టాప్-15 ఎస్‌యూవీల లిస్టులో మహీంద్రాదే పైచేయి.. టాటా, టయోటా అన్నీ దీని వెనుకే
భారత ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీల (SUV) హవా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా 4.5 మీటర్ల నుంచి 4.8 మీటర్ల పొడవు ఉండే భారీ ఎస్‌యూవీల విభాగంలో పోటీ మామూలుగా లేదు. అయితే, మార్చి 2026 సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే ఒకే ఒక్క పేరు మార్కెట్‌ను శాసిస్తోంది. టయోటా ఫార్చ్యూనర్, టాటా హారియర్, సఫారీ వంటి దిగ్గజ కార్లు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ వెనక్కి నెట్టి మహీంద్రా స్కార్పియో తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. విచిత్రమేమిటంటే, కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ మోడల్స్ మహీంద్రా XEV 9e లేదా XUV7X0 కూడా స్కార్పియో దరిదాపుల్లోకి రాలేకపోయాయి.
1. మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio):
ఈ సెగ్మెంట్‌లో మహీంద్రా స్కార్పియో ఒక అన్-స్టాపబుల్ ఫోర్స్‌గా మారింది. మార్చి 2026లో ఏకంగా 14,578 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలలో 13,913 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఏడాదిలో 4.78% వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం ఈ విభాగంలో 37.21% మార్కెట్ వాటా కేవలం స్కార్పియో వద్దే ఉండటం విశేషం. అది క్లాసిక్ మోడల్ అయినా, ఎన్ (N) మోడల్ అయినా జనం దీనికే జై కొడుతున్నారు.

2. మహీంద్రా XUV7X0:
స్కార్పియో తర్వాత రెండో స్థానంలో కూడా మహీంద్రా కారే ఉండటం విశేషం. XUV7X0 మోడల్ మార్చి నెలలో 9,210 యూనిట్ల విక్రయాలను సాధించింది. 2025 మార్చితో పోలిస్తే ఇది 34.43% భారీ వృద్ధిని సాధించింది. ప్రీమియం ఫీచర్లు, సేఫ్టీ రేటింగ్ ఈ కారును ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువ చేశాయి.
3. టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner):
భారీ ఎస్‌యూవీలంటే గుర్తొచ్చే పేరు ఫార్చ్యూనర్. అయితే సేల్స్ పరంగా ఇది మూడో స్థానానికే పరిమితమైంది. మార్చి 2026లో 3,795 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది కంటే 11.88% వృద్ధి కనిపించినప్పటికీ, స్కార్పియో అమ్మకాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ధర ఎక్కువగా ఉండటం, స్కార్పియో ఎన్ (N) నుంచి గట్టి పోటీ ఎదురవ్వడం దీనికి ప్రధాన కారణం.

4. మహీంద్రా XEV 9S:
మహీంద్రా నుంచి కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ మోడల్ XEV 9S అరంగేట్రం అదిరిపోయింది. మార్చి నెలలో 3,254 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. కొత్త టెక్నాలజీ, బాక్సీ డిజైన్ ఈ కారుకు కలిసి వచ్చాయి.
5. టాటా హారియర్/ఈవీ (Tata Harrier/EV):
టాటా హారియర్ మార్కెట్లో తన ఉనికిని చాటుకుంటోంది. మార్చి 2025లో కేవలం 1,265 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది మార్చిలో ఏకంగా 123.4% వృద్ధితో 2,826 యూనిట్లు అమ్ముడయ్యాయి. హారియర్ ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచ్ అవ్వడం టాటాకు ప్లస్ పాయింట్‌గా మారింది.

6. మహీంద్రా XEV 9e:
మహీంద్రాకు చెందిన మరో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XEV 9e కొంచెం వెనకబడింది. గతేడాది కంటే 15.43% క్షీణతతో 1,759 యూనిట్లకు పరిమితమైంది. మార్కెట్లో ఇతర ఎలక్ట్రిక్ కార్ల పోటీ పెరగడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.
7. టాటా సఫారీ (Tata Safari):
టాటా సఫారీ 1,530 యూనిట్ల అమ్మకాలతో ఏడో స్థానంలో ఉంది. హారియర్‌తో పోలిస్తే సఫారీ వృద్ధి కేవలం 8.13% మాత్రమే ఉంది. ఫ్యామిలీ ఎస్‌యూవీగా పేరున్నప్పటికీ, మహీంద్రా XUV7X0 గట్టి పోటీనిస్తోంది.
8. హ్యుందాయ్ అల్కజార్ (Hyundai Alcazar):
హ్యుందాయ్ అల్కజార్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. గతేడాది 1,431 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి కేవలం 893 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఏకంగా 37.6% డిగ్రోత్ నమోదైంది.

9. ఎంజీ హెక్టర్ (MG Hector):
ఎంజీ హెక్టర్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 55.39% వృద్ధితో 850 యూనిట్లను విక్రయించింది. టెక్ ఫీచర్లు ఇష్టపడే వారికి హెక్టర్ ఇప్పటికీ హాట్ ఫేవరెట్.
10. జీప్ కంపాస్ (Jeep Compass):
జీప్ కంపాస్ 159 యూనిట్ల అమ్మకాలతో పదో స్థానంలో ఉంది. 11.97% వృద్ధి ఉన్నప్పటికీ, మొత్తం మార్కెట్ వాటాలో ఇది కేవలం 0.41% మాత్రమే.
ఇతర మోడల్స్ పరిస్థితి:
లిస్టులో చివరి స్థానాల్లో ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ (120 యూనిట్లు), జీప్ మెరిడియన్ (98 యూనిట్లు), స్కోడా కోడియాక్ (64 యూనిట్లు), ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ (42 యూనిట్లు) ఉన్నాయి. సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ ఒక్క యూనిట్ కూడా అమ్మలేక సున్నా వద్దే నిలిచిపోయింది.


Click it and Unblock the Notifications