సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కొనేస్తున్న కారు.. షోరూమ్‌లలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!
భారత మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు, కియా మోటార్స్ (Kia Motors) తీసుకున్న మొదటి పెద్ద నిర్ణయం సెల్టోస్ (Seltos)ను విడుదల చేయడమే. అప్పట్లో భారతీయ వినియోగదారుల అభిరుచులను బాగా అధ్యయనం చేసిన కియా, "ఈ SUV తప్పకుండా హిట్ అవుతుంది" అనే నమ్మకంతో సెల్టోస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. నిజంగానే కంపెనీ అంచనాలను మించి ఈ SUV భారీ విజయాన్ని అందుకుంది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు, అలాగే యువతను ఆకట్టుకునే లుక్‌తో సెల్టోస్ చాలా తక్కువ సమయంలోనే భారత మార్కెట్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. మొదటి రోజుల్లో సెల్టోస్ కోసం షోరూమ్‌ల వద్ద భారీ క్యూలు కనిపించేవి.
మధ్యతరగతి కుటుంబాలు, యువత ఈ SUV వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యం కొనసాగుతున్న సెగ్మెంట్‌లోకి వచ్చి, దానికి గట్టి పోటీ ఇవ్వడం సెల్టోస్ సాధించిన పెద్ద విజయంగా చెప్పాలి. అయితే కాలక్రమేణా మార్కెట్లో పోటీ మరింత పెరిగింది. కొత్త SUVలు వరుసగా విడుదల కావడం, వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు రావడం వంటి కారణాలతో గత కొన్ని సంవత్సరాలుగా సెల్టోస్ అమ్మకాలు కొంత మందగించాయి.

కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మారుతుంది. 2026 ప్రారంభం నుంచి సెల్టోస్ అమ్మకాలు మరోసారి ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఈ SUVకు వచ్చిన స్పందన చూస్తే, కియా మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కంపెనీ ఏప్రిల్ 2026లో మొత్తం 10,566 సెల్టోస్ యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 6,135 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఇప్పుడు భారీగా పెరిగిన డిమాండ్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో సెల్టోస్ అమ్మకాలు సుమారు 72 శాతం పెరిగాయి. అంటే అదనంగా 4,431 యూనిట్లు అమ్ముడవడం చిన్న విషయం కాదు. ఈ స్థాయి వృద్ధి ఇప్పుడు కియా డీలర్లకు కూడా భారీ ఊరటనిస్తోంది. ప్రస్తుతం SUV మార్కెట్లో పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా, సెల్టోస్‌కు ఇంకా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని ఈ అమ్మకాల గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.

2026 ప్రారంభం నుంచి ఈ SUV అమ్మకాల జోరు చూస్తే, కియా మరోసారి భారత మార్కెట్లో బలమైన కంబ్యాక్ ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. 2025 చివరి నెలల్లో సెల్టోస్ పరిస్థితి అంత ఆశాజనకంగా కనిపించలేదు. నవంబర్‌లో కేవలం 6,305 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, డిసెంబర్‌లో ఆ సంఖ్య మరింత తగ్గి 4,369 యూనిట్లకే పరిమితమైంది. దీంతో మార్కెట్లో "సెల్టోస్ క్రేజ్ తగ్గిపోయిందా?" అనే చర్చలు కూడా మొదలయ్యాయి.
అయితే 2026 ప్రారంభంతోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్త ఏడాది మొదటి నెల నుంచే సెల్టోస్ అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. జనవరి 2026లో ఏకంగా 10,639 సెల్టోస్ కార్లు అమ్ముడవడం ఆటో రంగాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే, 2025 చివరి నెలలతో పోలిస్తే దాదాపు రెట్టింపు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఈ భారీ జంప్‌తో సెల్టోస్ మళ్లీ SUV మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది.

భారత మార్కెట్లో దీని ధర రూ.10.99 లక్షల నుండి ఎక్స్-షోరూమ్ ధర రూ.19.99 లక్షల వరకు ఉంటుంది. ఇది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మూడు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ట్రాన్స్మిషన్ పరంగా, 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్, iMT, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఫీచర్ల పరంగా కూడా ఈ SUV చాలా అధునాతనంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications