ప్రతిచోట ఈ ఎలక్ట్రిక్ కారు గురించే మాట్లాతున్నారు.. ఒక్కదాని కోసం అందరూ క్యూలు.. Mg సేల్స్ రిపోర్ట్
2026 సంవత్సరం చేరుకున్న వేళ, దేశీయ ఆటోమొబైల్ రంగం మరోసారి వెనక్కి తిరిగి చూసుకుంటోంది. డిసెంబర్ నెలతో పాటు 2025 క్యాలెండర్ సంవత్సరం మొత్తం తమ పనితీరు ఎలా ఉందో తెలియజేస్తూ, కార్ల తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను వరుసగా విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే JSW MG మోటార్ ఇండియా కూడా తన తాజా సేల్స్ డేటాను వెల్లడించింది. ఈ గణాంకాలు చూస్తే, కంపెనీకి నెలవారీగా కొన్ని సవాళ్లు ఎదురైనా, మొత్తం సంవత్సరానికి మాత్రం పాజిటివ్ ట్రెండ్ కొనసాగిందని స్పష్టంగా అర్థమవుతుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో JSW MG మోటార్ మొత్తం 6,500 వాహనాలను విక్రయించింది. ఇది అంతకు ముందు ఏడాది డిసెంబర్‌లో నమోదైన 7,516 యూనిట్లతో పోల్చితే సుమారు 13.5 శాతం తగ్గుదలని సూచిస్తోంది.
సంవత్సరం చివర్లో మార్కెట్‌లో డిమాండ్ కొంత తగ్గడం, పోటీ మరింత పెరగడం వంటి కారణాలు ఈ నెలవారీ క్షీణతకు కారణమై ఉండొచ్చని ఆటో రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ ఒక్క నెల గణాంకాల ఆధారంగా కంపెనీ మొత్తం పనితీరును అంచనా వేయలేము. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, 2025 క్యాలెండర్ సంవత్సరాన్ని మొత్తంగా పరిశీలిస్తే JSW MG మోటార్ బలమైన వృద్ధిని నమోదు చేసింది.

కంపెనీ జనవరి నుంచి డిసెంబర్ 2025 వరకు మొత్తం 70,554 వాహనాలను విక్రయించినట్లు వెల్లడించింది. ఇది 2024 సంవత్సరంలో నమోదైన మొత్తం అమ్మకాలతో పోల్చితే 19 శాతం వృద్ధి. నెలవారీ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, సంవత్సరం మొత్తానికి చూస్తే కంపెనీ తన మార్కెట్ ఉనికిని మరింత బలోపేతం చేసుకున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఈ వృద్ధి వెనుక MG మోటార్ విస్తృత ఉత్పత్తి శ్రేణి, ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి ఉంది.
2025 సంవత్సరం JSW MG మోటార్ ఇండియాకు మైలురాళ్లతో నిండిన ఏడాదిగా నిలిచింది. ఈ ఏడాదిలో కంపెనీ సాధించిన ముఖ్యమైన విజయాల్లో ఒకటి, భారత మార్కెట్లో 1 లక్ష ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం. దేశంలో EVలపై ఆసక్తి వేగంగా పెరుగుతున్న సమయంలో, ఈ స్థాయికి చేరుకోవడం MG బ్రాండ్‌కు వినియోగదారుల నుంచి లభిస్తున్న విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది MG విండ్సర్ EV. విడుదలైన తక్కువ కాలంలోనే ఈ కారు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా అవతరించింది. ఆధునిక డిజైన్, ఫీచర్-రిచ్ క్యాబిన్, సౌకర్యవంతమైన రైడ్ క్వాలిటీ, ప్రాక్టికల్ రేంజ్ వంటి అంశాలు ఈ కారును కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చాయి. అందుకే నగర వినియోగదారులే కాదు, ఫ్యామిలీ కస్టమర్లు కూడా ఈ మోడల్‌పై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.
విండ్సర్ EVను MG రెండు వేరియంట్లలో స్టాండర్డ్, ప్రో ఎంపికలతో అందిస్తోంది. కస్టమర్ల అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ఆప్షన్లను అందించడం వల్ల మరింత విస్తృత వర్గాలను ఆకట్టుకునే అవకాశం కంపెనీకి లభించింది. స్టాండర్డ్ వేరియంట్ ప్రాక్టికల్ యూజ్‌పై దృష్టి పెడితే, ప్రో వేరియంట్ అదనపు ఫీచర్లు, ప్రీమియం అనుభూతిని అందిస్తోంది.

ఇటీవలే JSW MG మోటార్ ఇండియా తన 2026 MG హెక్టర్ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ముఖ్యంగా ఈ కొత్త హెక్టర్ అంచనాల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి రావడం ఆటో మార్కెట్‌లో చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తంగా 2026లో కొత్త మోడళ్ల విడుదలలు, టెక్నాలజీ అప్‌డేట్స్, మార్కెట్ విస్తరణతో ఈ వృద్ధిని కొనసాగించగలదా అనే అంశం ఇప్పుడు ఆటో రంగంలో ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications








