దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు వచ్చేసింది.. మారుతి వ్యాగన్‌ఆర్ కొత్త చరిత్ర!
భారతదేశ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (maruti suzuki india)తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును అధికారికంగా పరిచయం చేసింది. అంతేకాదు, ఇది కేవలం మారుతి సుజుకి మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మాత్రమే కాకుండా, భారతదేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ కారుగా కూడా చరిత్ర సృష్టించింది. కంపెనీ ఈ కొత్త టెక్నాలజీని తన అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన వ్యాగన్ ఆర్ (wagonr)లో ప్రవేశపెట్టింది. భారతీయ కుటుంబాల్లో విశేష ఆదరణ పొందిన ఈ కారు ఇప్పుడు మరింత పర్యావరణహిత సాంకేతికతతో ముందుకు వచ్చింది.
పెట్రోల్‌తో పాటు అధిక శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై కూడా పనిచేసే సామర్థ్యం కలిగిన ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్, దేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఒక కీలక అడుగు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5)కు ముందు రోజు ఈ ఆవిష్కరణ జరగడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల మంత్రి నితిన్ గడ్కరీ జూన్ 4న మారుతి సుజుకి తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ఆవిష్కరణ గురించి ప్రకటించారు.

ఆయన వెల్లడించినట్లుగానే, ఈరోజు మారుతి సుజుకి దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ కారును ప్రజల ముందుకు తీసుకొచ్చింది. భారతదేశంలో ఇథనాల్ ఆధారిత ఇంధన వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కారును తీసుకొచ్చారు. రైతుల నుంచి లభించే వ్యవసాయ ఉత్పత్తులతో తయారయ్యే ఇథనాల్ వినియోగం పెరగడం ద్వారా ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, కాలుష్య ఉద్గారాలు కూడా తగ్గే అవకాశం ఉంది.
దేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ కారుగా నిలిచిన మారుతి వ్యాగన్‌ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్‌ను ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. భారత ఆటోమొబైల్ రంగానికి కీలకమైన ఈ ఈవెంట్‌కు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా హాజరయ్యారు. దేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ ప్రాముఖ్యతను నేతలు వివరించారు. పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా, ఇంధన దిగుమతుల భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో కూడా ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని అభిప్రాయపడ్డారు.
మారుతి సుజుకి అభివృద్ధి చేసిన ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ వ్యాగన్‌ఆర్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది వివిధ రకాల ఇథనాల్-పెట్రోల్ మిశ్రమ ఇంధనాలపై సులభంగా నడవగలదు. ఈ వాహనం స్వచ్ఛమైన ఇథనాల్‌తో పాటు E20 నుంచి E85 వరకు ఉన్న మిశ్రమ ఇంధనాలను కూడా ఉపయోగించగలదు. అంటే ఇంధనంలో 20 శాతం నుంచి 85 శాతం వరకు ఇథనాల్ ఉన్నా, ఇంజిన్ పనితీరులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనం సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఇలాంటి సాంకేతికత భారత మార్కెట్లో ప్రవేశించడం వల్ల భవిష్యత్తులో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇథనాల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రముఖ దేశాల్లో ఒకటిగా ఎదుగుతున్న భారత్‌కు ఇది ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ రంగంలో తొలి అడుగు వేయడం, ఇతర తయారీ సంస్థలకు కూడా ప్రేరణగా నిలిచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications