మొన్నటిదాకా డిజైన్ చూసి మురిసిపోయారు.. ఇప్పుడు ఈ కారు బిల్డ్ క్వాలిటీ చూసి కాలర్ ఎగరేస్తారు
భారతదేశంలో సేఫ్టీ అనే పదానికి పర్యాయపదంగా మారిన టాటా మోటార్స్‌కే ఇప్పుడు గట్టి పోటీ ఎదురైంది. కియా ఇండియా తన సెకండ్ జనరేషన్ సెల్టోస్ (2026 మోడల్)తో భారత్ NCAP (BNCAP) క్రాష్ టెస్టుల్లో అదిరిపోయే స్కోరు సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో కియా సెల్టోస్ 32 పాయింట్లకు గాను ఏకంగా 31.70 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో టాటా సవాల్ విసిరిన సియెర్రా (Tata Sierra) 31.14 పాయింట్లతో వెనుకబడిపోయింది. ఒకప్పుడు సేఫ్టీ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న కియా, ఇప్పుడు నేరుగా టాటా కోటనే బద్దలు కొట్టడం విశేషం.
డ్రైవర్‌కు డోకా లేదు
క్రాష్ టెస్ట్ నివేదిక ప్రకారం.. కియా సెల్టోస్ ప్రయాణికులకు అద్భుతమైన రక్షణ కల్పిస్తోంది. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో జరిపిన ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్టులో డ్రైవర్, కో-ప్యాసింజర్ తల, మెడ భాగాలు సురక్షితంగా ఉన్నాయని తేలింది. 16 పాయింట్లకు గాను ఈ విభాగంలో 15.70 పాయింట్లు లభించాయి.

ఇక పక్క నుంచి వచ్చే ప్రమాదాలను తట్టుకునే సైడ్ ఇంపాక్ట్ టెస్టులో సెల్టోస్ 16/16 పర్ఫెక్ట్ స్కోరు సాధించింది. డ్రైవర్ ఛాతీ, తొడల భాగాలకు గుడ్ (చాలా మంచి) ప్రొటెక్షన్ లభించింది. పాదాల వద్ద మాత్రం అడిక్వేట్ (పర్వాలేదు) అని రేటింగ్ ఇచ్చారు. మొత్తం మీద చూస్తే, డ్రైవర్ క్యాబిన్ చాలా పటిష్టంగా ఉందని భారత్ NCAP ధృవీకరించింది.
పిల్లల రక్షణలోనూ తిరుగులేదు
చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) విభాగంలో కూడా సెల్టోస్ సత్తా చాటింది. 49 పాయింట్లకు గాను ఈ కారుకు 45 పాయింట్లు లభించాయి. 18 నెలల పాప, 3 ఏళ్ల బాబు డమ్మీలతో జరిపిన పరీక్షల్లో డైనమిక్ స్కోరు 24/24 గా నమోదైంది. అంటే ప్రమాదం జరిగినప్పుడు వెనుక సీటులో కూర్చున్న పిల్లలకు ఎటువంటి హాని కలగకుండా ఈ కారు రక్షణ ఇస్తుంది. చైల్డ్ సీట్ ఇన్‌స్టాలేషన్ విషయంలో కూడా సెల్టోస్ 12/12 పాయింట్లతో క్లీన్ స్వీప్ చేసింది. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఇది అత్యంత సురక్షితమైన ఆప్షన్ అని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.

అసలు ఈ మార్పు ఎలా సాధ్యమైంది?
కియా సెల్టోస్ 2026 మోడల్‌ను కంపెనీ తన అడ్వాన్స్‌డ్ K3 ప్లాట్‌ఫారమ్ పై నిర్మించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో హై-స్ట్రెంత్ స్టీల్‌ను ఎక్కువగా వాడటం వల్ల కారు బాడీ స్ట్రక్చర్ చాలా బలంగా మారింది. దీనికి తోడు కియా ఇప్పుడు తన బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఇస్తోంది. మార్కెట్లో మారుతి విక్టోరిస్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లతో పోటీ పడుతున్న సెల్టోస్, ఇప్పుడు ఈ 5-స్టార్ రేటింగ్‌తో కస్టమర్ల నమ్మకాన్ని రెట్టింపు చేసుకుంది.
ఫీచర్ల గని.. సేఫ్టీకి రాణి
సెల్టోస్‌లో కేవలం బిల్డ్ క్వాలిటీ మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగా కూడా రక్షణ కవచాలు ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటన్నింటికీ మించి లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. ఇది రోడ్డుపై ఎదురుగా వచ్చే అడ్డంకులను గుర్తించి కారును ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తుంది, తద్వారా ప్రమాదాలు జరగకుండా ముందే నివారిస్తుంది.

ధర, పోటీ
ప్రస్తుతం కియా సెల్టోస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.99 లక్షల నుంచి రూ.20.19 లక్షల వరకు ఉంది. సేఫ్టీ విషయంలో రాజీ పడకూడదనుకునే మిడ్-సైజ్ ఎస్‌యూవీ ప్రియులకు ఇది బెస్ట్ డీల్. టాటా సియెర్రా కంటే ఎక్కువ పాయింట్లు సాధించడం వల్ల, టాటా బ్రాండ్ ఇమేజ్‌కు ఇది గట్టి పోటీ ఇస్తోంది. ఈ ఫలితాలతో భారతీయ మార్కెట్లో కేవలం టాటా మాత్రమే కాదు, ఇతర కంపెనీలు కూడా అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాయని స్పష్టమైంది.


Click it and Unblock the Notifications








