పాపం మహీంద్రా.. కంపెనీలో దీని పరిస్థితి మరే కారుకు లేదు భయ్యా.. జూన్లో రోజుకో కారు మాత్రమే అమ్ముడైంది
భారత ఆటోమొబైల్ మార్కెట్లో మహీంద్రా కంపెనీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత నెల అంటే జూన్ 2026 లో మహీంద్రాకు చెందిన స్కార్పియో, థార్, బొలెరో వంటి మోడళ్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే ఇదే సమయంలో కంపెనీకి చెందిన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV) మహీంద్రా XUV 400 EV కి మాత్రం కస్టమర్లు భారీ షాకిచ్చారు. గత నెలలో ఈ కారును కొనేందుకు కస్టమర్లు అస్సలు ఆసక్తి చూపించలేదు. ఫలితంగా జూన్ నెలలో దేశవ్యాప్తంగా కేవలం 31 మంది మాత్రమే ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. దీంతో కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.
ఏకంగా 87 శాతం పడిపోయిన మహీంద్రా XUV 400 EV సేల్స్
గతేడాది విక్రయాలతో పోల్చి చూస్తే మహీంద్రా XUV 400 EV అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన ఏకంగా 87 శాతం ఘోరంగా పడిపోయాయి. సరిగ్గా ఏడాది క్రితం అంటే జూన్ 2025 లో కంపెనీ 231 యూనిట్ల ఎక్స్‌యూవీ 400 ఈవీ కార్లను విక్రయించింది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 31 కి పడిపోవడం ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మార్కెట్లో టాటా పంచ్ ఈవీ, విన్‌ఫాస్ట్ వంటి సరికొత్త కాంపిటీటర్లు రావడం వల్లనే మహీంద్రా ఎలక్ట్రిక్ కారుకు డిమాండ్ తగ్గి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారు డిజైన్ పరంగా చాలా స్పోర్టీగా, మోడ్రన్‌గా ఉన్నప్పటికీ కస్టమర్లను ఆకట్టుకోవడంలో వెనుకబడింది.
సింగిల్ ఛార్జ్‌తో 456 కిలోమీటర్ల మైలేజ్
ఈ ఎలక్ట్రిక్ కారు ఫీచర్ల విషయానికి వస్తే.. దీని ఫ్రంట్ భాగంలో క్లోజ్డ్ గ్రిల్‌తో పాటు మహీంద్రా సిగ్నేచర్ కాపర్-ఫినిష్డ్ ట్విన్-పీక్స్ లోగో ఉంటుంది. కారు లోపల 10.25 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

పర్ఫార్మెన్స్ పరంగా ఈ కారు కేవలం 8.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారులో 34.5 kWh, 39.4 kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. చిన్న బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 375 కిమీ, పెద్ద బ్యాటరీ 456 కిమీల అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్ ఇస్తాయి.
రూ.15.49 లక్షల ప్రారంభ ధర..
ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ కారు ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో కేవలం 50 నిమిషాల్లోనే కారు బ్యాటరీ 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. సేఫ్టీ పరంగా కూడా మహీంద్రా ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), కార్నరింగ్ ఎయిర్ కంట్రోల్ , హిల్-స్టార్ట్ అసిస్ట్ వంటి పటిష్టమైన సేఫ్టీ ఫీచర్లను అందించారు.

భారత మార్కెట్లో ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.15.49 లక్షల నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.17.69 లక్షల వరకు ఉంటుంది. ఇంత మంచి ఫీచర్లు, సేఫ్టీ ఉన్నప్పటికీ కస్టమర్లు మాత్రం ఈ కారు వైపు చూడకపోవడం ఆటో మొబైల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications