కస్టమర్లతో మైనే ప్యార్ కియా అనిపించిన కియా.. నాలుగేళ్లలోనే కుటుంబాల ఫస్ట్ ఛాయిస్‌గా మారిన కారు
దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా (Kia) భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన ప్రీమియం ఎంపీవీ కారెన్స్ (MPV Kia Carens) ఇప్పుడు మరో కీలక మైలురాయిని అందుకుంది. ఫిబ్రవరి 15న ఈ ఫ్యామిలీ కారు భారతదేశంలో తన నాలుగో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. 2022 ఫిబ్రవరి 15న ప్రారంభమైన కారెన్స్, కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే భారత కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకుని ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. లాంచ్ సమయంలోనే ఆధునిక డిజైన్, విస్తృతమైన క్యాబిన్ స్పేస్, ఫ్యామిలీకి అనువైన సీటింగ్ ఆప్షన్లు, అధునాతన సేఫ్టీ ఫీచర్లు వంటి అంశాలతో కారెన్స్ మంచి స్పందనను అందుకుంది. మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ MPV, నగర ప్రయాణాలకే కాకుండా లాంగ్ డ్రైవ్‌లకు కూడా సౌకర్యవంతమైన ఎంపికగా నిలిచింది.
పరిశ్రమ గణాంకాలను విడుదల చేసే Society of Indian Automobile Manufacturers (SIAM) డేటా ప్రకారం, ప్రారంభం నుండి ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో మొత్తం 2,77,236 యూనిట్లు అమ్ముడవ్వడం కారెన్స్‌కు ఉన్న భారీ డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఇది కేవలం ఒక మోడల్ సక్సెస్ మాత్రమే కాదు, కియా బ్రాండ్‌పై భారత వినియోగదారుల విశ్వాసానికి నిదర్శనం కూడా. దేశీయ విక్రయాల్లోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో కారెన్స్ తన ముద్ర వేసింది.

కియా ఇండియా 30,000కు పైగా యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా, 'మేక్ ఇన్ ఇండియా' ఉత్పత్తి ప్రపంచ మార్కెట్లోనూ పోటీ పడగలదని నిరూపించింది. భారత మార్కెట్లో కియా కారెన్స్ అమ్మకాల గమనాన్ని పరిశీలిస్తే, ఈ మోడల్ స్థిరమైన, నమ్మదగిన వృద్ధిని నమోదు చేస్తోందని స్పష్టమవుతోంది. ప్రారంభం తర్వాత మొదటి 1 లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకోవడానికి సుమారు 17 నెలలు పట్టింది.
కొత్త మోడల్‌గా మార్కెట్లో స్థానం సంపాదించుకోవడానికి ఇది గమనించదగ్గ వేగమే. అదే సమయంలో, తదుపరి 1 లక్ష యూనిట్లను పూర్తి చేయడానికి సుమారు 20 నెలలు పట్టింది. ఇది మార్కెట్‌లో పోటీ పెరిగినా, ఫ్యామిలీ కారుగా కారెన్స్‌కు ఉన్న డిమాండ్ స్థిరంగా కొనసాగుతుందనే సంకేతం. ఫిబ్రవరి 2025లో 2 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం ఈ MPV విజయ గాథలో కీలక ఘట్టంగా నిలిచింది.

మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, ఇదే రీతిలో అమ్మకాలు కొనసాగితే 2026 మే లేదా జూన్ నాటికి కారెన్స్ మొత్తం 3 లక్షల యూనిట్ల అమ్మకాల సంఖ్యను దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. కుటుంబ అవసరాలకు అనుగుణమైన ఫీచర్లు, విస్తృత సీటింగ్ ఆప్షన్లు, అలాగే బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం ఇవన్నీ కలిసి కారెన్స్‌కు భవిష్యత్తులో కూడా బలమైన విక్రయాలను అందించే అవకాశాన్ని సూచిస్తున్నాయి.
దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఏడు మోడళ్లను విక్రయిస్తోంది. ఈ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో SUVలు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఫ్యామిలీ MPV అయిన కియా కారెన్స్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కియా కార్లలో కారెన్స్ ప్రస్తుతం మూడవ స్థానంలో ఉంది. మొత్తం అమ్మకాల పరంగా చూస్తే, కియా సెల్టోస్ 6,02,390 యూనిట్లతో, కియా సోనెట్ 5,05,246 యూనిట్లతో ముందంజలో ఉన్నాయి.

ప్రత్యేకంగా 2025-2026 ఆర్థిక సంవత్సరం (FY26) ప్రారంభ నెలల్లో కనిపించిన ట్రెండ్ గమనార్హం. తొలి 10 నెలల్లోనే కారెన్స్ 66,454 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానానికి చేరుకుని, అదే కాలంలో 62,398 యూనిట్లు మాత్రమే విక్రయించిన సెల్టోస్‌ను అధిగమించింది. అయితే, మొత్తం అమ్మకాల పరంగా సోనెట్ ఇంకా బ్రాండ్‌కు ప్రధాన బలం. 93,380 యూనిట్ల విక్రయాలతో సోనెట్ ప్రస్తుతం భారతదేశంలో కియా బెస్ట్ సెల్లర్‌గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications








