్త ఫీచర్లు ఫ్రాంక్స్ అమ్మకాలకు దోహదపడ్డాయి. తొమ్మిదో స్థానంలో హ్యుందాయ్ క్రెటా నిలిచింది. తొలి ఆరు నెలల్లో 91,391 యూనిట్లు అమ్ముడవడంతో దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మిడ్-సైజ్ SUVగా మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఇక పదో స్థానంలో మహీంద్రా స్కార్పియో నిలిచి 89,375 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. స్కార్పియో-N, స్కార్పియో క్లాసిక్ మోడళ్లకు వస్తున్న భారీ డిమాండ్ ఈ అమ్మకాలకు కారణమైంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, టాప్-10లో ఎక్కువ SUVలు, హ్యాచ్‌బ్యాక్‌లు, ఒక MPV ఉండగా, సెడాన్ విభాగం నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక మోడల్ మారుతి సుజుకి డిజైర్ మాత్రమే.


Click it and Unblock the Notifications