అమ్మ, నాన్న, భార్య, పిల్లలు అందరూ ఒకే కారులో.. తక్కువలో అందరూ కొంటున్న పెద్ద కార్లు ఇవే!
కరోనా తరువాత కాలంలో ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులు ఆటోమొబైల్ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే ట్రెండ్ పెరగడంతో, ఎక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్న వాహనాలపై డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీవీ (Multi Purpose Vehicle) సెగ్మెంట్ మళ్లీ బలంగా నిలబడుతూ, కుటుంబ అవసరాలకు సరిపోయే ప్రాక్టికల్ ఆప్షన్‌గా మారింది. ఒకప్పుడు SUVల హవా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు పెద్ద కుటుంబాల కోసం సౌకర్యవంతమైన సీటింగ్, ఎక్కువ లెగ్‌రూమ్, ప్రయాణంలో సౌలభ్యం వంటి అంశాలు ప్రధానంగా మారాయి. ఇవన్నీ కలిపి ఎంపీవీ కార్లను మళ్లీ ముందుకు తీసుకువచ్చాయి. నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఒకే విధంగా ఉపయోగపడే ఈ వాహనాలు ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ ఛాయిస్‌గా మారుతున్నాయి.
2026 ఫిబ్రవరి నెలలో కూడా ఈ ట్రెండ్ మరింత బలపడింది. ఈ కాలంలో ఎంపీవీ సెగ్మెంట్ అమ్మకాలు 34,556 యూనిట్ల నుంచి 42,482 యూనిట్లకు పెరగడం గమనార్హం. ఒక సంవత్సరంలోనే సుమారు 22.9 శాతం వృద్ధి నమోదైంది. మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా, కియా కారెన్స్, మారుతి సుజుకి XL6, టయోటా రూమియన్ కార్లు గత నెలలో టాప్ 5 ఎంపీవీ కార్లు వీటి గురించి ఈ కథణంలో.

Maruti Suzuki Ertiga: ఎర్టిగా 2025 ఫిబ్రవరిలో 14,868 యూనిట్లు అమ్ముడవగా, 2026 ఫిబ్రవరిలో 17,807 యూనిట్లను నమోదు చేసి 19.8% వృద్ధిని సాధించింది. కొత్త ఎర్టిగా ప్రారంభ ధర రూ. 8.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు CNG ఆప్షన్‌లో లభిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ మాన్యువల్‌కు 20.51 kmpl, ఆటోమేటిక్‌కు 20.3 kmpl, CNG వేరియంట్‌కు 26.11 kmpl వరకు లభిస్తుంది.
Toyota Innova: ఇన్నోవా హైక్రాస్, క్రిస్టా మోడళ్లతో కలిపి ఫిబ్రవరి 2026లో 8,703 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది 8,449 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి 3% వృద్ధి నమోదైంది. ఇన్నోవా క్రిస్టా బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 18.66 లక్షలు కాగా, ఎంట్రీ లెవల్ వేరియంట్ రూ. 18.06 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మైలేజ్ పరంగా ఇది సుమారు 16 కి.మీ వరకు ఇస్తుంది.

Kia Carens: కియా కారెన్స్, క్లావిస్, క్లావిస్ ఈవీ మోడళ్లు కలిసి ఫిబ్రవరి నెలలో 6,815 యూనిట్ల అమ్మకాలతో మూడవ స్థానంలో నిలిచాయి. గత ఏడాది 5,318 యూనిట్లతో పోలిస్తే, ఈసారి మంచి వృద్ధి. కియా కారెన్స్ బేస్ వేరియంట్ రూ. 10.99 లక్షలు. కారెన్స్ క్లావిస్ బేస్ వేరియంట్ రూ. 11.21 లక్షలు కాగా, కారెన్స్ క్లావిస్ EV బేస్ వేరియంట్ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Maruti Suzuki XL6: మారుతి ఎక్స్‌ఎల్ 6 ఫిబ్రవరి నెలలో అమ్మకాలు 1,878 యూనిట్ల నుంచి 3,633 యూనిట్లకు పెరిగి, గతేడాదితో పోలిస్తే 93.5% భారీ వృద్ధిని నమోదు చేసింది. దీంతో మార్కెట్‌లో వాటా 8.6%గా నిలిచింది. ఈ ఎంపీవీ రూ. 11.52 లక్షల నుంచి రూ. 14.48 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య లభిస్తుంది. మైలేజ్ పరంగా పెట్రోల్, CNG వేరియంట్లను బట్టి 20.97 నుంచి 26.32 kmpl ఇస్తుంది.

Toyota Rumion: టయోటా రూమియన్ ఫిబ్రవరిలో అమ్మకాలు 2,099 యూనిట్ల నుంచి 2,817 యూనిట్లకు పెరిగి, 34.2% పెరుగుదల కనిపించింది. ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 10.44 లక్షలు, టాప్ వేరియంట్ రూ. 13.62 లక్షల వరకు ఉంటుంది. మైలేజ్ వేరియంట్ సుమారు 20.11 kmpl, ఆటోమేటిక్ వేరియంట్ 20.51 kmpl వరకు ఇస్తుంది. ఇక CNG వేరియంట్ 26.11 kmpl వరకు మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








