పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్.. ఏ మోడల్లోనైనా దొరుకుతుంది.. 3,00,000 కుటుంబాలు కోరుకున్న పెద్ద కారు
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) ఒక భారీ మైలురాయిని అందుకుంది. ఆ కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ ఫ్యామిలీ కారు కియా కారెన్స్ (Kia Carens) దేశీయంగా 3 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును విజయవంతంగా దాటేసింది. 2022 లో మొదటిసారిగా భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, చాలా తక్కువ కాలంలోనే కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంది.
ప్రస్తుతం కారెన్స్ ఫ్యామిలీలో ఒరిజినల్ కారెన్స్‌తో పాటు ప్రీమియం లుక్‌తో వచ్చే కారెన్స్ క్లావిస్ (Carens Clavis), పర్యావరణహితంగా రూపొందించిన కారెన్స్ క్లావిస్ ఈవీ (Carens Clavis EV) మోడళ్లు కూడా చేరిపోయాయి. దీనివల్ల కస్టమర్లకు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వంటి అన్ని రకాల ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి.

మారుతి ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 లకు గట్టి పోటీ
భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga), టయోటా రుమియన్, మారుతి ఎక్స్‌ఎల్6 (XL6) వంటి కార్లు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, కియా కారెన్స్ తన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతోంది. కియా ఇండియా ప్రతినిధుల సమాచారం ప్రకారం.. కారెన్స్ మోడల్‌ను కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్, లేటెస్ట్ టెక్నాలజీ, మెరుగైన కంఫర్ట్ సదుపాయాలతో అప్‌డేట్ చేస్తూ వస్తోంది.
ఈ నిరంతర మార్పుల వల్లే కస్టమర్లు ఈ కారును కొనేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. సాధారణ ఎంపీవీ (MPV) మోడల్ సూపర్ హిట్ అయిన తర్వాత, మరింత లగ్జరీని కోరుకునే వారి కోసం క్లావిస్ వేరియంట్‌ను, అలాగే ఈవీ మోబిలిటీ వైపు మారాలనుకునే కుటుంబాల కోసం క్లేవిస్ ఈవీని కంపెనీ రంగంలోకి దించింది.

కస్టమర్లు ఏ మోడల్‌ను ఎక్కువగా కొంటున్నారో తెలుసా?
కస్టమర్ల కొనుగోలు విధానాన్ని పరిశీలిస్తే కియా కారెన్స్ విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కారెన్స్ ఫ్యామిలీ మొత్తం అమ్మకాల్లో పెట్రోల్ వేరియంట్ల వాటా అత్యధికంగా 60 శాతంగా నమోదైంది. చాలామంది ఫ్యామిలీ కస్టమర్లు దీని పెట్రోల్ ఇంజన్ పర్ఫార్మెన్స్‌కు మొగ్గు చూపారు. ఇక రెండవ స్థానంలో 30 శాతం వాటాతో డీజిల్ వేరియంట్లు నిలిచాయి.
అన్నింటికంటే విశేషం ఏంటంటే ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఎలక్ట్రిక్ మోడల్ కారెన్స్ క్లావిస్ ఈవీ చాలా తక్కువ సమయంలోనే మిగిలిన 10 శాతం అమ్మకాల వాటాను కైవసం చేసుకుంది. అలాగే ఈ కారులో అందుబాటులో ఉన్న 6-సీటర్, 7-సీటర్ సిట్టింగ్ ఆప్షన్లు రెండింటికీ మార్కెట్లో భారీ డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది.
ప్రీమియం లుక్ ఉన్న టాప్ ఎండ్ వేరియంట్ల కోసమే ఎగబడుతున్న జనాలు
ప్రస్తుతం వాహనదారులు బడ్జెట్ శ్రేణి కార్ల కంటే ఎక్కువ ఫీచర్లు, విలాసవంతమైన సదుపాయాలు ఉండే టాప్ ఎండ్ వేరియంట్లను కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కియా కారెన్స్ మొత్తం అమ్మకాల్లో అత్యంత ఖరీదైన, టాప్ ట్రిమ్స్ వాటానే ఏకంగా 18 శాతంగా ఉండటం దీనికి నిదర్శనం.
ఈ టాప్ మోడల్స్ లో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్స్, అధునాతన సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. ఈ చారిత్రాత్మక విజయంపై కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ సున్ హక్ పార్క్ మాట్లాడుతూ.. ఈ సక్సెస్ అనేది తమ ప్రొడక్ట్ స్ట్రాటెజీకి, కస్టమర్ల అవసరాలను సరిగ్గా గుర్తించడానికే దక్కిన ఫలితమని, ఇది కారెన్స్ కారును ఈ సెగ్మెంట్‌లో ఒక బెంచ్‌మార్క్‌గా నిలబెట్టిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఫస్ట్ హాఫ్‌లో ఆల్-టైమ్ రికార్డు సేల్స్
కియా కారెన్స్ సాధించిన ఈ 3 లక్షల యూనిట్ల సేల్స్ మైలురాయి కేవలం ఒక మోడల్‌కే పరిమితం కాలేదు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కియా ఇండియా పోర్ట్‌ఫోలియో మొత్తం అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ముఖ్యంగా కియా సెల్టోస్ (Seltos), సోనెట్ (Sonet), కారెన్స్ కార్లకు ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా.. కంపెనీ భారతదేశంలో తన చరిత్రలోనే అత్యుత్తమ మొదటి ఆరు నెలల అమ్మకాలను నమోదు చేసి రికార్డు సృష్టించింది.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కియా తన లైనప్‌ను మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే త్వరలోనే సరికొత్త కియా సిరోస్ ఈవీ (Syros EV)ని మార్కెట్లో లాంచ్ చేసేందుకు పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications