డిజైన్ నచ్చలేదా? ధర ఎక్కువైందా? చూడటానికి డిఫెండర్ లా ఉన్నా దీన్ని కొనేందుకు ఇష్టపడని కస్టమర్లు
భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా (Kia) సంస్థకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సెల్టోస్, సోనెట్ వంటి మోడళ్లతో దేశీ మార్కెట్‌ను ఊపేసిన ఈ కొరియన్ కార్ల దిగ్గజానికి ఇప్పుడు ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. ఎంతో ఆశగా, వినూత్నమైన డిజైన్‌తో లాంచ్ చేసిన కియా సైరోస్ (Kia Syros) కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాల విషయంలో ఘోరంగా వెనుకబడిపోతుంది. 2026 ఫిబ్రవరి నెలలో ఈ కారు సేల్స్ గణాంకాలు చూస్తుంటే కంపెనీ మేనేజ్‌మెంట్‌కు చెమటలు పడుతున్నాయి. ఫీచర్లు అదిరిపోయినా, లుక్స్ విషయంలో మాత్రం కస్టమర్లను మెప్పించలేకపోతోందా? అసలు సైరోస్ ఎందుకు ఫెయిల్ అవుతోందో తెలుసుకుందాం.
అమ్మకాల గణాంకాలు ఏం చెబుతున్నాయి?
కియా సైరోస్ లాంచ్ అయినప్పుడు దాని యూనిక్ డిజైన్ చూసి అందరూ ఇది సోనెట్ రేంజ్ లో సక్సెస్ అవుతుందని భావించారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఫిబ్రవరి 2026లో ఈ కారు కేవలం 662 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. దీనికంటే తక్కువ ఫీచర్లు ఉన్న రెనాల్ట్ కైగర్ (701 యూనిట్లు), సిట్రోయెన్ సి3 (753 యూనిట్లు) కూడా సైరోస్ కంటే మెరుగైన అమ్మకాలను నమోదు చేశాయి.

అంతకుముందు నెల జనవరిలో కూడా పరిస్థితి ఏమీ ఆశాజనకంగా లేదు. జనవరిలో కేవలం 465 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. గత ఆరు నెలల రికార్డును పరిశీలిస్తే, కేవలం డిసెంబర్ 2025లో మాత్రమే 1116 యూనిట్లతో వెయ్యి మార్కును దాటగలిగింది. ఈ పరిస్థితి కియా ఇండియాకు పెద్ద తలనొప్పిగా మారింది.
ఫీచర్లలో కింగ్.. కానీ లుక్స్ లో?
నిజానికి కియా సైరోస్ ఫీచర్ల పరంగా తన సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కారు. లోపల క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ రో (వెనుక సీట్లు) స్పేస్ విషయంలో ఈ కారును కొట్టేదే లేదు. ఎత్తుగా ఉండే బాడీ వల్ల హెడ్ రూమ్ కూడా అద్భుతంగా ఉంటుంది.

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కోసం సింగిల్ ప్యానెల్ హౌసింగ్, యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే, దీని బాక్సీ డిజైన్ (పెట్టె లాంటి రూపం) భారతీయ కస్టమర్లకు అంతగా ఎక్కడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడటానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ లాగా కనిపించాలని ప్రయత్నించినా, ఆ రూపం అందరికీ నచ్చడం లేదు.
ADAS, పవర్‌ట్రైన్ ఆప్షన్లు
భద్రత విషయంలో కియా ఎక్కడా రాజీ పడలేదు. సైరోస్ లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఇచ్చారు. ఇందులో ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.

గేర్‌బాక్స్ విషయానికి వస్తే 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డీసీటీ (DCT) వంటి రకరకాల ఆప్షన్లు ఇచ్చారు. అయితే, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.67 లక్షల నుంచి రూ.15.93 లక్షల వరకు ఉండటం కూడా ఒక మైనస్ గా మారింది. అదే ధరలో కస్టమర్లు టాటా నెక్సాన్ లేదా కియా సోనెట్ వంటి మోడళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
సైరోస్ ఈవీపైనే ఆశలన్నీ
ప్రస్తుత పెట్రోల్ వెర్షన్ విఫలమైనా, కియా సంస్థ తన ఆశలన్నీ రాబోయే సైరోస్ ఈవీ (Syros EV) పైనే పెట్టుకుంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారు రోడ్లపై టెస్టింగ్ దశలో ఉంది. ఇది హ్యుందాయ్ ఇన్స్టర్ ఆధారిత K1 ప్లాట్‌ఫారమ్ పై రానుంది. సైరోస్ ఈవీలో 42 kWh, 49 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండవచ్చని సమాచారం. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 369 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ధర కియా కారెన్స్ ఈవీ కంటే తక్కువగా ఉంటుందని, తద్వారా టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీ ఇస్తుందని కియా భావిస్తోంది. మరి ఈవీ వెర్షన్ తోనైనా సైరోస్ దశ మారుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications








