90 రోజులు దాటింది మామ ఈ కారును ఒక్కరంటే ఒక్కరు కూడా కొనలేదు.. ఈగలు తోలుకుంటున్న షోరూం వాళ్లు
భారతదేశపు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు ప్రస్తుతం మార్కెట్లో తిరుగులేదు. థార్, స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 వంటి మోడల్స్‌తో సేల్స్ పరంగా దూసుకుపోతోంది. అయితే, అదే మహీంద్రా పోర్ట్‌ఫోలియోలో ఒక కారు మాత్రం ఇప్పుడు ఐసీయూలో ఉన్న రోగిలా మారిపోయింది. అదే మహీంద్రా మరాజో (Mahindra Marazzo). ఒకప్పుడు ఇన్నోవాకు గట్టి పోటీ ఇస్తుందని భావించిన ఈ 7-సీటర్ కారును కొనేందుకు ఇప్పుడు ఒక్క కస్టమర్ కూడా ముందుకు రావడం లేదు. తాజా మార్చి 2026 విక్రయాల గణాంకాలు చూస్తుంటే ఈ కారు ప్రస్థానం ముగిసిపోయిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన మార్చి 2026 సేల్స్ రిపోర్ట్ చూసి వాహన రంగ నిపుణులు విస్మయానికి గురవుతున్నారు. ఈ ఏడాది (2026) జనవరి నుంచి ఇప్పటి వరకు అంటే వరుసగా మూడు నెలల పాటు ఒక్క మరాజో కారు కూడా అమ్ముడుపోలేదు. జనవరిలో 0, ఫిబ్రవరిలో 0, మార్చిలో 0.. ఇలా ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ ఎంపీవీ ఖాతా తెరవలేదు. గతేడాది డిసెంబర్‌లో కేవలం 80 యూనిట్లు అమ్ముడయ్యాయి. అప్పటి నుంచి ఈ కారు విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. ఒకప్పుడు ప్రతి నెలా సగటున 30 నుంచి 40 యూనిట్లు అమ్ముడయ్యే ఈ కారు, ఇప్పుడు షోరూమ్లలో దుమ్ము పడుతోంది.

మరాజో విక్రయాలు సున్నాకు చేరుకోవడంతో మహీంద్రా సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు సమాచారం. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కారు ఇంకా లిస్ట్ అయ్యి ఉన్నప్పటికీ, కొత్తగా ఈ కారును ఎవరూ బుక్ చేసుకోవడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరాజో ఎక్స్-షోరూమ్ ధరలు రూ.14.59 లక్షల నుంచి రూ. 17 లక్షల వరకు ఉన్నాయి. కానీ ఈ ధరలో కస్టమర్లు మహీంద్రాకే చెందిన స్కార్పియో లేదా ఎక్స్‌యూవీ వంటి ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు.
మహీంద్రా మరాజోను చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. షార్క్ (సొరచేప) బాడి నుంచి స్ఫూర్తి పొంది ఈ కారు డిజైన్‌ను తయారు చేశారు. ముందు భాగంలో షార్క్ పళ్ళ లాంటి గ్రిల్, వెనుక భాగంలో షార్క్ తోకను పోలిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణ. లోపల కూడా ప్రీమియం లుక్ కోసం డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఇచ్చారు. ముఖ్యంగా ఇందులో ఉన్న రూఫ్ మౌంటెడ్ ఎయిర్ వెంటింగ్ సిస్టమ్ సెకండ్, థర్డ్ రో ప్రయాణికులకు త్వరగా చల్లదనాన్ని ఇస్తుంది. ఇన్ని మంచి ఫీచర్లు ఉన్నప్పటికీ, కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఈ కారు విఫలమైంది.

మరాజోలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 121 హార్స్ పవర్ శక్తిని, 300 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ కారులో సేఫ్టీకి కూడా పెద్దపీట వేశారు. ఏబీఎస్, ఈబీడీ, ఐసోఫిక్స్ మౌంట్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటివి స్టాండర్డ్‌గా వస్తాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 4-స్టార్ రేటింగ్‌ను కూడా సాధించింది. అయినా సరే, మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్‌ఎల్6, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి ప్రత్యర్థుల ధాటికి మరాజో తట్టుకోలేకపోయింది.
మరాజో విఫలం కావడానికి ప్రధాన కారణం అందులో పెట్రోల్ ఇంజన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేకపోవడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నేటి కాలంలో కస్టమర్లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఎక్కువగా కోరుకుంటున్నారు. అలాగే, మహీంద్రా తన ఫోకస్ మొత్తాన్ని స్కార్పియో ఎన్, ఎక్స్‌యూవీ 700 పై పెట్టడంతో మరాజోకు సరైన మార్కెటింగ్ దక్కలేదు. ప్రస్తుతం మహీంద్రా కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతుండటంతో, త్వరలోనే మరాజోను మార్కెట్ నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








