ఈ కారులో ఏదో స్పెషాలిటీ ఉంది.. బుకింగ్ ఓపెన్ చేయగానే 135 సెకన్లలో మొత్తం అమ్ముడుపోయాయి
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) ప్రస్తుతం తన కార్ల అమ్మకాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కంపెనీకి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ విడుదల చేసిన ప్రత్యేక ఎడిషన్ ఎలక్ట్రిక్ SUV అయిన మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ (Mahindra BE 6 Batman Edition) మార్కెట్లో భారీ సంచలనాన్ని సృష్టించింది. ప్రత్యేక డిజైన్, పరిమిత సంఖ్యలో మాత్రమే లభించడం వంటి కారణాల వల్ల ఈ మోడల్‌పై కొనుగోలుదారుల ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. ఈ ప్రత్యేక ఎడిషన్ SUVను కంపెనీ 2025 ఆగస్టు 14న అధికారికంగా విడుదల చేసింది.
విడుదలైన కొద్ది రోజుల్లోనే దీని బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పట్లో కంపెనీ మొత్తం 999 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు ప్రకటించింది. అయితే బుకింగ్‌లు ప్రారంభమైన వెంటనే కొనుగోలుదారుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. కేవలం 135 సెకన్లలోనే అన్ని 999 యూనిట్లు పూర్తిగా అమ్ముడవడం మార్కెట్లో పెద్ద వార్తగా మారింది. ఇది ఈ కారుపై వినియోగదారుల ఆసక్తి ఎంతగా ఉందో స్పష్టంగా చూపించింది.

ఇటీవల వినియోగదారుల నుంచి వచ్చిన భారీ డిమాండ్, ఒత్తిడి కారణంగా మహీంద్రా మరోసారి అదే ప్రత్యేక ఎడిషన్ SUVను తీసుకువచ్చింది. మునుపటిలాగే ఈసారి కూడా పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. మొత్తం 999 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త బ్యాచ్‌కు సంబంధించిన బుకింగ్ ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అయితే మళ్లీ అదే పరిస్థితి కనిపించింది. బుకింగ్‌లు ప్రారంభమైన వెంటనే కొనుగోలుదారులు భారీగా స్పందించారు.
ఉదయం 11 గంటలకు బుకింగ్ ప్రారంభమయ్యాక కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే అన్ని 999 యూనిట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. అంత వేగంగా అమ్ముడవడం చూసి ఆటోమొబైల్ రంగం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇది మార్కెట్లో బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌కు ఉన్న డిమాండ్ ఎంత భారీగా ఉందో మరోసారి నిరూపించింది. మొత్తంగా చూస్తే పరిమిత ఎడిషన్, ప్రత్యేక డిజైన్, ఎలక్ట్రిక్ టెక్నాలజీ కలయిక ఈ SUVను వినియోగదారులలో అత్యంత ఆకర్షణీయంగా మార్చింది.

ప్రత్యేక ఎడిషన్ ఎలక్ట్రిక్ SUVగా వచ్చిన బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ధర పరంగా కొంచెం ప్రీమియంగా ఉంటుంది. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 28.49 లక్షలు. అందువల్ల ఇది ప్రధానంగా ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గానికి అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ, పరిమిత ఎడిషన్ కావడం, ప్రత్యేక డిజైన్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ టెక్నాలజీ కారణంగా ఈ కారుపై కొనుగోలుదారుల ఆసక్తి ఎక్కువగా ఉంది. డెలివరీలు ఏప్రిల్ 10 నుండి ప్రారంభమవుతాయి.
పర్ఫార్మెన్స్ విషయంలో ఇందులో 79 కిలోవాట్ గంటల (kWh) సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఒకసారి చార్జ్‌తోనే సుమారు 682 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ను అందిస్తుంది. దీంతో దూర ప్రయాణాలు కూడా సులభంగా చేయవచ్చు. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ SUVలో ఉన్న మోటార్ శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 285 PS హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. అలాగే 380 Nm పీక్ టార్క్‌ను కూడా అందిస్తుంది.

దీని ఇంటీరియర్ కూడా ఎంతో ప్రీమియంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ SUV 5-సీట్ల ఎంపికతో అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా క్యాబిన్‌ను ఆధునిక శైలిలో డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇందులో ఉపయోగించిన పూర్తిగా నల్లటి పెయింట్ స్కీమ్ ఈ కారుకు ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తుంది. ఈ డార్క్ థీమ్ కారణంగా క్యాబిన్‌లోకి అడుగుపెట్టగానే ఒక ప్రీమియం, స్పోర్టీ ఫీల్ కలుగుతుంది.


Click it and Unblock the Notifications








