దేశంలో ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లనే ఎక్కువగా కొంటున్నారు.. వీటికి డిమాండ్ పీక్‌లో ఉంది! ఎక్కడ చూసినా ఇవే
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ గత కొన్నేళ్లుగా స్థిరంగా ఎదుగుతూ వచ్చినప్పటికీ, ఇప్పుడు అది స్పష్టంగా వేగం పెంచుకున్న దశలోకి ప్రవేశించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల విషయంలో వినియోగదారుల ఆలోచనల్లో వచ్చిన మార్పు, పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కలిసొచ్చి ఈ సెగ్మెంట్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాయి. ఈ మార్పు ఎంత వేగంగా జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే తాజా అమ్మకాల గణాంకాలు చాలానే చెప్పేస్తాయి. ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా 14,712 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవ్వగా, కేవలం ఒక నెల వ్యవధిలోనే అంటే మార్చిలో ఈ సంఖ్య ఒక్కసారిగా 22,315కి పెరగడం గమనించదగ్గ విషయం. అంటే, ఒక్క నెలలోనే భారీగా డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కథణంలో గత నెలలో ఎక్కువగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల గురించి చూద్దాం.
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, తయారీదారుల మధ్య పోటీ కూడా అదే స్థాయిలో మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. ముఖ్యంగా 2026 మార్చి నెల అమ్మకాల గణాంకాలు చూస్తే, ప్రధాన ఆటో కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో తమ స్థానం బలపర్చేందుకు ఎంత దూకుడుగా ముందుకు సాగుతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఈ పోటీలో ఎప్పటిలాగే టాటా మోటార్స్(Tata Motors) అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

మార్చి 2026లో టాటా మొత్తం 8,253 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడం ద్వారా మరోసారి మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని చూపించింది. ఫిబ్రవరి నెలలో ఈ సంఖ్య 5,947 మాత్రమే ఉండగా, కేవలం ఒక నెలలోనే 2,306 కార్ల పెరుగుదల సాధించడం గమనించదగ్గ విషయం. ఈ వృద్ధి టాటా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోపై వినియోగదారుల విశ్వాసం ఎంతగా పెరుగుతుందో సూచిస్తోంది. ఇక మహీంద్రా కూడా ఈ రేసులో రెండో స్థానంలో బలంగా ముందుకు సాగుతోంది.
మార్చి నెలలో మహీంద్రా 5,244 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించగా, ఫిబ్రవరిలో 3,174 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, ఒక్క నెలలోనే గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఇది కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లకు వస్తున్న మంచి స్పందనకు నిదర్శనం. అలాగే ఎంజీ ఈ సెగ్మెంట్‌లో మూడో స్థానం నిలబెట్టుకుంది. మార్చి 2026లో ఎంజీ మోటార్ నుండి 5,141 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవగా, ఫిబ్రవరిలో ఈ సంఖ్య 3,556గా ఉంది.

4వ స్థానంలో నిలిచిన మారుతి సుజుకి ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఫిబ్రవరిలో కేవలం 223 యూనిట్లు మాత్రమే విక్రయించిన మారుతి సుజుకి, మార్చి నెలలో ఒక్కసారిగా 949 ఎలక్ట్రిక్ కార్లను అమ్మడం గమనించదగ్గ విషయం. ఈ పెరుగుదల చూస్తే, కంపెనీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ జాబితాలో మరో ఆసక్తికరమైన పేరు విన్‌ఫాస్ట్ (VinFast).
ఇటీవలే భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఈ వియత్నాం సంస్థ, తక్కువ సమయంలోనే మంచి స్పందనను సంపాదిస్తోంది. ఫిబ్రవరిలో 415 యూనిట్లు అమ్మగా, మార్చిలో 691 కార్లను విక్రయించడం ద్వారా తన ప్రెజెన్స్‌ను బలంగా తెలియజేసింది. కొత్త బ్రాండ్ అయినప్పటికీ, వినియోగదారులలో ఆసక్తిని పెంచుకుంటోందని చెప్పవచ్చు. ఇదే సమయంలో హ్యూందాయ్ కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. ఫిబ్రవరిలో 329 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవగా, మార్చిలో ఈ సంఖ్య 476కు పెరిగింది.

అలాగే కియా కూడా తన స్థాయిని మెరుగుపరుచుకుంది. ఫిబ్రవరిలో 303 యూనిట్లు విక్రయించిన కియా, మార్చిలో 458 కార్లను అమ్మడం ద్వారా డిమాండ్ పెరుగుదలను స్పష్టంగా చూపించింది. ప్రీమియం సెగ్మెంట్‌లో BMW, BYD కూడా తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి. మార్చి నెలలో BMW 437 ఎలక్ట్రిక్ కార్లు విక్రయించగా, BYD 414 యూనిట్లు అమ్మి వరుసగా 8వ, 9వ స్థానాల్లో నిలిచాయి. పదో స్థానంలో బెంజ్ 97 యూనిట్లతో నిలిచింది.


Click it and Unblock the Notifications








