అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కార్ ఓనర్ కావచ్చు.. కియా నుంచి మీ బడ్జెట్‌లో కొత్త కారు రాబోతుంది!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అలాగే పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన కలిసి EVలకు డిమాండ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ మార్పును గమనించిన ప్రముఖ బ్రాండ్లు కూడా వేగంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఇటీవలే Toyota, Maruti Suzuki భారత మార్కెట్‌లో తమ తొలి ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టి EV రేసులో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు Kia కూడా మరింత ఆగ్రెసివ్‌గా ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కియా వద్ద ఇప్పటికే ప్రీమియం ఎలక్ట్రిక్ మోడల్స్ ఉన్నాయి. అందులో Kia EV6, Kia Carens Clavis EV, Kia EV9 వంటి మోడళ్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రీమియం సెగ్మెంట్‌కు చెందినవే.
మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే సరసమైన ఎలక్ట్రిక్ కారు మాత్రం కియా పోర్ట్‌ఫోలియోలో లేదు. ఈ లోటును పూడ్చడానికి కంపెనీ ఇప్పుడు కొత్త ప్రణాళికతో ముందుకు వస్తోంది. భారతదేశ రోడ్లపై ఇటీవల కనిపించిన కియా కొత్త ఎలక్ట్రిక్ SUV టెస్ట్ మ్యూల్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. పూర్తిగా కవర్‌తో పరీక్షించబడుతున్న ఈ వాహనం డిజైన్ వివరాలను గోప్యంగా ఉంచినప్పటికీ, కొన్ని ముఖ్యమైన సంకేతాలు బయటపడ్డాయి.

ప్రత్యేకంగా ముందు భాగంలో కనిపించిన హెడ్‌ల్యాంప్ స్టైల్, కాంపాక్ట్ సిల్హౌట్, SUV స్టాన్స్ చూసి ఇది 'సిరోస్' సబ్ కాంపాక్ట్ SUVకి ఎలక్ట్రిక్ వెర్షన్ అయ్యి ఉండవచ్చని తెలుస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV తక్కువ ధరలో మంచి రేంజ్, ఫీచర్లు, కుటుంబానికి సరిపోయే స్పేస్ అందించేలా రూపొందించబడుతున్నట్లు సమాచారం. మధ్యతరగతి వినియోగదారుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న ఈ మోడల్, ధర పరంగా అందుబాటులో ఉండొచ్చని అంచనా.
రాబోయే Kia Syros EV గురించి బయటకు వస్తున్న వివరాలు చూస్తే, అంచనాల ప్రకారం ఈ కారులో డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్లు ఉండే అవకాశం ఉంది. ఒకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా, మరొకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. దీనితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందించే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకంగా ఉండే V2L (Vehicle-to-Load), V2V (Vehicle-to-Vehicle) సామర్థ్యాలు కూడా ఇందులో ఉండొచ్చని సమాచారం. అంటే ఈ కారును పవర్ సోర్స్‌లా ఉపయోగించి ఇతర ఎలక్ట్రిక్ పరికరాలను లేదా అవసరమైతే మరో EVను కూడా ఛార్జ్ చేయగలగడం సాధ్యమవుతుంది. ఇది క్యాంపింగ్ వంటి అవుట్‌డోర్ యాక్టివిటీలకు ఎంతో ఉపయోగపడే ఫీచర్.
ఇంటీరియర్ డిజైన్ విషయంలో చూస్తే, ఇది పెట్రోల్/డీజిల్ ఆధారిత వెర్షన్ డిజైన్‌ను చాలా వరకు అనుసరించే అవకాశం ఉంది. ఇప్పటికే టెస్టింగ్ సమయంలో స్పాట్ అయిన మోడల్‌లో బాహ్య రూపం దాదాపు ఇంధన వెర్షన్‌లా కనిపించింది. బాక్సీ లుక్, సూటిగా ఉన్న లైన్లు, SUV స్టాన్స్ అలాగే కొనసాగుతున్నాయి. అయితే ముందుభాగంలో ఎడమ వైపున ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం ద్వారా ఇది ఎలక్ట్రిక్ వెర్షన్ అని స్పష్టమవుతోంది.
అల్లాయ్ వీల్స్ 17-అంగుళాల సైజ్‌లోనే ఉండే అవకాశం ఉంది. వెనుక బంపర్‌ను కొద్దిగా రీడిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. అలాగే రూఫ్ రెయిల్స్‌లో కూడా స్వల్ప మార్పులు గమనించబడ్డాయి. ఈ చిన్నచిన్న నవీకరణలు EV వెర్షన్‌కు ప్రత్యేక గుర్తింపుని ఇస్తాయి. ప్లాట్‌ఫామ్ విషయానికి వస్తే, నివేదికల ప్రకారం ఈ కొత్త సైరస్ EV అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించబడుతున్న Hyundai Inster EVతో తన ప్లాట్‌ఫామ్‌ను పంచుకునే అవకాశం ఉంది.
ఇది K1 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుందని, ఫ్రంట్-వీల్-డ్రైవ్ (FWD) కాన్ఫిగరేషన్‌లో అందుబాటులోకి రావచ్చని సమాచారం. అధికారిక పవర్‌ట్రెయిన్ వివరాలు ఇంకా ప్రకటించబడలేదు. అయితే అంతర్జాతీయ ఇన్‌స్టర్ EV మోడల్ 42kWh, 49kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 369 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. ఈ కారు గురించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








