ఎన్ని కార్లున్నా జనాలు మాత్రం ఆ కారే కావాలంటున్నారు..సేల్స్‌లో మారుతి సునామీకి ప్రత్యర్థులు హడల్
2026 ప్రారంభంలోనే భారత ఆటోమొబైల్ రంగం అనూహ్య మలుపులతో వేడెక్కింది. ఇన్నాళ్లూ విపణిలో రారాజుగా వెలిగిన మారుతి సుజుకికి గట్టి పోటీనిస్తూ టాటా మోటార్స్ సంచలనం సృష్టించింది. జనవరి 2026 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, మారుతి తన ఆధిపత్యాన్ని చాటుకున్నప్పటికీ, మొదటి స్థానాన్ని మాత్రం టాటా నెక్సాన్‌కు కోల్పోయింది. సరికొత్త కార్ల ఎంట్రీ, పెరిగిన ఎస్‌యూవీ పిచ్చి వెరసి టాప్ 10 జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
నెక్సాన్ ధాటికి మారుతి కోట బద్దలు
టాటా నెక్సాన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 23,365 యూనిట్లతో అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది. గతేడాది జనవరితో పోలిస్తే సుమారు 51.75 శాతం వృద్ధిని సాధించడం విశేషం. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వేరియంట్‌లోనూ దూసుకుపోతుండటమే దీని విజయరహస్యం. కొత్త జిఎస్టీ (GST 2.0) నిబంధనలు కూడా దీని అమ్మకాలకు ఊతమిచ్చాయి.

సెడాన్ల సత్తా చాటిన డిజైర్
ఎస్‌యూవీల హవా నడుస్తున్నా, మారుతి డిజైర్ తన పట్టు కోల్పోలేదు. 19,629 యూనిట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. టాక్సీ రంగంలోనే కాకుండా ఫ్యామిలీ కార్‌గా కూడా డిజైర్‌కు ఉన్న క్రేజ్ తగ్గలేదని ఈ నంబర్లు చెబుతున్నాయి. గతేడాది 15,383 యూనిట్ల నుంచి ఈసారి భారీ వృద్ధిని నమోదు చేసింది.
పంచ్ అదిరింది.. క్రెటా తగ్గింది
టాటా నుంచి వచ్చిన మైక్రో ఎస్‌యూవీ పంచ్ 19,257 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు, మిడ్-సైజ్ ఎస్‌యూవీ కింగ్ హ్యుందాయ్ క్రెటా నాలుగో స్థానానికి పరిమితమైంది. క్రెటా 17,921 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది కంటే క్రెటా అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ, ఇప్పటికీ హ్యుందాయ్ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతోంది.

ఎర్టిగా, స్విఫ్ట్ హవా
మారుతి సుజుకి ఎర్టిగా 17,892 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఇది ఎంపీవీ(MPV) విభాగంలో తిరుగులేని విజేతగా నిలుస్తోంది. ఇక యువతకు ఎంతో ఇష్టమైన మారుతి స్విఫ్ట్ 17,806 యూనిట్లతో ఆరో స్థానాన్ని దక్కించుకుంది. కొత్త తరం స్విఫ్ట్ రాకతో ఈ అమ్మకాలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
బ్రెజ్జా, బలేనో పరిస్థితి
మారుతి బ్రెజ్జా 17,486 యూనిట్లతో ఏడో స్థానంలో ఉండగా, ప్రీమీయం హ్యాచ్‌బ్యాక్ బలేనో 16,782 యూనిట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. గతేడాది బలేనో అమ్మకాలు 19,965 గా ఉండేవి, అంటే ఈసారి కొంచెం తగ్గుదల కనిపిస్తోంది. చిన్న కార్ల కంటే ప్రజలు కాంపాక్ట్ ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణం.
మహీంద్రా స్కార్పియో రఫ్ అండ్ టఫ్
మహీంద్రా నుంచి 'స్కార్పియో' తన రఫ్ అండ్ టఫ్ లుక్స్‌తో 15,542 యూనిట్ల అమ్మకాలను సాధించి తొమ్మిదో స్థానంలో నిలిచింది. స్కార్పియో ఎన్ (N) మరియు క్లాసిక్ వేరియంట్లు రెండూ కలిపి గ్రామీణ, నగర ప్రాంతాల్లో మంచి డిమాండ్ కలిగి ఉన్నాయి.

మారుతి విక్టోరిస్ సంచలనం
మారుతి సుజుకి నుంచి కొత్తగా వచ్చిన విక్టోరిస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కేవలం ఐదు నెలల్లోనే 50,000 యూనిట్ల మైలురాయిని దాటి అదరగొట్టింది. జనవరి నెలలో 15,240 యూనిట్లతో ఇది టాప్ 10 జాబితాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. హైబ్రిడ్ ఆప్షన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉండటం దీనికి ప్లస్ పాయింట్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications








