పెద్ద ఫ్యామిలీల ఫేవరెట్ ఛాయిస్.. ఆరు నెలల్లోనే 1.63 లక్షల కార్ల విక్రయించిన కియా కంపెనీ
భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. జూన్ 2026 నెలలో కంపెనీ అత్యుత్తమ అమ్మకాలతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత ఏడాది జూన్ 2025లో కంపెనీ 20,625 కార్లను విక్రయించగా, ఈ ఏడాది జూన్ నెలలో ఏకంగా 24,552 కార్ల హోల్‌సేల్ అమ్మకాలను జరిపింది. దీని ద్వారా కియా ఇండియా వార్షిక విక్రయాల్లో 19 శాతం బలమైన వృద్ధిని నమోదు చేసింది. కియా ఇండియా చరిత్రలోనే జూన్ నెలలో నమోదైన అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం.
తొలి ఆరు నెలల్లోనే రికార్డు బ్రేకింగ్ సేల్స్
కేవలం జూన్ నెలలోనే కాకుండా, 2026 ఏడాది మొదటి ఆరు నెలల్లో (జనవరి నుంచి జూన్ వరకు) కియా ఇండియా అమ్మకాలు ఆకాశాన్ని తాకాయి. ఈ మొదటి అర్ధభాగంలో కంపెనీ రికార్డు స్థాయిలో మొత్తం 1,63,749 కార్లను విక్రయించింది.

గత ఏడాది ఇదే కాలంలో కియా కేవలం 1,42,139 వాహనాలను మాత్రమే విక్రయించగలిగింది. అంటే ఈ ఏడాది మొదటి ఆరు నెలల అమ్మకాల్లో కంపెనీ ఏకంగా 15.2 శాతం వృద్ధిని సాధించింది. కస్టమర్ల నమ్మకమే తమను ఈ స్థాయికి చేర్చిందని కంపెనీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సెల్టోస్, సోనెట్, క్యారెన్స్ మోడళ్లకు భారీ డిమాండ్
కియా ఇండియా సాధించిన ఈ ఘనవిజయం వెనుక ఆ కంపెనీకి చెందిన పాపులర్ మోడళ్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సరికొత్త డిజైన్, మోడ్రన్ కనెక్టెడ్ ఫీచర్లతో అప్‌డేట్ అయిన కియా సెల్టోస్ (Kia Seltos)ను కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు.

దీనికి తోడు భారత్ NCAP క్రాష్ టెస్టింగ్‌లో ఈ కారుకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ రావడం కస్టమర్లలో నమ్మకాన్ని మరింత పెంచింది. మరోవైపు కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కియా సోనెట్ (Kia Sonet) స్థిరమైన అమ్మకాలతో కంపెనీకి అండగా నిలుస్తోంది. అలాగే పెద్ద కుటుంబాల కోసం 7-సీటర్ ఆప్షన్ వెతుకుతున్న వారికి క్యారెన్స్ (Carens), క్యారెన్స్ క్లావిస్ మోడళ్లు బెస్ట్ ఛాయిస్‌గా మారాయి.
ఎలక్ట్రికల్ కార్ల మార్కెట్లోనూ కియా స్కెచ్
మారుతున్న కాలానికి అనుగుణంగా కియా ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలోనూ తన పట్టును బలపరుచుకుంటోంది. కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన మై26 కియా సిరోస్, క్లావిస్ ఈవీ కార్లకు కస్టమర్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈవీ ప్రోత్సాహకాలతో పాటు, కియా సంస్థ ప్రవేశపెట్టిన బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) విధానం వల్ల కస్టమర్లకు ఈవీ కార్ల కొనుగోలు మరింత సులభంగా మారింది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆగస్ట్‌లో రాబోతున్న కియా సైరోస్ ఈవీ
భారత ఈవీ మార్కెట్లో మరింత సంచలనం సృష్టించేందుకు కియా ఇండియా తన మొట్టమొదటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా సైరోస్ ఈవీ (Kia Syros EV) ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఆగస్ట్ 2026 లో విడుదల కానున్న ఈ కారు మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఈవీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఇప్పటికే ఇండియన్ రోడ్లపై పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించిన ఈ కారు 42 kWh, 49 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానుంది. భారత మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications