ఎలక్ట్రిక్+పెట్రోల్ పవర్‌తో నడిచే JSW మోటార్స్ తొలి కారు.. హైటెక్ ఫీచర్లతో రచ్చ చేయబోతుంది
JSW Groupతో విలీనం తర్వాత MG Motor Indiaలో ఎలక్ట్రిక్ కార్ల హవా మరింత పెరిగింది. ఇప్పటికే మార్కెట్లో కనిపిస్తున్న MG ఈవీలు వినియోగదారుల దృష్టిని బలంగా ఆకర్షించాయి. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో దూసుకెళ్తున్న ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. అలాంటి సమయంలోనే JSW గ్రూప్ మరో సంచలన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటంటే, JSW మోటార్స్ అనే ప్రత్యేక ఆటోమొబైల్ కంపెనీని స్థాపిస్తున్నట్టు ప్రకటించడం. భారతదేశ ప్రయాణీకుల వాహన విభాగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న JSW Motors తన ఎంట్రీని చాలా స్టైలిష్‌గా ప్రకటించింది.
దేశంలో ప్రముఖ వ్యాపార పత్రిక అయిన The Economic Times మొదటి పేజీలో పూర్తి పేజీ ప్రకటన ఇచ్చి, ఆటోమొబైల్ రంగంలోకి తన అధికారిక అడుగును వెల్లడించింది. ఆ ప్రకటనలో చీకటి గదిలో పార్క్ చేసి ఉంచిన ఒక SUV సిల్హౌట్ కనిపిస్తుంది. దానిపై భవిష్యత్తు పిలుస్తోంది. మీరు ప్రయాణంలో చేరుతారా? అనే ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్ ఉంది. ఈ ఒక్క లైన్‌తోనే కంపెనీ తన విజన్‌ను స్పష్టంగా తెలియజేసింది.

ఈ ప్రకటన ద్వారా JSW మోటార్స్ కేవలం తన బ్రాండ్‌ను పరిచయం చేయడం మాత్రమే కాదు, డీలర్ భాగస్వాములను తన ప్రయాణంలో భాగస్వాములుగా ఆహ్వానిస్తోంది. మొదటి కారు లాంచ్‌కు ముందే రిటైల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు కంపెనీ చురుకుగా చర్యలు చేపడుతోందని ఇది సూచిస్తుంది. ఆసక్తి ఉన్న డీలర్లు మార్చి 11, 2026 నాటికి ప్రకటనలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి తమ ఆసక్తిని నమోదు చేసుకోవాలని కోరారు.
ఇది బ్రాండ్ ప్రారంభాన్ని కేవలం ప్రకటన స్థాయిలో కాకుండా, కార్యాచరణ స్థాయిలో కూడా ప్రారంభించిందనే సంకేతాన్ని ఇస్తోంది. ఇక JSW మోటార్స్ నుంచి రానున్న మొదటి మోడల్ విషయానికి వస్తే, అది Jetour T2 i-DM అని భావిస్తున్నారు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చే SUV కావడం విశేషం. అంటే, పూర్తిగా ఎలక్ట్రిక్ కాకుండా, పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలయికలో పనిచేసే పవర్‌ట్రైన్ ఉండే అవకాశం ఉంది.

ఈ మోడల్ ద్వారా JSW మోటార్స్ భారత మార్కెట్లో ప్రీమియం, టెక్నాలజీ ఆధారిత వాహనాలపై దృష్టి పెట్టబోతుందని అర్థమవుతోంది. ఇది ఈ సంవత్సరం దీపావళి నాటికి భారతదేశంలో ప్రారంభించబడుతుంది. Jetour T2 i-DMను భారత మార్కెట్లో ప్రీమియం SUVగా ఉంచాలని భావిస్తున్నారు. దీని అంచనా ధర దాదాపు రూ.45 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ ఎక్కువగా లగ్జరీ కార్ల విభాగంలోనే కనిపిస్తుంది.
సైజ్ పరంగా చూస్తే, ఈ SUV చాలా భారీగా ఉంటుంది. దీని పొడవు 4,785 mm, వెడల్పు 2,006 mm, ఎత్తు 1,875 mm గా నివేదించబడింది. ముఖ్యంగా 2,800 mm వీల్‌బేస్ ఉండటం వల్ల లోపల విస్తారమైన కేబిన్ స్పేస్ లభించే అవకాశం ఉంది. ఫ్యామిలీ ప్రయాణాలకు, లాంగ్ డ్రైవ్స్‌కి సరిపోయేంత లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ ఈ SUVలో ఉంటుందని అంచనా.

పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్‌ను అందించనున్నారు. ఈ ఇంజిన్‌కు 3-స్పీడ్ డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్‌మిషన్ (DHT) జత చేయబడుతుంది. కలిపి ఇది 156 bhp పవర్, 220 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. నగర ప్రయాణాల్లో స్మూత్ డ్రైవింగ్, హైవేల్లో సరైన పనితీరు ఇవ్వగల సామర్థ్యం ఈ సెటప్‌లో ఉంటుంది. ఇందులో 26.7 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చనున్నారు.
ఈ బ్యాటరీతో EV మోడ్‌లో దాదాపు 130 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ రేంజ్ అందించగలదని చెబుతున్నారు. అంటే, రోజువారీ నగర ప్రయాణాల కోసం పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఉపయోగించే అవకాశం ఉంటుంది. దీర్ఘ ప్రయాణాల సమయంలో పెట్రోల్ ఇంజిన్ సపోర్ట్ అందిస్తుంది కాబట్టి రేంజ్ టెన్షన్ కూడా తక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే దాదాపు 30 నిమిషాల్లో 30% నుంచి 80% వరకు ఛార్జ్ చేయగలదు.


Click it and Unblock the Notifications








